Ramatirtha
-
ఉపఖండ స్ఫూర్తికి జ్ఞానపీఠ కీర్తి
‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులోనూ ఆ రచనకన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే కృష్ణ సొబ్తి సాహిత్యం జ్ఞానపీఠానికి ఒక ఉపఖండ పరిమళం. అనగా అనగా అమెరికాలో ఉన్న ఒక భారతీయ పెద్దమనిషి సంత్ సింగ్ చత్వాల్, హోటల్ వ్యాపారంలో స్థితి మంతుడు. తనపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కొన్నేళ్ళ కిందట, తానెలా పద్మభూషణ్ పురస్కారానికి అర్హుడో, అది తనకు రాకుండా ఎలా ఆటంక పరుస్తున్నారో, టీవీలో చెప్పి చెప్పి బాధ పడుతున్నాడు. అదే ఏడాది ప్రముఖ రచయితలు కృష్ణ సొబ్తి, బాదల్ సర్కార్, తమకు ప్రకటితం అయిన పద్మభూషణ్ పురస్కారాలను తిరస్కరించారు. అప్పుడీ చత్వాల్ అవార్డ్ యావ టీవీలో చూసి తీరాల్సిందే అని చమత్కరించుకున్నారు కూడా. తరువాత కొన్నేళ్లకు అవార్డ్ వాపసీ చేస్తున్న రచయితలతో బాటుగా తన సాహిత్య అకాడమీ అవార్డ్ వాపస్ చేశారు కృష్ణ సొబ్తి. దేశ స్వాతంత్య్ర కాలానికే, 22 ఏళ్ల వయసుగల తరంగా, వీరి రచనల్లో దేశ విభజన బలంగా పలి కింది. స్త్రీ లైంగికత, శారీరక అవసరాల గురించి ‘‘మిత్రో మోర్జని’’ నవలలో రాశారు కృష్ణ సొబ్తి. ‘‘టు హెల్ విత్ యు మిత్రో’’ పేరిట ఈ రచన ఆంగ్ల అనువాదం అయ్యింది కూడా. తన తొలినాళ్ళ కథానిక, ‘‘సిక్కా బదల్‌గయా’’ (నోట్లు మారిపోయాయి) ఉపఖండం రెండు దేశాలుగా చీలిపోతున్న విషాద చిత్రణ చేసిన ముఖ్య రచనల్లో ఒకటి. ఈ రచన అచ్చు వేసింది ఆజ్ఞేయ్ పేరుతో ప్రసిద్ధమైన హిందీ సాహిత్యవేత్త. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఈ యువ రచయిత్రి కథానికను అచ్చు వేశారు. అప్పట్లో ఈమెకి అదొక పెద్ద సంబరం. ప్రతి పదంలో, భావన పలకడంలో ప్రసూతి వేదన నిజమైన రచయితలు అనుభవిస్తారు అంటారు కృష్ణ సొబ్తి. ‘‘సృజనాత్మక రచన, రచయిత చేతిలో ఆట బొమ్మ కాదు. ఆ రచయిత మానసిక, తాత్విక, భాషాపరమైన ఆవరణపు ఫల స్వరూపం అది. మాటలు రాయడంలో ఒక రచయిత వాటి ద్వారా, తాను సృష్టి చేస్తున్న సమాజాన్ని నేస్తాడు. నేను నా ప్రతి రచనలో నా భాషను మార్చేస్తానని అంటారు. ఇది నేను కావాలని చేసేది కాదు. జరిగే సృష్టి, వాటికి అవసరం అయిన పరిస్థితులను విధిస్తుంది సృష్టికర్త పైన. నేను రాసేటప్పుడు, నా రచనతో కొంత దూరాన్ని ఉంచుకుంటాను. తగు దూరం ఉండేలా (ఈక్విడిస్టెన్స్) అన్ని దిశలనుంచి చెరో వేపు లాగుతున్న దశ ఇది’’ అని వివరిస్తారు. ‘‘జిందగీనామా’’ రచన ఈమెకు పేరు తెచ్చిపెట్టిన ఒక బృహత్ నవల. ఇందులో 500ల పాత్రలు ఉన్నాయి. ఈ కథ అంతా రాశాక, దాన్ని పైకి చదువుకోవడం ఈమెకు అలవాటు. రాసేది, రాత్రి సాయంత్రం మొదలు పెట్టి, రాత్రి తెల్లారే దాకా. ఇక అప్పుడు పడుకోవడం. అలా ఈ జిందగీనామా పూర్తి అయ్యాక, పైకి చదువుకోవడం మొదలు పెడితే ఇది ఏకంగా మరునాడు రాత్రి దాటి పోయి, మూడో రోజు ఉదయంలోకి కొనసాగిన ఒక పఠన ధారావాహిక. అంతా అయ్యాక, అప్పుడు ఆరంభం బిగితో రాలేదు అనిపించి, తిరిగి, దాన్ని రాసేందుకు కూచున్న పనిమంతురాలు కృష్ణ సొబ్తి. ఇంగ్లిష్‌లో చదువుకున్నారు కదా, మరి హిందీ ఎలా మీ సాహిత్య భాష అయింది అన్న ప్రశ్నకు కృష్ణ సొబ్తి స్పందిస్తూ ‘‘అనేకమంది భారతీయ రచయితలు హిందువులైనా, ముస్లింలైనా హిందీలో రాశారు. వారిలో మాలిక్ మహ్మద్ జయసి, తులసీదాస్, కబీర్ మొదలగు వారున్నారు. హిందీ భాషకు ప్రత్యేకమైన ధ్వని ప్రపంచం ఉన్నది. ఈ ధ్వని లోకంలోని పలు భాషల నుంచి వచ్చింది. ప్రతీ మాటకు ఒక తనదైన ధ్వని ముద్ర ఉన్నది. పంజాబీ నుంచి వచ్చిన మాటలు ముతకగా, మొరటుగా శబ్దం చేస్తాయి, రాజస్తాన్ నుంచి వచ్చి చేరినవి, చాలా క్లుప్తంగా, పొందికగా ఉంటాయి. నా సృజన ప్రపంచంలో ఎన్నో హిందీ పలుకుబళ్ళు, ఉర్దూ, సంస్కృతం కూడా ఉంటాయి. నేను నా మొదటి నవల రాస్తుండగా, ప్రఖ్యాత హిందీ రచయిత అమృత్లాల్ నగర్, ఇలాంటి పంజాబీ కలిసిన హిందీ నిలబడదు అని అన్నారు. నేను ఒక్క పదేళ్ళు ఆగి చూడండి అని బదులిచ్చాను. మేము హిందీ రాయడం మొదలు పెట్టిన కాలంలో అది కాయగూరల భాష అని అందరూ వెక్కిరించే వారు, కానీ ఒక దశాబ్దిలోనే నిర్మల్ వర్మా, ఫణీశ్వర్ నాథ్ రేణు వంటి రచయితలు, ప్రజల, పాఠకుల దృష్టి తమవేపు ఆకట్టుకున్నారు’’ అని వివరిస్తారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా సాహిత్య దృక్కోణాలు ఉండగలవు అని నేను అనుకోను. సిద్ధాంతకర్తలు ఇలా ఇరుకు దృష్టితో చూడవచ్చునేమో కానీ, గొప్ప రచనలు వాటిలో సహజంగానే, స్త్రీ, పురుష పార్శా్వల సంబంధిత అంశాలతో కూడి ఉంటాయని నేను భావిస్తాను. మగవాడు రాసినంత మాత్రాన ఆ రచనలో స్త్రీల జీవితం చిత్రణ కాకూడదు అని లేదు. ఉదాహరణకు నేను ‘‘హష్మత్’’ అనే మగ పేరుతో రాసేదాన్ని. ఆలా రాసేటప్పుడు నా భాష, నా చేతి రాత కూడా మారిపోయేవి. ఇవి కృష్ణ సొబ్తి రాసిన వాక్యాలేనా అని నేను చకిత నయ్యేదాన్ని, అదే కళకు గల సంక్లిష్టత, ప్రత్యేకత అని స్పష్టం చేస్తారు. తన తొంభైరెండేళ్ల జీవితంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొంది, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని నమ్మి ఆచరించే ప్రగతి శీల సాహిత్యవేత్త కృష్ణ సొబ్తి. ‘‘రచయితకన్నా రచన గొప్పది, అందులో కూడా ఆ రచన కన్నా ఎప్పుడూ గొప్పవి, ఎన్ని అడ్డంకులెదురైనా నిలబెట్టవలసిన మానవీయ విలువలు’’ అనే ఈమె సాహిత్యం జ్ఞాన పీఠానికి ఒక ఉపఖండ పరిమళం, కావ్యం విశ్వ శ్రేయస్సు కోసమే అనే సనాతన వివేకానికి ఒక నవీన నిరూపణం. వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 రామతీర్థ -
తెలుగు ప్రాచీన హోదాకు వీడిన గ్రహణం
అభిప్రాయం తెలుగు భాష ఘనతకు పట్టిన వ్యాజ్యపు చెర వీడింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎన్. కౌల్, మరొక న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం, తమిళ భాషా ప్రేమికుడు, న్యాయ వాది ఆర్.గాంధీ వేసిన పిటిషన్‌ను ఆగస్ట్ 8న కొట్టివేస్తూ, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా భాషలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల నుంచి, ప్రాచీన భాషలుగా గుర్తింపు పొందాయని స్పష్టం చేసింది. 