
ఇప్పుడిప్పుడు కొందరు తెల్లకోటూ, నల్లలాగూ వేసుకుని డాన్సులకీ ఈవినింగ్ పార్టీలకీ వెడుతున్నారు కానీ స్వచ్ఛమైన బ్రిటిషర్ దాన్ని డిజె కింద లెక్కకట్టడు...
బోయ్ విశాలమైన డ్రాయింగ్ రూమ్‌లో ప్రవేశించి అణకువగా ఒక పక్కన నుంచున్నాడు. టీ ముగించి మెత్తని సోఫాలో మునిగిపోయి బి.బి.సి. రేడియో వింటున్న పేట్‌రావ్ ‘‘ఏం కావాలి?’’ అన్నట్టు అతనివైపు చూశాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో స్నేహితులు ప్రతాపరావుని పేట్ అని ఇంగ్లీషు సంప్రదాయంలో పిలిచేవారు. ఇండియా వచ్చిన తర్వాత పేట్‌రావ్ అయింది.
‘‘మాస్టర్, బాత్ రెడీ’’.
పడక గదికి ఆన్చికట్టిన స్నానాల గదికి వెళ్లడానికి పేట్‌రావ్ లేచాడు. అప్పుడే ఇస్త్రీ చేసిన డిన్నర్ జాకెట్ పక్కమీద పరిచి ఉంది. డ్రెస్సింగ్ టేబిల్ పక్కనున్న సోఫాకి ముందు పోలిష్ చేసిన నల్లజోళ్లూ, వాటిమీద నలుపురంగు సాక్సూ ఉన్నాయి.
‘‘బోయ్’’ అరిచాడు పేట్‌రావ్. ‘‘తెల్లషార్క్ స్కిన్‌కోటు ఎందుకు తీశావ్?’’
ఒక్క నిమిషం బోయ్ తటపటాయించాడు. ‘‘మాస్టర్ పోయినసారి నల్ల డి.జె. వేసుకున్నారు’’ అన్నాడు.
ఒక పార్టీకి నల్లడిన్నర్ జాకెట్ వేసుకుంటే, తరువాత దానికి తెల్ల డి.జె. తీసి ఉంచమని తనే ఆదేశించాడు. అయితే ఈ పార్టీ ప్రత్యేకమైంది. బోయ్‌కి చెప్పడం మర్చిపోయాడు. అయినా అప్పుడప్పుడు ఆ మాత్రం కోప్పడ్డంలో తప్పులేదు.
పేట్‌రావ్‌కి బోయ్ అంటే అభిమానం. బోయ్ తెలుగువాడే, పేరు లోపరాజు. ఎన్నో ఏళ్లు దొరలకింద పనిచేసి బోయ్ అన్నపేరు గడించుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం హంటర్ దొర రిటైరై ఇండియా నుండి ఇంగ్లండు వెళ్లిపోతూ పేట్‌రావ్‌కి బోయ్‌ని సిఫార్సు చేశాడు. ‘‘ఫరవాలేదు, పనికొస్తాడు. ఇంగ్లీషు అర్థం అవుతుంది. కొంచెం మాట్లాడగలడు కూడా. అయితే నీ విస్కీ ఒక కంట కనిపెట్టుకో పేట్’’ అని నవ్వాడు హంటర్.
మాస్టర్ పొద్దున మేడమ్ గది విడిచి, తన గదిలోకి వచ్చినప్పటినుండీ ఆఫీసుకు పోయేవరకూ అన్ని అవసరాలూ బోయ్ చూస్తాడు. మాస్టరు నైట్‌గౌన్, పైజమాలు విప్పడం దగ్గర నుండి తలకి నూనె, ఆఫీసు బట్టలు వేసుకోడం వరకూ ప్రతి విషయంలోనూ సాయపడతాడు. మాస్టర్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తింటాడో వంటవాడికి చెబుతాడు. మాస్టర్‌కి ఎన్ని గంటలకి కారు తయారుగా ఉండాలో డ్రైవర్‌కి చెబుతాడు.
‘‘నేను తప్ప ఇవాళ పార్టీకి వచ్చేవాళ్లంతా తెల్లవాళ్లే.’’
