మనది వేదభూమి, మనది పుణ్యభూమి అని గొప్పలు చెప్పుకుంటూ గర్విస్తుంటాం. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అంటూ సూక్తిముకావళిని వల్లిస్తూ నిశ్చింతగా బతికేస్తుంటాం. ‘ఆకాశంలో సగం’ అంటూ అతివలను ఆకాశానికెత్తేస్తుంటాం. ఇలాంటి మాటలన్నీ వినడానికి సంగీతం కంటే శ్రావ్యంగా చాలా బాగుంటాయి. ఇవన్నీ నిజాలనుకుంటే మాత్రం అంతకంటే అమాయకత్వం ఉండదు. నీతులకూ చేతలకూ ఏమాత్రం పొంతన లేని వ్యవస్థ మనది. అంతర్జాతీయ సర్వేలలో మహిళలకు రక్షణ కరువైన దేశాల్లో మన పవిత్ర భారతదేశం అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం.
ఆరేళ్ల కిందట దేశ రాజధానిలో ‘నిర్భయ’ సంఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిరసనల వేడికి ప్రభుత్వంలోనూ కొంత చలనం వచ్చింది. ఫలితంగా ‘నిర్భయ’ చట్టం అమలులోకి వచ్చింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కనిష్టంగా ఇరవయ్యేళ్ల కఠిన కారాగార శిక్ష మొదలుకొని గరిష్టంగా యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష వరకు విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. శిక్షలను కఠినతరం చేస్తే నేరాలు తగ్గుముఖం పడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్టాలకు పదును పెట్టినా, మన దేశంలో మహిళల పట్ల నేరాలు ఏమాత్రం తగ్గలేదు సరికదా, నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. ‘నిర్భయ’ సంఘటనకు ఏడాది ముందు 2011లో ది థామ్సన్ రాయిటర్స్ సంస్థ జరిపిన సర్వేలో మహిళలకు రక్షణ కరువైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉండేది. అఫ్ఘానిస్తాన్, సిరియా, పాకిస్తాన్ ఆ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవి. ఇదే సంస్థ ఈ ఏడాది విడుదల చేసిన జాబితా ప్రకారం మహిళలకు రక్షణ కరువైన దేశాల్లో భారత్ మొదటి స్థానానికి ఎగబాకింది. మహిళలపై లైంగిక అత్యాచారాలతో పాటు బాలికలు, మహిళల అక్రమ రవాణాలోనూ భారత్ మొదటిస్థానంలో ఉందని, మహిళలకు భారత్ ఏమాత్రం సురక్షితమైన దేశం కాదని ఈ జాబితా కుండబద్దలు కొట్టింది. చట్టాలకు పదును పెట్టినంత మాత్రాన ఫలితాలు సాధించడం సాధ్యంకాదనే చేదు నిజాన్ని ఈ జాబితా తేటతెల్లం చేస్తోంది. ‘నిర్భయ’ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లలు మొదలుకొని జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధ మహిళలు సైతం దుర్మార్గుల కీచకాలకు బలైపోతున్న ఉదంతాలు నిత్యం వార్తలకెక్కుతూనే ఉన్నాయి.
‘నిర్భయ’ చట్టం తర్వాత...
‘నిర్భయ’ సంఘటన 2012 డిసెంబర్ 16న జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆ ఏడాది దేశవ్యాప్తంగా 24,923 అత్యాచార సంఘటనలు నమోదయ్యాయి. గత ఏడాది ఆఖరులో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 నాటి గణాంకాలతో నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 38,947 అత్యాచార సంఘటనలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు సగటున 106 అత్యాచార సంఘటనలు నమోదవుతున్నాయి. ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు మైనర్ బాలికలే ఉంటున్నారని కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. మొత్తం 38,947 సంఘటనలకు గాను 36,859 సంఘటనల్లో నిందితులు బాధితులకు బంధువులు లేదా బాగా తెలిసిన వారేనని తెలిపింది. ‘నిర్భయ’ సంఘటన జరిగిన ఢిల్లీలో ఆ తర్వాతి నాలుగేళ్ల వ్యవధిలో అత్యాచార సంఘటనలు ఏకంగా 277 శాతం మేరకు పెరిగాయి. ఇతర నేరాలతో పోలిస్తే, అత్యాచార సంఘటనల్లో నిందితులకు శిక్షలు పడుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్సీఆర్బీ వెల్లడించిన వివరాల ప్రకారం 2016లో అత్యాచార సంఘటనలకు సంబంధించి ప్రతి నలుగురు నిందితుల్లో ఒకరికి మాత్రమే శిక్ష పడిన సందర్భాలు ఉన్నాయి. ఇతర నేరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2016లో మహిళల పట్ల దేశవ్యాప్తంగా 3,38,594 నేరాలు జరిగాయి. ఎన్సీఆర్బీ వివరాల ప్రకారం... 