2008 నుంచీ ఈ కేసు ద్వారా తమిళ సోదరులు, దక్షిణాదిన మరే ఇతర భాషకూ ప్రాచీన లేదా విశిష్ట హోదా వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక లబ్ధి ఒనగూరకుండా చేశారు. దాదాపు 2014 వరకూ ఈ కేసు పెద్దగా కదలిక లేకుండా ఉన్నది. అప్పుడు చెన్నై తెలుగు వారు వృత్తి రీత్యా ఉపా ధ్యాయుడు అరుున తూమాటి సంజీవరావు ఈ కేసులో తన స్వయం ఆసక్తిపై ఇంప్లీడ్ అరుు, కేసులో కొత్త కద లిక తెచ్చారు. అప్పట్నుంచీ కేసు చురుగ్గా కదిలి ఈ రెండేళ్లలో తీర్పు దాకా వచ్చింది. ఇందుకు సంజీవ రావు గారికి అభినందనలు తెలపాలి (98844 46208). ఈ ప్రాచీన హోదా వెలువడ్డప్పుడు, కోర్టులో వ్యాజ్యం ఫైల్ అరుునప్పుడు కూడా ఒకే రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉంది. ప్రాచీన భాష హోదా పేరిట రూ.100 కోట్లను భారత ప్రభుత్వం ఆయా భాషల అభివృద్ధి పనులకు, నడిచే కేంద్రాల నిర్వహణ ఖర్చులకు ఇస్తున్నది. ప్రాచీన భాష అభివృద్ధి పేరిట జరగవలసిన పనులలో ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. రెండు తెలుగు భాషా రాష్ట్రాలలోనూ అభి వృద్ధి, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు, తగు సిబ్బంది, సాంకేతిక సౌకర్యాలు ఇవన్నీ రూపుదిద్దుకుని, మన సన్నాహాలను సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వానికి వివరించ గలిగితే, ఆయా నిధులు సమకూరుతారుు. మనం మన తెలుగు రాష్ట్రాలకు తెచ్చుకోవలసిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు ప్రస్తుతం మైసూరులో ఉంది. తమిళులు ఎలా తమ భాషా విభా గాన్ని తమిళనాడుకు తీసుకెళ్ళారో అలా ఈ విభాగపు సాంకేతిక బదిలీ, మిగిలి ఉన్న వనరులు రాత ప్రతులైతే వాటి సగం మూల ప్రతులు, సగం నకళ్లు రెండు రాష్ట్రాల మధ్య విభాగాలు జరిగి, సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు ఏర్పాటుకు తాము సిద్ధం అన్న సంగతి భారత ప్రభుత్వానికి తెలుపడాన్ని బట్టి నిధుల విడుదల జరిగే అవకాశం ఉంటుంది. మద్రాస్ హైకోర్ట్, ఆ ప్రాచీన హోదా ప్రకటనను సమానంగా అనువర్తింప చేసినం దున, ఎవరి రాష్ట్రంలో వారు ఈ సంస్థ పనితీరుకు వలసిన భవనాలు, ఇతర సదుపాయాలు, ఏర్పాటు అయ్యేందుకు ఫాస్ట్ ట్రాక్ కమిటీలు నియమించి, అందులో రచరుుతలు, భాషా రంగ నిపుణులు, విద్యా వేత్తలు, మొదలగువారిని సభ్యులుగా స్వీకరించి, వచ్చే హేవిళంబి ఉగాది కల్లా ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లాసికల్ తెలుగు సంస్థను రెండు తెలుగు రాష్ట్రాలలో పని ప్రారంభించేలా చేయ గలరని ఆశిద్దాం. విడిపోవడానికి ముందు నుంచి కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఉమ్మడి రాష్ట్రం లోనే మొదటగా ఏర్పడిన శాఖ, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి, వేగంగా పనులు పూర్తి చేయవచ్చు. వ్యాసకర్త: రామతీర్థ. కవి, విమర్శకులు. మొబైల్ : 98492 00385 -
తప్పుల తడకలూ-నిర్జీవన కాలాలూ
