చరిత్రలో రక్తాక్షరాలు | The first exchange | Sakshi
Sakshi News home page

చరిత్రలో రక్తాక్షరాలు

Published Wed, Jun 15 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

చరిత్రలో రక్తాక్షరాలు

చరిత్రలో రక్తాక్షరాలు

జూన్ 15, 1667. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జీన్ బాప్టిస్ట్ డెనీస్ చరిత్ర సృష్టించిన రోజు. పద్నాలుగవ కింగ్ లూయిస్‌కి

తొలి మార్పిడి

 

జూన్ 15, 1667. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జీన్ బాప్టిస్ట్ డెనీస్ చరిత్ర సృష్టించిన రోజు. పద్నాలుగవ కింగ్ లూయిస్‌కి వ్యక్తిగత వైద్యుడైన డెనీస్ పదిహేను సంవత్సరాల బాలుడికి  విజయవంతంగా రక్త మార్పిడి చేసిన రోజు. గొర్రె రక్తాన్ని ఆ బాలుడికి ఎక్కించాడు. ప్రపంచ వైద్య పరిశోధనల చరిత్రలోనే అది మొట్టమొదటి రక్తమార్పిడి ప్రయోగం.

 
మాంట్ పెలియర్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన డెనీస్‌కి రక్తమార్పిడి ప్రయోగంపై ఆసక్తి. అనేకసార్లు ఆవుల నుంచి కుక్కలకు రక్తమార్పిడి చే శాడు. ఎప్పటికైనా మానవులకు రక్తమార్పిడి చేయాలని అతడి కల. ఆ కల నెరవేరే రోజు రానే వచ్చింది. అతని దగ్గరకు పదిహేను సంవత్సరాల వయసున్న బాలుడిని తీసుకువచ్చారు. అతడి దగ్గరకు వచ్చేసరికి ఆ బాలుడు మగతగా ఉన్నాడు. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతోంది. అందుకు కారణం అతడిని జలగ పట్టుకుంది. చాలా రక్తం పీల్చేసింది. వెంటనే డెనీస్ 12 ఔన్సుల గొర్రె రక్తాన్ని ఆ బాలుడికి ఎక్కించాడు. ఆ బాలుడు అతి త్వరగా కోలుకున్నాడు. అందరికీ అతడిని చూస్తే ఆశ్చర్యం వేసింది.

 
మొట్టమొదటి రక్తమార్పిడి విజయవంతం అయింది! ఆ తర్వాత డెనీస్ మరింత మందికి రక్తమార్పిడి చేయడానికి సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు, ఆ తరవాత చేసిన రక్తమార్పిడి చికిత్సలో విజయం సాధించలేకపోయాడు. చాలామంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. 1670లో అతడిని రాజాస్థాన విధుల నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఇక ఎన్నడూ ఆ ప్రక్రి యను చేపట్టలేదు డెనీస్. తన వైద్యవృత్తిలోనే సాధారణ జీవితం గడిపాడు.

 
ఏది ఏమైనప్పటికీ చరిత్రలో డెనీస్ తొలిసారి మానవులకు రక్తమార్పిడి జరిపిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. దాంతో రక్తమార్పిడి చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని మానవాళి తెలుసుకుంది. సుమారు 230 సంవత్సరాల తరువాత 1900లో కార్ల్ ల్యాండ్‌స్టీనెర్ అనే ఆస్ట్రియన్ జీవశాస్త్రవేత్త రక్తంలో నాలుగు విభాగాలు ఉంటాయని గుర్తించాడు. అందుకుగాను నోబెల్ బహుమతి కూడా అందుకున్నాడు స్టీనెర్. ఆయన చేసిన సునిశిత పరిశోధన కారణంగానే సురక్షితంగా రక్తమార్పిడి చేయగలుగుతున్నారు. ఆయన చేసిన పరిశోధన వల్లే ఈరోజు లక్షల మంది ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు. అయినప్పటికీ రక్తమార్పిడి ప్రక్రియకు దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా డెనీస్‌ను యావత్ప్రపంచం గుర్తించింది.

 

Advertisement

పోల్

Advertisement