కోటి ఊటీల టేస్టు! | summer Ice-creams | Sakshi
Sakshi News home page

కోటి ఊటీల టేస్టు!

Published Sun, Apr 10 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

కోటి ఊటీల టేస్టు!

కోటి ఊటీల టేస్టు!

వేసవి నిప్పులు చెరుగుతూ తిప్పలు పెడుతోందా? ఎండ తాపం చండప్రచండమై చెండాడుతోందా?హిమకనుమలపైకి చేరాలని తమకంగా ఉందా? నాల్కతో రుచుల ఎవరెస్ట్‌ను తాకాలని ఉందా?  అలాగైతే...  పాలమీగడ క్రీమును మంచులా మార్చి... మామిడి గుజ్జుకు ఇంత పంచదారను చేర్చి... కొన్ని ఫ్లేవర్స్‌తో కొత్త రుచులను కూర్చి... మీ కిచెన్‌లోనే ఐస్‌క్రీమ్స్ చేసుకోవాలనుకుంటే... కోటి ఊటీల టేస్ట్‌ను ఫ్రిజ్‌లో దాచుకోవాలంటే ... ఈ పేజీని మస్ట్‌గా ఫాలో కండి.  ఐస్‌క్రీమ్‌తో ఫీస్ట్‌ను చేసుకోండి.

 

కావల్సినవి
మామిడి పండు గుజ్జు - ఒకటిన్నర కప్పు
ఫ్రెష్ క్రీమ్ / అమూల్ క్రీమ్ - 400 ఎం.ఎల్  (చల్లనది)
పాల పొడి - ముప్పావు కప్పు
పంచదార - ముప్పావు కప్పు

తయారీ
గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ వేసి 5 నిమిషాలు గిలకొట్టాలి. దీంట్లో మామిడిపండు గుజ్జు, పంచదార వేసి 5-6 నిమిషాలు బాగా కలపాలి. ఈ మిశ్రమం చాలా మృదువుగా అవుతుంది. ఈ మిశ్రమం ఉన్న గిన్నెపైన ప్లాస్టిక్ కవర్ చుట్టి, డీప్ ఫ్రీజ్‌లో 3 గంటల సేపు ఉంచాలి. తర్వాత బయటకు తీసి, మిశ్రమం మరొక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పాల పొడి వేసి బ్లెండ్ చేయాలి. ఐస్ అంతా కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలి.  ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పాత్రలో పోసి, పైన ప్లాస్టిక్ కవర్ చుట్టి 7-8 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి.  సర్వ్ చేసేటప్పుడు బయటకు తీసి, స్కూప్‌తో ఐస్‌క్రీమ్ కప్పులో వేసి చల్లచల్లగా అందించాలి.

 

 

వెనిల్లా ఐస్ క్రీమ్
కావల్సినవి: వెన్నతీయని పాలు - కప్పు (250 ఎం.ఎల్), వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ - అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ /అమూల్ క్రీమ్ - కప్పు, మొక్కజొన్న పిండి - టేబుల్ స్పూన్, పంచదార పొడి - అర కప్పు (70 గ్రా.లు)


తయారీ:  3 టేబుల్ స్పూన్ల పాలు తీసి, మిగతావి గిన్నెలో పోసి మరిగించాలి.  తీసిన పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి  మరుగుతున్న పాలలో మొక్కజొన్న పిండి కలిపిన పాల మిశ్రమాన్ని పోస్తూ బాగా కలపాలి  పాలు బాగా చిక్కబడేంతవరకు అలాగే కలుపుతూ, మంట తీసేయాలి  ఒక గిన్నెలో క్రీమ్ తీసుకొని, అందులో 3 ఐస్‌క్యూబ్స్ వేయాలి. దీనిని 2 నిమిషాలు  ఎగ్ బ్లెండర్ (కవ్వంతో చిలకాలి)తో బ్లెండ్ చేయాలి. దీంట్లో వెనీల్లా ఎసెన్స్ వేసి కలపాలి. అలాగే పంచదార పొడి వేసి కలపాలి   మరిగి చల్లారిన పాలు పోసి, బాగా బ్లెండ్ చేసి, కలిపి 2 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి  2 గంటల తర్వాత బయటకు తీసి 2-3 నిమిషాలు ఉంచి, తర్వాత మళ్లీ బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి 5-6 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి తర్వాత తీసి, కప్పులో పెట్టి, డ్రై ఫ్రూట్స్ వేసి, వెంటనే సర్వ్ చేయాలి.

 

చాకొలెట్ ఐస్‌క్రీమ్
కావల్సినవి: కోకా పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు, మిల్క్‌మెయిడ్ - 4-5 టేబుల్ స్పూన్లు, అమూల్ క్రీమ్ - కప్పు, వాల్‌నట్స్ (తరగాలి) - 6 తయారీ:  మిల్క్‌మెయిడ్ + కోకా పౌడర్ + అమూల్ క్రీమ్ లను ఒక గిన్నెలో వేసి గరిటెతో బాగా కలపాలి. దీనిని గాలి చొరబడకుండా పైనుంచి ప్లాస్టిక్ కవర్ చుట్టి, 10 గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి  వాల్‌నట్స్ తరిగి ఫ్రిజ్‌లో ఉంచాలి  ఫ్రిజ్‌లో ఉంచిన మిశ్రమం తీసి, ఐస్‌క్యూబ్స్, 2 టీ స్పూన్ నీళ్లు లేదా పాలు పోసి బ్లెండ్ చేయాలి  కప్పులో వేసి, వాల్‌నట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి.

 

లెమన్ బటర్ మిల్క్ ఐస్‌క్రీమ్
కావల్సినవి  పంచదార పొడి - ఒకటిన్నర కప్పు నిమ్మరసం - కప్పు పాలు - 2 కప్పులు చిక్కటి మజ్జిగ - 2 కప్పులు ఫ్యాట్ ఫ్రీ క్రీమ్ - 2 కప్పులు

తయారీ ఒక గిన్నెలో పంచదార, నిమ్మరసం వేసి కలపాలి.పంచదార అంతా కరిగాక క్రీమ్, మరిగించి చల్లార్చిన పాలు, మజ్జిగ పోసి బాగా కలపాలి.ఈ మిశ్రమం ఉన్న గిన్నెను ఫ్రీజర్‌లో ఉంచాలి. 2 గంటల తర్వాత తీసి, మరొకసారి బ్లెండ్ చేసి, ఫ్రిజ్‌లో 4 గంటలసేపు ఉంచాలి. తీసి, ఐస్‌క్రీమ్ కప్పులో వేసి చల్లగా అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement