ఆలయాల్లో... అందుకే... జ్వాలాతోరణం | Temples ... So ... Arcade | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో... అందుకే... జ్వాలాతోరణం

Published Sun, Nov 13 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

ఆలయాల్లో... అందుకే...   జ్వాలాతోరణం

ఆలయాల్లో... అందుకే... జ్వాలాతోరణం

సన్నిధి

అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం కార్తికం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తికం మానవాళికి కొంగుబంగారం. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు - ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం... ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తికం నిండుగా అల్లుకున్నాయి. అందుకే  ఏ మాసానికీలేని ప్రత్యేకత దీనికే సొంతం.

శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తికం గొప్పవరం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది. కార్తికంలో శివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్య నుంచి ప్రదోష కాలం వరకూ 5 రూపాలతో భక్తుల్ని అనుగ్ర హిస్తాడు - బోళాశంకరుడు.

పున్నమినాడు జ్వాలాతోరణం
కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం. 

జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం.

మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం.

శివకేశవుల చిత్తాన్ని గెలిచే ఉపాయం
కార్తికదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞాన తిమిరాలను ఆవలకు నెట్టి, విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువలంతా కార్తిక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాల్ని కృత్తికా నక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తిక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని ‘కార్తిక పురాణం’ చెబుతోంది. కార్తికమాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని వందల టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ల పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తీక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరిప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దృశ్యం చూడడం కోసమే చాలామంది కార్తికపున్నమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు. 

కార్తిక పున్నమి నాడు ఏం చేయాలి?
చాంద్రమానాన్ని అనుసరించి, ఏ మాసంలోనైనా ఆ మాసపు సంపూర్ణ శక్తి, మహత్తు పున్నమి నాడు ఉంటాయి. కాబట్టి, ఆ మాసమంతా చేయలేకపోయినా, కనీసం పున్నమినాడు సదాచారాన్ని పాటిస్తే మాసమంతా చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీకమాసంలో పౌర్ణమినాడు ప్రాతఃకాలానే లేచి, సముద్రం, నది, కాలువ, మడుగు, ఏరు, బావి, లేదా అందుబాటులో ఉన్న కుళాయి నీటిలో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేసి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, 365 వత్తులతో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. స్నాన, దాన, దీప, అర్చన, ఉపవాస, ఆరాధన, అభిషేక విధులనేవి దేనికది ఫలప్రదం కాబట్టి కనీసం మనం చేయగలిగే కొన్నింటినైనా ఎంచుకుని, వాటిని నిష్ఠగా ఆచరించడం వల్ల కూడా పరమేశ్వరానుగ్రహానికి నోచుకోవచ్చు.

- పూర్ణిమా భాస్కర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement