చిన్నది చిందేస్తే... కిక్కే కిక్కు!
సీసాలో ఉంది కల్లు... తాగకుండానే తూలుతోంది (జనాల) ఒళ్లు... తుళ్లిపడిన తుంటరోళ్ల చిందులు... కల్లు కాంపౌండ్ ఏరియాలో కొత్త కళ కనిపిస్తోంది. మేటర్ ఏంటి చెప్మా? అని చుట్టూరా కన్నేశాడు ఓ పోలీసోడు! చందమామ లాంటి చిన్నది చిందులేస్తోంది. ఎవరీ పోరీ? అని కళ్లు పెద్దవి చేసుకుని లుక్కేశాడు. ఆ చిన్నది ఎవరో కాదు... సన్నీ లియోన్. చందమామలా తెల్లటి చీర కట్టుకుని సన్నీ చిందేస్తుంటే... చేతిలో కల్లు సీసా ఖాళీ చేయకుండానే జనాలకు కిక్ ఎక్కేస్తోందక్కడ.పోలీసోడికి కావాల్సిందీ అదే. జనాల చూపు సన్నీపై ఉంటే... కామ్‌గా పని చేసుకోవచ్చనేది పోలీసోడి ప్లాన్. అదేంటో జనాలు తెలుసుకోవాలంటే ఇంకో నెల వెయిట్ చేయక తప్పదు.
రాజశేఖర్ పోలీసాఫీసర్‌గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో కోటేశ్వరరాజు నిర్మిస్తున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’. ఇందులో సన్నీ లియోన్ చేస్తున్న స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. ఇంకో వారం రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. బ్యాలెన్స్ షూటింగ్, డబ్బింగ్, అన్నీ కంప్లీట్ చేసి ఈ సమ్మర్‌లోనే సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా కుమార్ హీరోయిన్. శ్రీచరణ్ సంగీతం అందిస్తున్నారు.