నల్ల డి.జె. వేసుకోవడానికి కారణం వివరించడానికి ప్రయత్నించాడు పేట్‌రావ్. ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు బోయ్ ఎంతో సన్నిహితుడనిపించేది. పేరు పెట్టి పిలవాలనిపించేది. ఏళ్ల తరబడి అలవాటుపడ్డ సంస్కారం, ఇండియాలో పనిచేసిన ఇంగ్లీషువాళ్ల సంస్కారం అడ్డు వచ్చేది.
‘‘ఇప్పుడిప్పుడు కొందరు తెల్లకోటూ, నల్లలాగూ వేసుకుని డాన్సులకీ ఈవినింగ్ పార్టీలకీ వెడుతున్నారు కానీ స్వచ్ఛమైన బ్రిటిషర్ దాన్ని డిజె కింద లెక్కకట్టడు’’ అన్నాడు.
బోయ్ ముగ్ధుడై వింటున్నాడు. ఇది కొత్త విజ్ఞానం. రేపు స్నేహితుల్తో కబుర్లలో దొర్లించవచ్చు.
బోయ్ షార్క్‌స్కిన్ కోటు తీసి పార్టీరోబ్‌లో తగిలించి వికూవాగుడ్డతో కుట్టిన నల్ల డి.జె. కోటు బయటికి తీశాడు.
తొట్టిలో మూడువంతులు వేడినీళ్లు పట్టి ఉంచాడు బోయ్. వేడిచూసుకొని తృప్తిగా దిగాడు పేట్‌రావ్. శరీరం బయటా, లోపలా సుఖంగా ఉంది. ఆలోచనలు రాత్రి కాక్‌టైల్ పార్టీమీదికి పోయాయి.
మిస్టర్ అండ్ మిసెస్ స్టూవర్ట్, రగ్గర్ ఫుట్‌బాల్ పోటీల్లో గెలిచిన క్లబ్బు జట్టుకి రాత్రి ఏడూ, పదకొండూ గంటల మధ్య క్లబ్ బ్రిడ్జిరూమ్‌లో పార్టీ ఇస్తున్నారు. అతిథుల్లో తనొక్కడే ఇండియన్. రగ్గర్ జట్టులో ఇండియన్ లేనేలేడు. ఇండియన్ మెంబర్లకి ఇది అసంతృప్తి కలిగించింది. తెల్లవాళ్లంతా కలిసి ఇండియన్లకి చోటు లేకుండా చేసేరన్నారు. ‘‘చేత కాని కబుర్లు’’ అనుకున్నాడు పేట్‌రావ్. ఈమధ్య వ్యాపారంలో పడి పట్టించుకోకపోవడం వల్ల నిజానిజాలు చెప్పలేడు. కానీ పదిహేనేళ్ల క్రితం తను రగ్గర్ జట్టులో ఉన్నాడు. సమాజంలో సరైన స్థానం ఉన్న ఇండియన్‌కీ బ్రిటిషరు ప్రాణం పెట్టగలడు. వచ్చిన చిక్కల్లా సంస్కారం సరిపోకుండా పెద్ద ఎత్తుల మీద మనసు పెట్టుకుని కూచున్నవాళ్లకే.
ఏడు అవుతోంది. తొట్టిలో నీళ్లు బయటికి వదిలి, షవర్ తిప్పి తొందరగా బయటపడ్డాడు.
పేట్‌రావ్ డిన్నర్ జాకెట్ వేసుకుని నిలువుటద్దం లో చూసుకుని మురిసిపోయాడు. కోటు ఫేసింగ్ తళతళ మెరుస్తోంది. పాంట్ బ్రైడింగ్ సున్నితంగా ఉంది. షర్టు కాలరూ, బౌ టై, తీర్చిదిద్దినట్టు అమరాయి. తక్కువయిందల్లా కోటు కాలరుకున్న బటన్ హోలులో కార్నేషన్ పువ్వు. ఈ వేడి దేశంలో కార్నేషన్ మొక్కలు మొలవవు. ఎర్రగులాబీని అలంకరించుకున్నాడు. పోర్టికోలోకి దారి తీశాడు. డ్రైవరు, జాగ్వార్ కారు వెనుక తలుపు తీసి పక్కగా నుంచున్నాడు.
