తప్పెవరిది?
ఆత్మీయం
తమ లోపాలు తెలుసుకొనక ఇతరులకు జ్ఞానబోధచేయడం ప్రమాదకరం. ఎవ్వరూ ఎక్కువ కాలం నమ్మరు. ఆ సంగతి కప్పకి ఆలస్యంగా తెలిసి బాధపడింది. ఒకసారి ఒక పెద్ద కప్ప నీటిలో నుంచి బయటికి వచ్చి చెట్టు దగ్గర ఆగింది. అటుగా పోతున్న చిన్న జంతువులన్నింటినీ పిలిచి తాను వైద్యుడనని, మీ అనారోగ్యాలకు వైద్యం చేస్తానని చెప్పడం మొదలు పెట్టింది. అది చెప్పే మాటలకు పెద్ద జంతువులు కూడా వచ్చి వింటున్నాయి. తాను నిజంగానే వైద్యుడనని, ఎన్నో మందులు, మంత్రాలు తెలుసునని చెబుతుండడం అందరినీ ఆకట్టుకుంది. ఇదంతా నిజం అనుకున్నాయి.
అంతలో అటుగా వచ్చిన ఒక చీమ ఒక్క క్షణం కప్ప ఉపన్యాసం వింది. ఇది అందరినీ బోల్తా కొట్టిస్తోందని గ్రహించి ముందుకు వచ్చింది. ‘‘అవును మిత్రమా నువ్వు చెబుతున్నది బాగానే ఉంది. మరి నీ ఘోరమైన కంఠధ్వని, నీ శరీరం ముడతల నుంచి నిన్ను నువ్వు బాగు చేసుకోలేకుండా మా రోగాలు ఏం బాగుచేస్తావు?’’ అని ప్రశ్నించింది. అప్పటికిగాని మిగతా చిన్న, పెద్ద జంతువులకు కప్పగారు కథలు చెబుతున్న సంగతి అర్థం కాలేదు. అంతే! వెంటనే అన్నీ తమ దారిన తాము వెళ్లాయి. చాలామంది ఇలానే ఉంటారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు... తమకు తోచినదంతా మాట్లాడేస్తుంటారు. విచక్షణ లేకుండా వినేవాళ్లు, ఎవరు, ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే వాళ్లున్నంత వరకు ఇది సాగుతూనే ఉంటుంది.