2012 నుంచి 2016 వరకు అత్యాచార సంఘటనలు ఏడాదికేడాది పెరుగుతూనే వస్తున్నట్లు నమోదైన కేసుల సంఖ్యలే చెబుతున్నాయి. గడచిన రెండేళ్లలోని పరిస్థితులను చూసుకున్నా, మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక సంఘటనలు పెరుగుతూనే వస్తున్నట్లుగా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కశ్మీర్‌లోని ఖటువాలో ఎనిమిదేళ్ల బాలికపై ఒక గుడిలో జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ‘నిర్భయ’ సంఘటన తర్వాత దాదాపు అదే స్థాయిలో నిరసనలకు దారి తీసింది. ఈ సంఘటనలో గుడి పూజారి, అతడి కొడుకు, పూజారికి సమీప బంధువైన ఒక మైనర్ బాలుడితో పాటు పోలీసులు కూడా నిందితులుగా ఉన్నారు. గత నెలలో కోల్‌కతాలో వందేళ్లు నిండిన వృద్ధురాలిపై ఒక యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. దేశంలోని తాజా పరిస్థితులకు ఖటువా, కోల్‌కతాల్లో జరిగిన సంఘటనలు చిన్న నమూనాలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు దేశం నలుమూలలా ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు పూర్తి సురక్షితమైన ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఇంటా బయటా ప్రతిచోటా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బడి, గుడి, కళాశాలలు, కార్యాలయాలు ఏవీ వీటికి మినహాయింపు కావు. మహిళల పట్ల నేరాలకు ఒడిగట్టే వారిలో కొందరు చట్టసభల్లో సైతం కొనసాగుతున్నారు. ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’ వెల్లడించిన వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా 1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 51 మంది మహిళల పట్ల పాల్పడిన నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీల వారీగా చూసుకుంటే, మహిళల పట్ల నేరాలకు పాల్పడిన వారిలో బీజేపీకి చెందిన చట్టసభ్యులే అత్యధికంగా 14 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసేన–7, తృణమూల్ కాంగ్రెస్–6 ఉన్నాయి.
అడుగడుగునా వివక్ష
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని గర్వంగా చెప్పుకుంటాం గానీ, మన ప్రజాస్వామిక స్ఫూర్తి అంతా ఎన్నికల తతంగానికే పరిమితం. జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న స్పృహ నేటికీ మన చట్టసభల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ కనిపించదు. ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు మూలనపడి, మహిళలకు చట్టసభల్లో సమ ప్రాధాన్యం దక్కకుండాపోయింది. చట్టసభల్లోనే పితృస్వామ్య భావజాలం ఇంత బాహాటంగా రాజ్యమేలుతుంటే ఇక మిగిలిన చోట్ల మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవాల్సిందే. మన సమాజంలో మహిళల పట్ల గల వివక్షాపూరితమైన ధోరణి కారణంగానే మహిళలపై నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకటి కాలంలో మహిళల పట్ల వివక్ష పుట్టుక నుంచి పోయే వరకు కొనసాగేది. సాంకేతికత పెరిగి, గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక ఇంకా పుట్టక మునుపే వారిపై వివక్ష మొదలవుతోంది. కడుపులో ఉన్నది ఆడశిశువని తేలగానే నిర్దాక్షిణ్యంగా భ్రూణహత్యలకు పాల్పడేవారి సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. అడ్డూ అదుపూ లేని భ్రూణహత్యల కారణంగానే గడచిన కొన్నేళ్లలో ఆడశిశువుల జననాలు తగ్గుముఖం పట్టాయి. జనాభా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షపై నిషేధాజ్ఞలు విధించినా, గుట్టు చప్పుడు కాకుండా ఈ పరీక్షలు జరిపే స్కానింగ్ సెంటర్లు యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటూనే ఉన్నాయి. జనాభా లెక్కలను పరిశీలిస్తే దశాబ్దకాలంలోనే లింగనిష్పత్తిలో వచ్చిన మార్పులు కళ్లకు కడతాయి. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 927 మంది స్త్రీలు ఉండగా, 2011 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 914 స్త్రీలు మాత్రమే ఉన్నారు. దక్షిణాదితో పోలిస్తే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. 2011 లెక్కల ప్రకారం పంజాబ్‌లో లింగ నిష్పత్తి 1000: 793 కాగా, హర్యానాలో 1000: 820. యథేచ్ఛగా సాగిన భ్రూణహత్యల పర్యవసానమే ఇదంతానని అమర్త్యసేన్ వంటి మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో మగపిల్లాడు పుడితే వరప్రసాదంగా తలచి వేడుకలు చేసుకోవడం, ఆడపిల్ల పుడితే భారంగా తలచి కుంగిపోవడం వంటి ధోరణి వల్లనే మన దేశంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా విద్య, ఆరోగ్య అంశాల్లో ఈ వివక్ష దారుణంగా ఉంటోందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచబ్యాంకు, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెండ్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) 2010లో మన దేశంలోని ఆడపిల్లలు, మగపిల్లల కార్యకలాపాలపై ఒక సర్వే నిర్వహించాయి. బడికి వెళ్లే వయసు ఉన్న వారిలో ఆడపిల్లలు రోజుకు సగటున ముప్పావు గంట సేపు ఇంటి పనుల్లో నిమగ్నమై గడుపుతూ ఉంటే, మగ పిల్లలు ఆటపాటల్లో, ఇతర వ్యాపకాల్లో గడుపుతున్నారు.