కాలమిస్ట్ గొల్లపూడి మారుతీరావు మే 7న రవీంద్ర నాథ్ టాగోర్ జయంతి సందర్భంగా ‘సాక్షి’ సం పాదకీయ పేజీలో ‘మాతృ వందనం’ అంటూ ఒక రచన చేశారు. దాంట్లో జాతీయ స్థాయి విషయాలపై వారి సమాచార లోపం లేదా సమాచారం పట్ల వారి నిర్లక్ష్యం పట్ల ఖేదపడుతున్నాను. వారి ఉద్దేశం తేట తెల్లమే. ‘జనగణమన’ను చిన్నది చేసి ‘వందేమాత రం’ను పెద్ద చేయడం. జాతీయగీతంగా వందే మాతరం మెరుగైనదీ, మరిం త సమంజసమైనదన్న భావన కలుగజేయాలనే రచయిత ఆతురత ప్రద ర్శించారు. ఈ క్రమంలో వివాదపు లోయల్లో పడి పోవడం, గోష్పాదమంత వ్యర్థ సంచలనాల్లో ఇరు క్కోవడమూ ఆయనకు పరిపాటిగా మారింది. టాగోర్ జనగణమన గీతాన్ని 1911లో మదన పల్లిలో రాశారని గొల్లపూడి గారు చెప్పడం ఒక పూర్తి స్థాయి తప్పుడు సమాచారం. ఇంత ప్రాథమిక సమాచారాన్ని కూడా తప్పుగా ఇవ్వడం శోచనీయం. 1911లో టాగోర్ ఉన్నది నాటి కలకత్తాలో. ఆ నగ రం అప్పటి భారతదేశ రాజధాని. ఇంగ్లండ్‌లో సిం హాసనం అధిష్టించిన పంచమ జార్జ్ చక్రవర్తి కలక త్తాకు వచ్చారు. ఆనాటికి బ్రిటిష్ విధేయులుగా ఉన్న కాంగ్రెస్ వారు ఈ రాజసందర్శనను పురస్కరించు కుని ఒక గీతం రాయమని కోరగా టాగోర్ జనగణ మన రాశారు. దాన్ని 27-12-1911 సాయంత్రం జార్జ్ చక్రవర్తి సన్మాన సభలో స్వాగతగీతంగా పాడారు. ఆనాటికి అంటే 1911కి జనగణమన జాతీ య గీతం అవుతుందని ఎవరూ అనుకోలేదు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు, జనగణమనకు గల సంబంధం 1918-19 కాలం నాటిది. అక్కడి అనెబిసెంట్ థియోసాఫికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ పిలుపు మేరకు మదనపల్లెకి వచ్చిన టాగోర్ వారి కోరిక మేరకు ఆ గీతాన్ని ఆల పించి ఆంగ్లానువాదం కూడా చేశారు. జేమ్స్ భార్య మార్గరేట్ కజిన్స్ సహకారంతో టాగోర్ స్వయంగా జనగణమన గీతాన్ని పాడే పద్ధతిని స్థిరపరిచారు. ఇప్పటికీ అదే వరుసలో మనం పాడుతున్నాం. అయితే 1918 నాటికి కూడా ఈ గీతం దేశ జాతీయ గీతం అవుతుందన్న అంచనాలు ఎవరికీ లేవు. 1911లో రాసిన గీతం 36 ఏళ్ల తర్వాత జాతీ యగీతం అయిందనుకుని, దాన్ని అలా చేయడంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూ వంటి వారికి ఏవో ప్రత్యేక ఇష్టాలు ఉన్నాయని అక్కడికి ఈ కాల మిస్ట్ తానే కనిపెట్టినట్లుగా సన్నాయి నొక్కులు నొక్క డం.. ఇది మరొక తీవ్ర దురవగాహన. ‘జనగణ మన’ జాతీయ గీతం అయింది దాన్ని రాసిన 36 ఏళ్ల తర్వాత అంటే 1947లో కాదు. భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అలా తీర్మానించింది. ఆనాటికి మహాత్మాగాంధీ జీవించి లేరు. ఇది కూడా తెలియకుండా జాతీయ చారిత్రక ప్రాముఖ్యత కలి గిన అంశాలపై రాయడం దోషం, అపరాధం కూడా. దేశమంతటికీ అర్థమయ్యే భాషలో సంస్కృత పదాల తత్సమ బెంగాలీలో రాసిన జనగణమన గీతాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో తానే చిన్నపోయారు ఈ కాలమిస్ట్. అందుకు విచారంతోపాటు చరిత్రలో సం ఘటనలను చెప్పడంలో కాలమిస్టు మారుతీ రావు గారు మరింత జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలని అనుకోవడం పాఠకుల కనీసస్థాయి ఆశగా వారు గుర్తిస్తే బాగుంటుంది. (రామతీర్థ ప్రముఖ కవి, రచయిత) మొబైల్: 98492 00385 -
సాహిత్య అకాడమీ తెలుగు కమిటీ రెండుగా విడిపోవాలి...
