నేరము.. హింస
ఆత్మీయం
అహింసా పరమోధర్మః అన్నారు పెద్దలు. అంటే హింసించకుండా ఉండటమనేది అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైనదని అర్థం. అలాగని హింస అంటే, జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు బుద్ధభగవానుడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా– ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన జీవహింస ఎంత పాపకార్యమో చెప్పే ఒక జాతక కథ ఉంది. ఒకడు ఒక దేవతకు ఒక మేకపోతును బలిస్తూ ఉంటాడు.
అప్పుడు ఆ మేకపోతు పెద్దగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి బలిచ్చేవాడు కత్తిదించుతాడు. వెంటనే ఏడుస్తుంది. అప్పుడు వాడు– ‘‘ ఓ మేకా! ఎందుకు నవ్వావు? ఎందుకు ఏడ్చావు?’’ అని అడిగాడు. అప్పుడు ఆ మేక ‘‘ఓరీ మూర్ఖుడా! నేనూ నీకులాగా ఒక యజ్ఞంలో మేకను వధించాను. పుణ్యం రాకపోగా 500 జన్మలు మేకగా పుట్టే పాపం కలిగింది. ఇప్పటికి 499 సార్లు మేకగా పుట్టి మెడ నరికించుకున్నాను. ఇది ఆఖరిది. ఈ రోజుతో నా పాపం తీరిపోతుందని ఆనందంతో నవ్వాను. ఇక నన్ను చంపడం వల్ల నీకు ఐదువందల మేక జన్మలు కలుగుతాయి కదా! అని నీ దుస్థితికి బాధపడి ఏడ్చాను’’ అంది. అంటే– ‘జీవహింస’ ఎంత పాపకార్యమో’ అని చెప్పడానికి చెప్పిన కథ ఇది. దీనిలోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడం అవసరం.