మరికొన్ని దారుణాలు
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రమే కాదు, మరిన్ని దారుణాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కులం, మతం, హోదా తలకెక్కించుకున్న తల్లిదండ్రులు పిల్లల పాలిట కాలయముళ్లలా మారుతున్నారు. ఇతర కులం లేదా ఇతర మతానికి చెందిన వారిని తమ పిల్లలు ప్రేమించినట్లు తెలిసినా, ఒకవేళ వారు పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్నా తల్లిదండ్రులు పరువు హత్యలకు తెగిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అగ్రకులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లాడటమే అతడి నేరమైంది. వారి పెళ్లిని సహించలేని అమృత తండ్రి మారుతీరావు పథకం ప్రకారం ప్రణయ్‌ని దారుణంగా చంపించాడు. ఇదివరకు ఇలాంటి పరువు హత్యలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరిగేవి. అక్కడ ఇప్పటికీ అలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, కొద్ది సంవత్సరాలుగా పరువు హత్యల సంస్కృతి దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. పరువు హత్యల సంస్కృతి భారత్‌లోనే కాకుండా, పశ్చిమాసియా, దక్షిణాసియా దేశాల్లోనూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 20 వేల మంది మహిళలు పరువు హత్యలకు బలవుతున్నారని బీబీసీ ఒక కథనంలో వెల్లడించింది. ప్రేమ పేరిట అమ్మాయిలను వేధించే పోకిరీలు, తమను తిరస్కరించిన అమ్మాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడటం వంటి ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలను చట్టం నిషేధించినా, ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాల పాలనపడిన బాలికలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, మైనారిటీ తీరకుండానే గర్భం దాల్చడం వల్ల అకాలమరణాల పాలవుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టేందుకు 1929లో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తర్వాత 2006లో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తూ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. తాజా లెక్కలను చూసుకుంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్ది వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.7 శాతం మంది బాలికలకు పద్దెనిమిదేళ్లు నిండకుండానే పెళ్లిళ్లు జరిగాయి. బాల్య వివాహాలు ఉత్తరాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాల్య వివాహాలది ఒక ఎత్తయితే, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న బలవంతపు పెళ్లిళ్లకు లెక్కే లేదు. ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లపై గణాంకాలు సేకరించడం సామాజిక అధ్యయన బృందాలకు సాధ్యం కాని పని.
ఇక మహిళలు ఎలా ఉండాలో, వారి కట్టుబొట్టు అలవాట్లు ఎలా ఉండాలో ఆంక్షలు విధించే ఖాప్ పంచాయతీలకు దేశంలో కరువు లేదు. ఆడపిల్లలు మొబైల్‌ఫోన్లు వాడరాదు, జీన్స్ ధరించరాదంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఖాప్ పంచాయతీలు ఫత్వాలు జారీ చేసిన వార్తలు అక్కడక్కడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామ పెద్దలు మహిళలు నైటీలు ధరించి వీధుల్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన ఉదంతం వార్తలకెక్కింది. అమ్మాయి కట్టుబొట్టు తీరు సక్రమంగా లేకపోవడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అడ్డగోలుగా వాదించే వారి సంఖ్య తక్కువ కాదు. అలాంటప్పుడు పసిపిల్లలు మొదలుకొని పండుముదుసళ్లపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నకు అలాంటి వారి వద్ద ఎలాంటి సమాధానమూ ఉండదు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యంతో పాటు పాలకుల్లో గట్టి రాజకీయ సంకల్పం ఏర్పడితే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
మహిళలకు రక్షణ లేని దేశాలు
భారత్
అఫ్ఘానిస్తాన్
సిరియా
సోమాలియా
సౌదీ అరేబియా
పాకిస్తాన్
కాంగో
యెమెన్
నైజీరియా
అమెరికా
Comments
Please login to add a commentAdd a comment