
ఎండకు ఐస్ ప్యాక్...
సమ్మర్ రక్షణ
ఎండతాకిడికి లోనైన చర్మం బాగా ఎర్రబడి, మండుతుంటుంది. ఆ తర్వాత కమిలి నలుపురంగుకు మారుతుంటుంది. ఈ సమస్యనే ట్యాన్ అంటారు. ఎండబారిన చర్మానికి కూల్ ప్యాక్ సరైన ఎంపిక. ఎండనుంచి ఇంటికి వచ్చాక ఐస్ క్యూబ్‌తో ఎండ ప్రభావానికి లోనైన చర్మంపై మృదువుగా రబ్ చేయాలి. చల్లగా ఉండటంతో పాటు, ట్యాన్ సమస్య బాధించదు.
చెమట వాసన రాకుండా ఉండేందుకు డియోడరెంట్లు, పెర్‌ఫ్యూమ్‌లు ఈ కాలంలో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి చర్మానికి నేరుగా స్ప్రే చేయడం వల్ల దురద పెట్టే అవకాశం ఉంది. దద్దుర్లూ రావచ్చు. అందుకని ధరించిన బట్టలపై మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఎన్ని నీళ్లు తాగినా ఎండతాకిడికి లోనైన చర్మం త్వరగా పొడిబారుతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడే అవకాశమూ ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇ-విటమిన్ శాతం ఎక్కువ ఉన్న బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ తప్పక వాడితే చర్మం పొడిబారదు. టీ స్పూన్ తేనె, 10-15 చుక్కల నారింజ రసం, టేబుల్ స్పూన్ ఓట్స్, టేబుల్‌స స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఎండ ప్రభావం నుంచి ముఖచర్మం త్వరగా విశ్రాంతి పొందుతుంది.