
ప్లీడరు సుబ్బారాయుడిగారి చేతిలో కేసు పడితే మరి తిరుగులేదు... ఉరికంబం మీద ఉన్నా, మర్నాడే ఇంటికెళ్లి రొయ్యల కూర తినవచ్చని ఆశపడొచ్చు.
సుబ్బారాయుడు కూరలసంచి చేతిలో వేళ్లాడిస్తూ, మార్కెట్టులో పడ్డాడు. జేబులో ఇరవై ఆరు నయాపైసలు. నోటిలో బీడికంటే కొంచెం ఖరీదయిన సిగరెట్టు. నలిగిన పైజమా, పిట్టలు పీకినట్లు క్రాఫు, దుకాణాల నిండా కమలాలు, ద్రాక్ష.
కాలిఫోర్నియాలో ఎంతంత, ఎంత పెద్ద, ఎంత ఎక్కువగా ఉంటాయో ఈ పళ్లన్నీ అనుకున్నాడు. కాలిఫోర్నియాలో, వెనిజ్యులాలో, ఫ్లోరిడాలో, కాశ్మీర్‌లో... నీలి ఆకాశంలోని దూది మేఘాల నీడలు సరస్సులో ప్రతిఫలిస్తుంటే ‘షికారీ’ మీద పాషాలాగా కూర్చుని హుక్కా పీలుస్తూ... నరసమ్మని అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తున్నాడు. నరసమ్మేనా? సిల్హెట్ నారింజరంగులో నవనవలాడిపోతూ, ఔరంగాబాద్ హీమ్రూ చీరలో మెరిసిపోతూ...
‘‘ఏటలాగ తన్నుకుపోతున్నావ్, కళ్లునేవేటి’’ మామిడిపళ్ల అమ్మ గదమాయింపు తోటి, కాశ్మీర్ నుంచి కురుపాం మార్కెట్‌లోకి పడ్డాడు సుబ్బారాయుడు.
‘‘బీరకాయలు వేసెంతేమిటి?’’
‘‘పావలా, బాబూ’’
‘‘బేడ కివ్వవ్?’’
‘‘ఏవూరేటి బాబు మీది?’’
బీరకాయలు నాకు ఇష్టం. మూడణాల బీరకాయలు వీసె. ఇంకా బేరమాడాలి. బేరం...
చుట్టూ, ‘మావ్’ ఫొటోలు గోడలమీద. ఎదురుగా పచ్చటి జున్నులాగ ‘చౌ’ ముఖం. తొందర తొందరగా మాట్లాడే ముఖం. ఇంటర్ప్రెటర్ వాంఛూ కాషస్‌గా అంత త్వరగానూ తర్జుమా చేస్తున్నాడు. ఇంగ్లిషులోనికి తన పేరు అక్కడక్కడ దొర్లుతూంది. యువర్ ఎక్స్‌లెన్సీ ‘సుబ్రుడూ’ అని... నవ్వుకున్నాడు. మైదానంలాటి టేబిల్ మీద పరచిన మేప్‌లో ‘ఢోలా’ వైపు దీక్షగా చూశాడు. యుగయుగాల నుంచి ఢోలా భారతీయుల వశంలో వుంది. క్రీ.శ. 1234లో మీ చైనా దేశీయుడు ఫాన్‌యు కింద సర్వే చేసినపుడు ఢోలా భారతదేశంలో ఉన్నట్లు చూపించారు. మా డాక్యుమెంటు నం. 164956/సి చూడండి... వెనక నుంచి నమ్రత ఉట్టిపడుతూ సెక్రటరీ ఆ కాగితాన్ని తనకి అందించారు. మెల్లగా మెత్తగా ఆబ్జెక్టివ్‌గా చదువుతున్నాడు. ‘చౌ’ ముఖంలో మార్పు. తను చదువుకు పోతున్నాడు తన స్టాఫ్ ‘చౌ’ ముఖం వేపు ఏంక్షస్‌గా చూస్తూ, చూస్తూ... సెక్రటరీ మెల్లగా అన్నాడు, చెవిలో ‘‘ఢోలా ఇంకా మనదే!’’ చౌ ముఖం చెడిపోయిన జున్నులాగ మారిపోయింది.
