సాహిత్య అకాడమీ తెలుగు కమిటీ రెండుగా విడిపోవాలి...
తెలుగు రాష్ట్రం రెండు ముక్కలయ్యాక సాహిత్య అకాడమీ తెలుగు కమిటీ మాత్రం ఒకటిగా ఎందుకు ఉండాలి? రెండు రాష్ట్రాలకు రెండు కమిటీలు ఎందుకు ఉండకూడదు? దీనికి జవాబు ఏం చెప్తారంటే ఏడు రాష్ట్రాలకు పైగా హిందీ మాట్లాడే ప్రజలకు ఒకే కమిటీ ఉన్నప్పుడు తెలుగుకు మాత్రం ఒకే కమిటీ ఉంటే తప్పేంటి అని. అయితే ఆ ఏడు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఆ ఏడు రాష్ట్రాలలో ప్రేమ్‌చంద్ ఉత్తరప్రదేశ్ వాడనీ కిషన్‌చందర్ రాజస్తాన్‌వాడనీ ఇతర రాష్ట్రాల వారు వారిని తమ పాఠ్యపుస్తకాలలో నుంచి తొలగించలేదు. పరస్పరం అనుమానంతో చూసుకోలేదు.
తీవ్రంగా అవమానించుకోలేదు. కాని ఇక్కడ తెలుగు రాష్ట్రం ఎటువంటి ఉద్వేగాల మధ్య ముక్కలయ్యిందో అందరికీ తెలుసు. అయ్యాక కూడా నన్నయ్యను తొలగించాలని ఒక వర్గం వారు, నారాయణరెడ్డి అక్కర్లేదని మరో వర్గం వారు... ఇలాంటి తీవ్ర పరిస్థితులు పాదుకొని ఉన్నాయి. విగ్రహాలను కూల్చడం, ప్యాక్ చేసి పంపుతాం అనడం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా ఈ తెలుగు కమిటీ ప్రకటిస్తున్న మూడు అవార్డులు (ప్రధాన సాహిత్య అవార్డు, అనువాదకులకు అవార్డు, యువ రచయితలకు అవార్డు) పెద్ద పెద్ద అసంతృప్తులకు దారి తీస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఉన్న కమిటీలో తెలంగాణవారు ప్రాధాన్యంలో ఉన్నారు. పది మంది కమిటీ సభ్యులలో కనీసం ఎనిమిది మంది జంట నగరాలవారు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌వారికి వారి అభ్యంతరాలు ఉండటం తప్పు కాదు. రాష్ట్రం విడిపోక ముందు ఎవరు కార్యవర్గముఖ్యుడిగా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని విడిపోయాక ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారిని జడ్జ్ చేసినా ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతం వారిని జడ్జ్ చేసినా సబబైన పని అనిపించదు. రాష్ట్రం ముక్కలయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అకాడమీ కార్యవర్గ ముఖ్యుడిగా ఉండి ఉంటే తెలంగాణ సాహిత్యకారుల భావోద్వేగాలూ స్పందనా ఎలా ఉండేవో తెలియనివి కావు. కనుక సీమాంధ్రుల ఈ స్పందనను వ్యతిరేకదృష్టితో చూడాల్సిన పని లేదు.
మంచో చెడో సీమాంధ్రులకు ఒక రాష్ట్రం ఏర్పడింది. ఇక తమ సాహిత్యాన్ని తాము చూసుకోవడం తమకు ఏది మంచో అది ఎంచుకోవడం తమవారిలో ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలో నిర్ణయించుకోవడం వారి తలనొప్పి. బాగా రాశారో పేలవంగా రాశారో, రెండు జిల్లాల భాషలో రాశారో, దోపిడీ భాషను సృష్టించారో... ఇదంతా వారి సొంత విషయం. ఇప్పటికే సీమాంధ్రులు అనేక విధాలుగా నష్టపోయారు. అవమానాలు భరించారు. భరిస్తున్నారు. ఇక చాలు. మా రాష్ట్రం మాకివ్వండి... మమ్మల్ని వదిలేయండి అని తెలంగాణవారు ఎంత గట్టిగా కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్‌కు సీమాంధ్రులే సభ్యులుగా ఉన్న సాహిత్య అకాడమీ కమిటీ వేయండి అని ఇటువైపు వారు అంతే బలంగా కోరుకుంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ వెసులుబాటు ఇరు రాష్ట్రాల సాహిత్యరంగాలకూ శ్రేయస్కరం.
రామతీర్థ - 98492 00385