ఆ రుణం అలా తీరదు...
ఆత్మీయం
పితృరుణం, మాతృరుణం అని రెండుంటాయి. పితృరుణం తీర్చుకోవాలనుకుంటే... దానికి ఒక నిర్దిష్ట యాగం చేస్తే పితృరుణం తీరిపోతుందంటుంది శాస్త్రం. కానీ మాతృరుణం తీరడానికి ఏ యాగం లేదు, యజ్ఞం లేదు... అమ్మ రుణం తీర్చుకోవడమన్నమాటే లేదంటుంది శాస్త్రం. అయితే, దురదృష్టవశాత్తూ అటువంటి అమ్మను వృద్ధాశ్రమాలకి పంపించే ప్రబుద్ధులు తయారవుతున్నారు. బతికి ఉండగా అన్నం పెట్టి ఆదరించని ఈ ‘పెద్ద మనుషులు’ వారు పోయాక మాత్రం ఎంతో శ్రద్ధాభక్తులతో నిత్యకర్మలు ఘనంగా జరిపిస్తారు. చివరి రోజున రకరకాల దానాలు చేస్తారు.
ఖరీదైన వస్తువులు, పాత్రలు, పుస్తకాలు వంటి వాటి మీద వారి పేరు కొట్టించి మరీ బంధుమిత్రులకు వారి జ్ఞాపకాలుగా పంచుతుంటారు. వారి రుణం తీర్చేసుకున్నట్లు పోజు కొడుతుంటారు. అమ్మానాన్నా జీవించి ఉన్నప్పుడు వేళకు ఇంత అన్నం పెట్టి, ఆదరిస్తే... ప్రేమగా పలకరిస్తే వారు మరికొంతకాలం హాయిగా జీవించి ఉండేవారేమో!