
కొందరికి ఎదుటి వాళ్లకి ఏమాత్రం ఇష్టంలేని మాటలు మాట్లాడటం సరదా. మన మాటలు వినలేక చెవులు మూసుకుంటుంటే చూడాలనుకుంటారు. మన మాటలు ప్రియం కలిగించినా లేకపోయినా... అప్రియం మాత్రం కలిగించకూడదు. మధురంగా మాట్లాడటం ఒక కళ. మధురంగా మాట్లాడలేకపోయినా ఫరవాలేదు కానీ, చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు. చక్కగా, ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి ఒకడు ‘‘అమ్మో! ఇప్పుడు వర్షం పడిందంటే మన పని గోవిందా’’ అనో, ఈ ఏసీ గదికి కనక పొరపాటున నిప్పంటుకుందనుకోండి, మనలో ఒక్కడు కూడా మిగలడు’’ అనో అంటాడు. అంతే! వాతావరణం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతుంది. మనం మాట్లాడేది సత్యమే అయినప్పటికీ, అది హితవుగా ఉండాలి. మన కళ్లు ఎప్పుడూ మంచి దృశ్యాలనే చూడాలి, చెవులు ఎల్లప్పుడూ మంచి మాటలనే వినాలి.
చేతులు ఎప్పుడూ మంచి పనులే చేయాలి, నాలుక ఎప్పుడూ మధురంగానే మాట్లాడాలి. మనం మంచి మాటలు వినాలంటే, మంచి మాటలనే పలకాలి. ‘అబ్బే! నాకు మెరమెచ్చు మాటలు చెప్పడం చేతకాదండీ, ముక్కుసూటిగా... ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం నా నైజం’ అంటారు. అవతలి వారు కూడా అలాగే మాట్లాడితే మన మనసుకు ఎలా అనిపిస్తుందో ఆలోచించాలి. చిలకలా ముద్దు మాటలు మాట్లాడలేకపోయినా, కోకిలలా పాటలు పాడలేకపోయినా, కాకిలా కర్ణకఠోరంగా మాత్రం మాట్లాడకూడదు. కటువుగా మాట్లాడేవారు నిజంగా మంచివారే అయినా, వారిని అందరూ అర్థం చేసుకోలేరు. మనం అవతలి వారికి కష్టాలలో సాయం చేయలేకపోయినా, హితకరంగా మాట్లాడటం వల్ల వారు ఎంతో సాంత్వన పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment