కంటికి లెన్స్ మందు
కంటి జబ్బులతో బాధపడుతున్నవారికి ఒక శుభవార్త. సైంటిస్ట్‌లు ఇప్పుడు ఒక కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లు రూపొందించారు. ఈ కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటే, ఇక విడిగా కంటిలో చుక్కల మందు వేసుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా, శాశ్వతంగా అంధత్వానికి గురి చేసే గ్లాకోమాతో బాధపడుతున్నవారికి ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్‌లు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయట! ఈ లెన్స్‌ల్లో వ్యూహాత్మకంగా ఔషధంతో నిండిన పాలిమర్ ఫిల్మ్ ఉంటుంది. అది కంటికి కావాల్సిన ఔషధాన్ని క్రమంగా సరఫరా చేస్తూ ఉంటుంది. దీని వల్ల గ్లాకోమా రోగులు రోజూ కంటిలో చుక్కల మందు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందినవారు ఈ కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లపై అధ్యయనం చేస్తున్నారు. సర్వసాధారణంగా ప్రపంచంలో అత్యధిక శాతం అంధత్వానికి గ్లాకోమా ప్రధాన కారణం. గ్లాకోమాకు నివారణ లేదు కాబట్టి, కంటిపాపపై ఒత్తిడిని తగ్గించే మందులు వాడి, వీలైనంత వరకు చూపు పోకుండా చూస్తారు. ఇప్పటి వరకు కంట్లో చుక్కల మందు వేయడమే మార్గం.
అయితే, ఈ మందులతో ఒక్కోసారి కళ్ళు మండుతున్నట్లు ఉంటుంది. పైగా, తమకు తామే వేసుకొనే ఈ మందును రోగులు క్రమం తప్పకుండా వాడడం కూడా తక్కువే. అయితే, ఇప్పుడీ కొత్త కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల ప్రత్యేకించి చుక్కల మందు వేసుకొనే అవసరం ఉండదు. లెన్స్‌లో ఉండే మందే క్రమంగా కంటికి అందుతూ ఉంటుంది. ఈ లెన్స్‌లో ఔషధంతో కూడిన పాలిమర్ల సన్నటి ఫిల్మ్ ఉంటుంది. అది లెన్స్ నుంచి చాలా నిదానంగా మందు కంటిపాప పైకి వచ్చేలా చేస్తుంది. సో... గ్లాకోమా రోగులు ఇక ఈ కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవడం బెటర్ కదూ!