వెనకని విస్పర్స్. సుబ్బారాయుడు లేకపోతే, ఢోలా మనచేతిలోంచి పోయేది. స్టాఫర్డ్ క్రిప్స్, తరువాత ఈయనే. ఢోలా చేతిలోంచే పోయేదే...
‘‘అలా సంచి నేల మీదికి ఒగ్గేస్తారేటి. తిన్నగెట్టండి’’ సంచీలో పోయించేసుకొని మార్కెట్ బయటకు వచ్చేశాడు సుబ్బారాయుడు. ఆఖరి సిగరెట్టు జేబులోంచి పైకి తీశాడు. నలిగిపోయి ఉంది. అగ్గిపెట్టె లేదు. బంకు దగ్గర కెళ్లి చాంతాడు నిప్పుతో అంటించాడు. దమ్ము లాగాడు. దగ్గు. గట్టిగా దమ్ము లాగాడు. గట్టిగా దగ్గు. మెయిన్‌రోడ్ మీద పడ్డాడు. రెండు పక్కలా గర్వంగా రంగులుగా షాపులు. శెట్టి షాపు పక్కన సింధీ దుకాణ్. కిళ్లీలకు కొంచెం వెనకన ఫొటోగ్రాఫర్. ఫొటోగ్రాఫర్‌కి ఎదురుగా చింతపండు, ఉల్లిపాయలు. వాటి పక్కన కాంపిటీషన్‌గా ఉల్లిపాయ పొరల్లాంటి చీరలు వేళ్లాడగట్టిన షాపు. షాపులో నల్లగా డబ్బుగా ప్రొప్రయిటరు.
పక్కనుంచి జోరుగా ఏంబులెన్స్ దూసుకుపోయింది. కె.జి.హెచ్.కి మోసేస్తున్నారు. ఎవరినో? ఎంత సీరియస్ కేసో... ఎవరు చూస్తారో... ఎంత డేంజరో... ఎంత...
స్ఫటికలాగ తెల్లగా, ప్యూర్‌గా... తళతళ మెరుస్తూ కత్తులూ, సిస్టర్సూ, యిన్‌స్ట్రుమెంట్స్... శవం లాగ బల్లమీద పేషెంట్ పడుకున్నాడు– క్లోరోఫారం మత్తులో ఎనేస్థెటిస్ట్ వాచ్ చూచుకుంటున్నాడు. ‘‘ఇంకొక నిమషంలో మీరు మొదలుపెట్టొచ్చు, డాక్టర్’’ అన్నాడు. డాక్టర్ సుబ్బారాయుడు మాస్క్ తగిలించుకొని, తయారు చేసిన చర్మం మీద కత్తితో మార్కు చేశాడు. చుట్టూ అరడజను ముఖాల్లో ఆత్రుత, ఎడ్మిరేషన్.
‘‘లింట్, ప్లీజ్?’’
చేతిలో లింట్.
‘‘కాటన్...’’
చేతిలో కాటన్.
‘‘టూర్నీకి కొంచెం గట్టిగా కట్టు’’
రక్తస్రావం ఆగింది.
ఎనేస్థెటిస్ట్ కళ్లలో ఆశ... మెల్లిగా నిట్టూర్పు.
మెషీన్‌లా పనిచేస్తుంది థియేటర్ నర్స్...
‘డైవాల్వులర్ గంబ్రైటిస్’... ప్రాణాపాయం. ఎక్కడో ఎవరో చేయగలరు. ఈ ఆపరేషన్ బ్రెజిల్‌లో డాక్టరు పడీర్‌గాస్మో చేశాడు 1954లో. తరువాత ఇక్కడ ఈ మారుమూల ఆంధ్రప్రదేశ్‌లో సుబ్బారాయుడే.
గ్లోవ్స్ రక్తమయం. చమట. బొట్లు. చమట బొట్లు. చప్టాలాంటి నుదురు మీద చమట...