∙∙l
పేట్‌రావ్ వెళ్లేసరికే బ్రిడ్జిరూమ్ జనంతో కిటకిటలాడుతూ ఉంది. అయితే అంతా నల్లకోట్లలో లేరు. లౌంజ్‌సూట్లలో వచ్చినవాళ్లూ, సాదాకోటు పేంటులవాళ్లూ ఉన్నారు. మిస్టర్ స్టూవర్డ్ అతన్ని ఆహ్వానించి బార్ దగ్గరికి తీసుకు వెళ్లాడు. ‘‘నీ డ్రింక్ ఏమిటి పేట్?’’
‘‘విస్కీ అండ్ సోడా’’
పేట్‌రావ్ గదంతా కలయజూశాడు. వెళ్లి ఎవరితోనైనా చేరడానికి సందేహించాడు. పేట్‌రావ్ దృష్టి గోడమీద నోటీసు మీదకి పోయింది. ‘‘గదిలో పర్మిట్ ఉన్నవాళ్లు మాత్రమే తాగవచ్చు’’. అతనికి నవ్వొచ్చింది. పర్మిట్ లేకుండా ఎందరు ఇక్కడ తాగడం లేదు? తనకి మాత్రం ఉందా? తనకి పర్మిట్ లేని సంగతి ఏ కొద్దిమందికో కానీ తెలియదు. ‘‘పేట్‌ని పర్మిట్ అడిగితే ప్రొహిబిషనే ఎత్తించేస్తాడు’’ అని నవ్వుతారు. తనకి గుండెజబ్బు. ‘‘నీకు నేను సర్టిఫికెటు ఇవ్వను, ఇంకే డాక్టరూ ఇవ్వకుండా చూస్తాను’’ అని ప్రతిజ్ఞ పట్టేడు డాక్టరు.
‘‘ఇంతమందిలో ఒంటరిగా కాలం వెళ్లబుచ్చేస్తున్నానే’’ అనిపించింది. రీటా ఢిల్లీలో ఏం చేస్తుందో? రీటా, సుశీ ఇద్దరూ రెండేళ్లు తండ్రితో ఇంగ్లాండులో గడిపివచ్చారు. పెళ్లయేవరకు ఒకే సమాజంలో పెరిగారు. అయినా ఇద్దరి మనఃప్రవృత్తుల్లో ఎంత భేదం! రీటాకి ఇంగ్లీషు అలవాట్లంటే అభిమానం. సుశీకి గిట్టదు. ‘‘ఈ ఆకతాయి వెధవలంతా హక్కు ఉన్నట్టు నీతో డాన్సు చెయ్యడానికి తగవులాడుకుంటూ ఉంటే నవ్వుతూ ఊరుకుం టావేం?’’ అని రీటాని అడిగింది సుశీ. పెళ్లికాని కుర్రకారుకి సరదాగా ఉండే ఆడవాళ్లని చూస్తే మతిపోయే మాట నిజమే. ‘‘బ్రిటిష్ కమ్యూనిటీలో నాకున్న స్థానం రీటావల్ల కాదుగదా?’’ నీరసంగా ఒక మూల చేరి విస్కీ చప్పరించడం మొదలుపెట్టాడు.
∙∙l
పార్టీ హెచ్చుతోంది. కబుర్లు అరుపుల్లోకి దిగాయి. బీర్, రమ్, షెర్రా హరించుకుపోతున్నాయి. రగ్గర్ ఫుట్‌బాల్ పోటీలో అగ్రస్థాయి ఆట ఆడిన డంకన్ హార్వీని తమాషాగా దుయ్యబడుతున్నారు. ‘‘ఇన్ని ఫ్రీకిక్స్‌ని గోలులోకి తన్నేవే, ఈ విస్కీ బుడ్డీని తన్నగలవా?’’
మత్తులో తల ఎగరేశాడు డంకన్. కాలిజోడుతో గోడకి తన్ని ముక్కముక్కలుగా చేసేశాడు.
అకస్మాత్తుగా డంకన్ కళ్లు ఎడంగా ఉన్న పేట్‌రావ్ మీదకి పోయాయి. ‘‘ఇక్కడికి నల్లవాడెలా వచ్చాడు?’’
