ప్రయాణంలో ఖర్చు తగ్గించాలంటే...
ట్రావెల్ టిప్స్
తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు చూడటానికి వెళ్లినప్పుడు డబ్బు చేయి దాటిపోతుంటుంది. అందుకే చాలా మంది పర్యటనలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రయాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలంటే... ఒక నీళ్ల బాటిల్‌ను (500 ఎం.ఎల్) ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. సురక్షితమైన తాగునీరు లభించే చోట తిరిగి, ఆ బాటిల్‌ను నింపుకోవాలి. లేదంటే దాహమైన ప్రతీసారి నీళ్లబాటిల్‌ను కొనుగోలు చేయడం వల్ల, వాటికే సగం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాల చిరునామాలు తెలియవు. దీంతో ఇబ్బందితో పాటు, చిన్న చిన్న లోకల్ ప్రయాణ సాధనాలకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అందుకని బస్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్ వంటి వివరాలతో పాటు హోటల్ గదులు, దేవాలయాలు, ఇతర చూడదగిన ప్రదేశాల గురించి అక్కడ ప్రాంత వాసులనే అడిగితే సమయం, డబ్బు ఆదా అవుతాయి.బస్సులో లేదా రైలులో మీ పక్క సీటులో ఉన్న వ్యక్తితో మాటలు కదిపితే అక్కడి ప్రాంత విశేషాలు మరిన్ని తెలుసుకునే అవకాశం సులువవుతుంది.
కొత్త ప్రదేశాల్లో వస్తువులను కొనుగోలు చేసేముందు మన ప్రాంతంలోనూ ఆ వస్తువులు దొరుకుతున్నాయా అనే గమనింపు అవసరం. దర్శనీయ ప్రాంతానికే ప్రత్యేకమైన వస్తువులు, ఇతర అలంకరణ వస్తువులు మినహా ఇతరత్రా ఖరీదైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండటం మంచిది. {పయాణం సులువుగా ముగించడానికి ఇప్పుడు అన్నింటికీ ఏరియా మ్యాప్స్ లభిస్తున్నాయి. వాటిని దగ్గర ఉంచుకొని, వాటిలో సూచనలను అనుసరిస్తూ వెళ్లడం మంచిది.