చొక్కా పైకెత్తి అంచుతో ముఖం తుడుచుకున్నాడు. మట్టి చొక్కా కంపు; మట్టి ముఖం మీద. సైకిల్‌షాపులో చక్రభ్రమణం. గుండయ్యరు హోటల్లో దోసెల కరకరలు. పైని సుఖంగా ఎర్రగా కిల్లీలు నములుతున్న నోళ్లు. గుడిలో గంటలు. క్లోదియర్స్, డ్రేపర్స్... రేడియో, డీక్రాన్ ఫెరఫెరలు. శత్రువులా ఎండ. వీశె బీరకాయలు రెండు మణుగుల భారంతో గూడ పీకేస్తున్నాయి. పాత నేమ్‌ప్లేట్ పీకేసి ఇత్తడిది కొట్టిస్తున్నాడు వకీలు విశ్వనాథం. బి.ఏ. బి.ఎల్. ఏటవాలుగా ఆర్టిస్టిక్‌గా అక్షరాలు. ఇన్, ఔట్, ఔట్, ఇన్, ఔట్. వకీలు విశ్వనాధం... ంధనాశ్వవి.. శ్వవిధనాం... ంనావివ్వధ...
కోర్టులో నిశ్శబ్దం. ఫేన్ గిరగిర. ‘సదరు ముద్దాయి అదే రాత్రి పదకొండు పది నిమిషాలకు అనగా– నేరం జరిగిన సమయానికి– విజయనగరంలో విభాషిణి ఉరఫ్ డైమాన్‌రాణి ఇంట్లో అనగా నేరం జరిగిన స్థలానికి నలభయి తొమ్మిది మైళ్ల దూరంలో ఉన్నాడని నిరూపించటానికి కావలసిన సాక్ష్యం ఇచ్చుటకు ఈ సాక్షిని బోనెక్కించడమైనది’.
హా... హా... జడ్జి నోరు రెండంగుళాలు తెరుచుకొని, చేతిలోని కలం నోట్లోకి ఆశ్చర్యార్థకంగా వెళ్లింది. కోర్టులో గుసగుసలు. ప్లీడరు సుబ్బారాయుడిగారి చేతిలో కేసు పడితే మరి తిరుగులేదు... ఉరికంబం మీద వున్నా, మర్నాడే ఇంటికెళ్లి రొయ్యల కూర తినవచ్చని ఆశపడొచ్చు. హా హా ఓహో. నల్లగౌను, తెల్ల టై... సిడ్నీ కార్టన్‌లా... పెర్రీ మేసన్‌లా...
‘‘ఇనిపించిందటయ్యా. రోడ్డు మద్దిని నడకేటి. సెవులో ఏ టెట్టుకున్నావ్’’... రిక్షా బెల్... రిక్షా వాడి కేకలు...
ధడాలున, గభాలున లెంపకాయ కొట్టినట్టు చినుకులు, వాన, గబగబ. ఎండ విరిగింది. సుబ్బారాయుడు పక్కనున్న సత్రంలోకి దౌడు తీశాడు. అప్పటికే తడిశాడు. తడిసిన మల్లుషర్టు ఎముకల్ని పైకి తోస్తూంది. సంచి కింద పెట్టి నిలబడ్డాడు. చెయ్యి నొప్పి. చినుకులు నేలమీద పడి పటాకీలలాగా పేలుతున్నాయి. ఎదురుగా పెద్ద బోర్డు మీద ‘నేడే మన సైన్యంలో చేరండి. జవాన్ తుపాకి పట్టుకొని నిలబడున్నాడు. నేడే సైన్యంలో చేరండి. హిమాలయాల్ని... హిమాల...’
ఎముకలు కొరికి తినే చలి. ఎదురుగా దూరంగా చిన్న చిన్న పొదలు. టెంట్‌లో నేఫా మేప్ వైపు దీక్షగా చూస్తూ, కేన్‌తో మార్క్ చేస్తూ, బ్రిగేడియర్ మిగతా ఆఫీసర్స్‌కి వెర్బల్ ఆర్డర్ ఇస్తున్నాడు.