తెలుగు రాష్ట్రం రెండు ముక్కలయ్యాక సాహిత్య అకాడమీ తెలుగు కమిటీ మాత్రం ఒకటిగా ఎందుకు ఉండాలి? రెండు రాష్ట్రాలకు రెండు కమిటీలు ఎందుకు ఉండకూడదు? దీనికి జవాబు ఏం చెప్తారంటే ఏడు రాష్ట్రాలకు పైగా హిందీ మాట్లాడే ప్రజలకు ఒకే కమిటీ ఉన్నప్పుడు తెలుగుకు మాత్రం ఒకే కమిటీ ఉంటే తప్పేంటి అని. అయితే ఆ ఏడు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి వేరు. ఆ ఏడు రాష్ట్రాలలో ప్రేమ్‌చంద్ ఉత్తరప్రదేశ్ వాడనీ కిషన్‌చందర్ రాజస్తాన్వాడనీ ఇతర రాష్ట్రాల వారు వారిని తమ పాఠ్యపుస్తకాలలో నుంచి తొలగించలేదు. పరస్పరం అనుమానంతో చూసుకోలేదు. తీవ్రంగా అవమానించుకోలేదు. కాని ఇక్కడ తెలుగు రాష్ట్రం ఎటువంటి ఉద్వేగాల మధ్య ముక్కలయ్యిందో అందరికీ తెలుసు. అయ్యాక కూడా నన్నయ్యను తొలగించాలని ఒక వర్గం వారు, నారాయణరెడ్డి అక్కర్లేదని మరో వర్గం వారు... ఇలాంటి తీవ్ర పరిస్థితులు పాదుకొని ఉన్నాయి. విగ్రహాలను కూల్చడం, ప్యాక్ చేసి పంపుతాం అనడం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా ఈ తెలుగు కమిటీ ప్రకటిస్తున్న మూడు అవార్డులు (ప్రధాన సాహిత్య అవార్డు, అనువాదకులకు అవార్డు, యువ రచయితలకు అవార్డు) పెద్ద పెద్ద అసంతృప్తులకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కమిటీలో తెలంగాణవారు ప్రాధాన్యంలో ఉన్నారు. పది మంది కమిటీ సభ్యులలో కనీసం ఎనిమిది మంది జంట నగరాలవారు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్వారికి వారి అభ్యంతరాలు ఉండటం తప్పు కాదు. రాష్ట్రం విడిపోక ముందు ఎవరు కార్యవర్గముఖ్యుడిగా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాని విడిపోయాక ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతం వారిని జడ్జ్ చేసినా ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతం వారిని జడ్జ్ చేసినా సబబైన పని అనిపించదు. రాష్ట్రం ముక్కలయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అకాడమీ కార్యవర్గ ముఖ్యుడిగా ఉండి ఉంటే తెలంగాణ సాహిత్యకారుల భావోద్వేగాలూ స్పందనా ఎలా ఉండేవో తెలియనివి కావు. కనుక సీమాంధ్రుల ఈ స్పందనను వ్యతిరేకదృష్టితో చూడాల్సిన పని లేదు. మంచో చెడో సీమాంధ్రులకు ఒక రాష్ట్రం ఏర్పడింది. ఇక తమ సాహిత్యాన్ని తాము చూసుకోవడం తమకు ఏది మంచో అది ఎంచుకోవడం తమవారిలో ఎవరికి ఏ అవార్డు ఇవ్వాలో నిర్ణయించుకోవడం వారి తలనొప్పి. బాగా రాశారో పేలవంగా రాశారో, రెండు జిల్లాల భాషలో రాశారో, దోపిడీ భాషను సృష్టించారో... ఇదంతా వారి సొంత విషయం. ఇప్పటికే సీమాంధ్రులు అనేక విధాలుగా నష్టపోయారు. అవమానాలు భరించారు. భరిస్తున్నారు. ఇక చాలు. మా రాష్ట్రం మాకివ్వండి... మమ్మల్ని వదిలేయండి అని తెలంగాణవారు ఎంత గట్టిగా కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్‌కు సీమాంధ్రులే సభ్యులుగా ఉన్న సాహిత్య అకాడమీ కమిటీ వేయండి అని ఇటువైపు వారు అంతే బలంగా కోరుకుంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ వెసులుబాటు ఇరు రాష్ట్రాల సాహిత్యరంగాలకూ శ్రేయస్కరం. రామతీర్థ - 98492 00385