
అచ్చం మత్స్య కన్యలా!
విడ్డూరం
సరదా కోసం బోలెడు పనులు చేస్తుంటాం. కానీ వాటిని కూడా సీరియస్‌గా చేయడమెలాగో ఫిలిప్పైన్స్‌లో ఉన్న ఓ స్కూల్‌కి వెళ్తే తెలుస్తుంది.
ఫిలిప్పైన్స్‌లో మెర్‌మెయిడ్ స్విమ్మింగ్ అకాడెమీ అని ఒకటుంది. ఈ స్కూల్లో ఈత కొట్టడం నేర్పుతారు. అది మామూలు ఈత కాదు. మత్స్యకన్యలు తెలుసు కదా! బయట ఎప్పుడూ చూడకపోయినా బోలెడు సినిమాల్లో కనిపించాయవి. అవి ఎలా ఈదుతాయో అచ్చు అలాగే ఈదడం నేర్పుతారు ఈ అకాడెమీలో. అది కూడా అల్లాటప్పాగా కాదు. ఎంబీయే, ఎంసీయేల మాదిరే సీరియస్ కోర్సులు ఉన్నాయి.
మత్స్యకన్యలు నిజంగా ఉన్నాయా లేదా అని ప్రపంచం ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉంది కానీ మెర్‌మెయిడ్ స్విమ్మింగ్ అకాడెమీ వారు మాత్రం అవి ఉన్నాయని నిర్థారించేసుకున్నారు. వాటిలా ఈదడం, వాటిలా నీటిలో జీవించడం నేర్పుతామని బోర్డు పెట్టేశారు. వెరైటీ కోరుకునేవారంతా అకాడెమీ ముందు క్యూ కట్టేయడంతో అది కాస్తా ఫేమస్ అయిపోయింది. నిర్ణీత రుసుము తీసుకుని ఆరు నెలలు, ఎనిమిది నెలల కోర్సుల్లో చేర్చుకుని మరీ తర్ఫీదునిస్తున్నారు. చివర్లో సర్టిఫికెట్ కూడా ఇస్తారట. అది ఎందుకు పనికొస్తుందో వారికే తెలియాలి!