అందరి మొహాలూ పేట్‌రావ్ వైపు తిరిగాయి. ‘‘ఈ హోటల్లో నల్లవాళ్లకి తావులేదు.’’
‘‘నేనిక్కడికి ఆహ్వానం మీద వొచ్చేను’’
‘‘ఏదీ ఆహ్వానం?’’
అతను తీసుకురాలేదు. స్టూవర్ట్‌ని అడగమన్నాడు. ‘‘మేం ఎవర్నీ అడగం. నీకు తాగడానికి పర్మిట్ ఉందా?’’
చిక్కులో పడ్డాడు. ‘‘నాకు పర్మిట్ అక్కర్లేదు’’
‘‘ఊరికే పేలకు’’ అని పేట్‌రావు రెక్క పట్టుకుని ఈడ్చడం ప్రారంభించాడు డంకన్.
‘‘నా అతిథిని అవమానపరచడానికి డంకన్‌కి ఏం అధికారం ఉంది?’’ గర్జించాడు స్టూవర్ట్. ‘‘పేట్‌రావ్‌కి క్షమాపణ చెప్పుకోండి’’.
‘‘నల్లతోలుకి క్షమాపణ చెప్పుకోవలసిన అగత్యం మాకులేదు’’
పేట్‌రావ్ ఇంట్లో తెగతాగే డంకన్ హార్వీయేనా మాట్లాడుతున్నది! స్టూవర్ట్ తెల్లబోయాడు.
మిసెస్ స్టూవర్ట్ మొగుణ్ని లాంజ్‌లో కూర్చోబెట్టి హితబోధ చేసింది. ‘‘నీకు డంకన్ ముఖ్యమా, పేట్ ముఖ్యమా? డంకన్‌కి మనవాళ్లలో ఉన్నస్థానం నీకు తెలుసుకదా. పమీలా కోసమైనా నువ్వీ మొండిపట్టు మానెయ్యాలి.’’
పమీలా వాళ్ల కూతురు. డంకన్ మీద మనసు పెట్టుకుని కూచుంది. హార్వీకి పెద్ద ఉద్యోగం ఉంది. అందం ఉంది.
స్టూవర్ట్ గొంతు మూగపోయింది.
మిసెస్ స్టూవర్ట్ యువకుల దగ్గరకు వెళ్లి అంది. ‘‘జాన్‌కి కొంచెం తలనొప్పిగా ఉంది. ఇక్కడికి రాలేనందుకు క్షమాపణ చెప్పమన్నాడు. మిమ్మల్ని మిగిలిన డ్రింక్ తాగేసి మజా చేసుకోమన్నాడు.’’
వాళ్ల మొహాలు కళకళలాడాయి. తృప్తిగా గ్లాసులు నింపుకుని పాట ప్రారంభించారు. ‘‘హి ఈజ్ ఎ జోలీ గుడ్ ఫెల్లో’’.
బయట ఆవరణలో కారుకోసం వెతుక్కుంటున్న పేట్‌రావ్‌ని పాట కలత పెట్టింది. తన ఇంట్లో ఇవే గొంతుకలు, ఇదే పాట తన గురించి పాడాయి. నల్లటి జాగ్వార్ కారు చిక్కని చీకట్లో కనిపించలేదు. దానిమీద పడి చేతికి చిన్నగాయం తగిలించుకున్నాడు.
సి.రామచంద్రరావు
(సాటి ఇండియన్‌కు మాస్టర్ అయినా, ఎంత ఇంగ్లీషీకరణ చెందినా భారతీయుడికి ఇంగ్లీషువాడి దగ్గర ‘బోయ్’కి మించిన గౌరవం దక్కదని చెప్పే కథ సి.రామచంద్రరావు ‘నల్లతోలు’. దాని సంక్షిప్తం ఇది. ప్రధానంగా టీ ఎస్టేట్ అనుభవాల నేపథ్యంలో పొదుపుగా కథలు రాసిన సి.రా. కథాసంపుటి ‘వేలుపిళ్లై’. 1931లో జన్మించిన ఆయన నివాసం హైదరాబాద్.)