పుల్లే కదా అని పారేయకండి! | Matchbox sticks can be decorated Varieties | Sakshi
Sakshi News home page

పుల్లే కదా అని పారేయకండి!

Published Sun, Jul 20 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

పుల్లే కదా అని పారేయకండి!

పుల్లే కదా అని పారేయకండి!

వాయనం: ఇంటి అందం మీద ఇల్లాలి గొప్పదనం ఆధారపడి ఉంటుందని అంటుంటారంతా. నిజమే. ఇల్లు అలంకరించిన విధానాన్ని బట్టి ఆ ఇల్లాలి అభిరుచి ఎలాంటిదో అర్థమవుతుంది. అలాగని ఖరీదైన వస్తువులు తెచ్చి ఇంటిని నింపేయమని కాదు. అందమనేది ఖరీదు మీద ఆధారపడి ఉండదు. పనికి రాని వస్తువులతోటి కూడా ఇంటికి బోలెడంత అందాన్ని తీసుకు రావచ్చు. కావాలంటే ఈ వస్తువుల్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో! వీటిని ఎలా చేశారో తెలుసా... ఐస్ పుల్లలతో! ఐస్‌క్రీమ్ తినేశాక పుల్లల్ని పారబోసే బదులు ఇలా అందమైన వస్తువుల్ని తయారు చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు! ఇందుకు కావలసింది ఐస్ తినగా మిగిలిన పుల్లలు, కొన్ని రంగులు, కాసింత జిగురు... అంతే.
 
 ముందుగా ఏం చేయాలనేది ఓ అంచనా వేసుకుని, అందుకు సరిపడా పుల్లల్ని సేకరించుకోవాలి (ఐస్ తిన్నవే అక్కర్లేదు. ఈ పుల్లల్ని కొన్ని షాపుల్లో అమ్ముతారు). ముందు వీటిని శాండ్ పేపర్‌తో (ఫర్నిచర్, ఇనుప వస్తువుల్ని పాలిష్ చేసేందుకు ఉపయోగించే కాగితం) చదునుగా చేసుకోవాలి. ఆ పైన నచ్చిన రంగులు వేసుకుని, కావలసిన విధంగా జిగురుతో అతికించుకోవాలి. ఎక్కువ కాలం మన్నాలంటే కాస్త మంచి జిగురును వాడండి. ఫొటో ఫ్రేములు, పెన్/పెన్సిల్ స్టాండులు, వాల్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ వాజులు... ఏవైనా చేసుకోవచ్చు. ఒక వస్తువు తయారు చేయడానికి వంద రూపాయలు కూడా అవ్వదు. అంటే తక్కువ ఖర్చులో ఇంటిని ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో కదా! అందుకే ఈసారి ఐస్ పుల్లల్ని పారేయకండి. వాటిని అందంగా మలిచి మీ ఇంటి రేపురేఖల్ని మార్చేయండి!
 
 సూపర్... ఈ కప్ కేక్ మేకర్!
కప్ కేక్స్ చూస్తే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే వీటిని ఎక్కువగా బయటే కొనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే... ఇవి తయారు చేయాలంటే మైక్రో అవన్ కావాలి. అది కొనాలంటే ఆరు వేలో, ఏడు వేలో పెట్టాలి. ఎందుకొచ్చిన గొడవ అని షాపుకెళ్లి తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడంత అవసరం లేదు. ఈ మినీ కప్ కేక్ మేకర్ ఉంటే మీరే చేసేసుకోవచ్చు!
 
  మైదా పిండిలో చక్కెర, కోడిగుడ్డు సొన, బేకింగ్ పౌడర్, పాలు వేసి జారుడుగా కలుపుకోవాలి (ఫ్లేవర్స్ కోరుకునేవారు వెనిల్లా ఎసెన్స్, చాకొలెట్ పౌడర్, డ్రైఫ్రూట్స్ వంటివి వేసుకోవచ్చు). మేకర్‌కి ఉన్న గుంతలకు కాసింత నూనో, నెయ్యో రాసి... అందులో మిశ్రమాన్ని పోయాలి. మూతపెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఇరవై నిమిషాల్లో కప్ కేక్స్ తయారైపోతాయి. ఒక్కసారి ఏడు కప్ కేక్స్ చేసుకోవచ్చు. కరెంటుతో పని చేసే ఈ మేకర్ నాలుగైదు సైజుల్లో దొరుకుతోంది. సైజును బట్టి, మోడల్‌ని బట్టి రూ.1400 నుంచి రూ.3800 వరకూ ఉంటుంది వెల. అమెజాన్ డాట్‌కామ్ లాంటి కొన్ని వెబ్‌సైట్లలో అయితే డిస్కౌంటుతో రూ.1099కే లభిస్తోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement