‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులోనూ ఆ రచనకన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే కృష్ణ సొబ్తి సాహిత్యం జ్ఞానపీఠానికి ఒక ఉపఖండ పరిమళం. అనగా అనగా అమెరికాలో ఉన్న ఒక భారతీయ పెద్దమనిషి సంత్ సింగ్ చత్వాల్, హోటల్ వ్యాపారంలో స్థితి మంతుడు. తనపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కొన్నేళ్ళ కిందట, తానెలా పద్మభూషణ్ పురస్కారానికి అర్హుడో, అది తనకు రాకుండా ఎలా ఆటంక పరుస్తున్నారో, టీవీలో చెప్పి చెప్పి బాధ పడుతున్నాడు. అదే ఏడాది ప్రముఖ రచయితలు కృష్ణ సొబ్తి, బాదల్ సర్కార్, తమకు ప్రకటితం అయిన పద్మభూషణ్ పురస్కారాలను తిరస్కరించారు. అప్పుడీ చత్వాల్ అవార్డ్ యావ టీవీలో చూసి తీరాల్సిందే అని చమత్కరించుకున్నారు కూడా. తరువాత కొన్నేళ్లకు అవార్డ్ వాపసీ చేస్తున్న రచయితలతో బాటుగా తన సాహిత్య అకాడమీ అవార్డ్ వాపస్ చేశారు కృష్ణ సొబ్తి. దేశ స్వాతంత్య్ర కాలానికే, 22 ఏళ్ల వయసుగల తరంగా, వీరి రచనల్లో దేశ విభజన బలంగా పలి కింది. స్త్రీ లైంగికత, శారీరక అవసరాల గురించి ‘‘మిత్రో మోర్జని’’ నవలలో రాశారు కృష్ణ సొబ్తి. ‘‘టు హెల్ విత్ యు మిత్రో’’ పేరిట ఈ రచన ఆంగ్ల అనువాదం అయ్యింది కూడా. తన తొలినాళ్ళ కథానిక, ‘‘సిక్కా బదల్గయా’’ (నోట్లు మారిపోయాయి) ఉపఖండం రెండు దేశాలుగా చీలిపోతున్న విషాద చిత్రణ చేసిన ముఖ్య రచనల్లో ఒకటి. ఈ రచన అచ్చు వేసింది ఆజ్ఞేయ్ పేరుతో ప్రసిద్ధమైన హిందీ సాహిత్యవేత్త. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఈ యువ రచయిత్రి కథానికను అచ్చు వేశారు. అప్పట్లో ఈమెకి అదొక పెద్ద సంబరం.
ప్రతి పదంలో, భావన పలకడంలో ప్రసూతి వేదన నిజమైన రచయితలు అనుభవిస్తారు అంటారు కృష్ణ సొబ్తి. ‘‘సృజనాత్మక రచన, రచయిత చేతిలో ఆట బొమ్మ కాదు. ఆ రచయిత మానసిక, తాత్విక, భాషాపరమైన ఆవరణపు ఫల స్వరూపం అది. మాటలు రాయడంలో ఒక రచయిత వాటి ద్వారా, తాను సృష్టి చేస్తున్న సమాజాన్ని నేస్తాడు. నేను నా ప్రతి రచనలో నా భాషను మార్చేస్తానని అంటారు. ఇది నేను కావాలని చేసేది కాదు. జరిగే సృష్టి, వాటికి అవసరం అయిన పరిస్థితులను విధిస్తుంది సృష్టికర్త పైన. నేను రాసేటప్పుడు, నా రచనతో కొంత దూరాన్ని ఉంచుకుంటాను. తగు దూరం ఉండేలా (ఈక్విడిస్టెన్స్) అన్ని దిశలనుంచి చెరో వేపు లాగుతున్న దశ ఇది’’ అని వివరిస్తారు. ‘‘జిందగీనామా’’ రచన ఈమెకు పేరు తెచ్చిపెట్టిన ఒక బృహత్ నవల. ఇందులో 500ల పాత్రలు ఉన్నాయి. ఈ కథ అంతా రాశాక, దాన్ని పైకి చదువుకోవడం ఈమెకు అలవాటు. రాసేది, రాత్రి సాయంత్రం మొదలు పెట్టి, రాత్రి తెల్లారే దాకా. ఇక అప్పుడు పడుకోవడం. అలా ఈ జిందగీనామా పూర్తి అయ్యాక, పైకి చదువుకోవడం మొదలు పెడితే ఇది ఏకంగా మరునాడు రాత్రి దాటి పోయి, మూడో రోజు ఉదయంలోకి కొనసాగిన ఒక పఠన ధారావాహిక. అంతా అయ్యాక, అప్పుడు ఆరంభం బిగితో రాలేదు అనిపించి, తిరిగి, దాన్ని రాసేందుకు కూచున్న పనిమంతురాలు కృష్ణ సొబ్తి.
ఇంగ్లిష్‌లో చదువుకున్నారు కదా, మరి హిందీ ఎలా మీ సాహిత్య భాష అయింది అన్న ప్రశ్నకు కృష్ణ సొబ్తి స్పందిస్తూ ‘‘అనేకమంది భారతీయ రచయితలు హిందువులైనా, ముస్లింలైనా హిందీలో రాశారు. వారిలో మాలిక్ మహ్మద్ జయసి, తులసీదాస్, కబీర్ మొదలగు వారున్నారు. హిందీ భాషకు ప్రత్యేకమైన ధ్వని ప్రపంచం ఉన్నది. ఈ ధ్వని లోకంలోని పలు భాషల నుంచి వచ్చింది. ప్రతీ మాటకు ఒక తనదైన ధ్వని ముద్ర ఉన్నది. పంజాబీ నుంచి వచ్చిన మాటలు ముతకగా, మొరటుగా శబ్దం చేస్తాయి, రాజస్తాన్ నుంచి వచ్చి చేరినవి, చాలా క్లుప్తంగా, పొందికగా ఉంటాయి. నా సృజన ప్రపంచంలో ఎన్నో హిందీ పలుకుబళ్ళు, ఉర్దూ, సంస్కృతం కూడా ఉంటాయి. నేను నా మొదటి నవల రాస్తుండగా, ప్రఖ్యాత హిందీ రచయిత అమృత్‌లాల్ నగర్, ఇలాంటి పంజాబీ కలిసిన హిందీ నిలబడదు అని అన్నారు. నేను ఒక్క పదేళ్ళు ఆగి చూడండి అని బదులిచ్చాను. మేము హిందీ రాయడం మొదలు పెట్టిన కాలంలో అది కాయగూరల భాష అని అందరూ వెక్కిరించే వారు, కానీ ఒక దశాబ్దిలోనే నిర్మల్ వర్మా, ఫణీశ్వర్ నాథ్ రేణు వంటి రచయితలు, ప్రజల, పాఠకుల దృష్టి తమవేపు ఆకట్టుకున్నారు’’ అని వివరిస్తారు.
అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా సాహిత్య దృక్కోణాలు ఉండగలవు అని నేను అనుకోను. సిద్ధాంతకర్తలు ఇలా ఇరుకు దృష్టితో చూడవచ్చునేమో కానీ, గొప్ప రచనలు వాటిలో సహజంగానే, స్త్రీ, పురుష పార్శా్వల సంబంధిత అంశాలతో కూడి ఉంటాయని నేను భావిస్తాను. మగవాడు రాసినంత మాత్రాన ఆ రచనలో స్త్రీల జీవితం చిత్రణ కాకూడదు అని లేదు. ఉదాహరణకు నేను ‘‘హష్మత్’’ అనే మగ పేరుతో రాసేదాన్ని. ఆలా రాసేటప్పుడు నా భాష, నా చేతి రాత కూడా మారిపోయేవి. ఇవి కృష్ణ సొబ్తి రాసిన వాక్యాలేనా అని నేను చకిత నయ్యేదాన్ని, అదే కళకు గల సంక్లిష్టత, ప్రత్యేకత అని స్పష్టం చేస్తారు. తన తొంభైరెండేళ్ల జీవితంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొంది, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని నమ్మి ఆచరించే ప్రగతి శీల సాహిత్యవేత్త కృష్ణ సొబ్తి. ‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులో కూడా ఆ రచన కన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే ఈమె సాహిత్యం జ్ఞాన పీఠానికి ఒక ఉపఖండ పరిమళం, కావ్యం విశ్వ శ్రేయస్సు కోసమే అనే సనాతన వివేకానికి ఒక నవీన నిరూపణం.
వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత
మొబైల్ : 98492 00385
రామతీర్థ
Comments
Please login to add a commentAdd a comment