బ్రిగేడియర్ సుబ్బారాయుడి ముఖంలో శిలాకాఠిన్యం. ఆరడుగుల దేహాన్ని విల్లులాగ వంచి దీక్షగా మేప్‌లోకి చూస్తున్నాడు. ‘‘కెప్టెన్ ఘన్‌శ్యామ్ 17–00 గంటలకి తన ప్లెటూన్‌ని 051604 దగ్గరికి తీసుకువెళ్తాడు. రూట్ ఫలానా ఫలానా. శత్రువులు 051606 దగ్గర ఉన్నారు. కంపెనీ స్ట్రెంగ్త్ కెప్టెన్ ఉప్రీతి ఎనీ క్వశ్చన్? దెన్ ఐ విల్ ఆస్క్‌యు’’... పదిహేను నిమిషాల్లో ఆర్డరు పూర్తయింది. టైమ్ అందరి వాచీల్లో ఠీక్‌గా కలిపాడు. బ్రిగేడియర్ సుబ్బారాయుడు. ‘బాయ్స్ లెట్సు హావ్ ఎ కపుల్ ఆఫ్ టాట్స్ ఆఫ్ రమ్’ అని బాటిల్ తీశాడు. ఎర్రగా మెరుస్తూ రమ్. గ్లాసులో... ఎర్రగా.
ముఖం మీద కొట్టింది వాన వెలిసిపోయినట్టు. నం. 10 బస్ ఘీంకరిస్తూ, బురద చిమ్ముకుంటూ వెళ్లిపోయింది. సుబ్బారాయుడు సంచి పట్టుకొని రోడ్డుమీద కొచ్చాడు. ఇస్త్రీ బట్టల్లాగ కొత్తగా ఎండ. నేల మీద బురద. చెప్పుల టపటపలు. నల్లగా ఎవడో కండలవాడు తోశాడు సుబ్బారాయుణ్ణి. వాడికి తొందర. సుబ్బారాయుడికి తొందర లేదు. తోపుకి పోయి కూరగాయలతో సహా సంచి నేలమీద పడింది.
ఇల్లదిగో. ఇల్లంటే ఒకటే ఒక గది. రోడ్డు మీదకే గుమ్మం. గుమ్మం ముందు నుంచే నల్లగా కుళ్లుగా కాలవ– మునిసిపాలిటీ వాళ్లది. నది దాటినట్లు దాటి సుబ్బారాయుడు ఇంట్లో అడుగు పెట్టాడు. నరసమ్మ వచ్చింది వంట కార్నర్ చీకటిలోంచి. బీరకాయలు నేల మీదికి వొంపేడు. ‘‘పుచ్చు, ఎండువీ చచ్చినవీ... మీ కెవర్తో ఎంచి ఎంచి అంటగట్టింది. కాస్త కళ్లు పెట్టుకొని చూడక్కర్లా. కాలవలో పారవేయడం నయం’’ అంది నరసమ్మ బెడ్ కార్నర్ వైపు వెళ్లిపోతూ...
‘శివా, లార్డ్, భగవాన్, క్రైస్ట్’’ గోడకి హతాశుడై, అనుకున్నాడు. గోడకి ఆనుకుని, చేతులు జాపి..
...గోల్గోథా.. కాల్వరీ... దయతో కలిసిన బాధ. అరచేతులు రక్తం చిమ్ముతున్నాయి. తలమీద ముళ్ల కిరీటం. జాలిగా ప్రజల వైపు చూస్తూ... ‘‘భగవాన్ వీరిని క్షమించు. వీళ్లేమి చేస్తున్నారో వీళ్లకి తెలియదు.’’ తన కిటూ అటూ దొంగలు, నేరస్తులు... ఎలీ... ఎలీ, ఎలీ. లా మా సబఖ్ థానీ... నేరస్తుల్లాగ సిగ్గుతో, భయంగా నేల మీద బీరకాయలు.
త్రిపుర ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’ కథకు సంక్షిప్త రూపం. 1963లో అచ్చయింది. ఇది జేమ్స్ థర్బర్ కథకు అనుకరణ అని త్రిపురే చెప్పుకున్నారు. సౌజన్యం: పర్‌స్పెక్టివ్స్.
-త్రిపుర
Comments
Please login to add a commentAdd a comment