Eye disease Lens Patients
-
నాన్నా.. కనపడ్తలే
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విచ్చలవిడి వాడకంతో చిన్నారుల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విటమిన్–ఏ లోపం వల్ల కూడా పిల్లల్లో దృష్టిలోపం మరింత పెరిగిందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ కంటి నివేదికను తాజాగా విడుదల చేసింది. మైదానాల్లో ఆటలు తగ్గడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టడంతో పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రధానంగా దూరం చూడలేని (మయోపియా) పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించింది. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన జ్వరం, డయాబెటిస్ ఉన్న పిల్లల్లోనూ కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని విశ్లేషించింది. మూడు మీటర్ల దూరం నుంచి కూడా వేళ్లను లెక్కించలేని వ్యక్తిని ‘గుడ్డి‘గా పరిగణిస్తారని (గతంలో ఇది ఆరు మీటర్లుగా ఉండేది) ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. పెరిగిన చైతన్యం... తగ్గుతున్న అంధత్వం దేశంలో నానాటికీ అంధత్వం తగ్గుముఖం పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2007తో పోలిస్తే ప్రస్తుతం దేశంలో అంధుల సంఖ్య 47 శాతం తగ్గిందని పేర్కొంది. 2020 నాటికల్లా మొత్తం జనాభాలో అంధుల సంఖ్యను 0.3 శాతానికి తగ్గించాలంటూ ఆ సంస్థ విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు చేరువైనట్లు పేర్కొంది. 2006–07లో దేశ జనాభాలో ఒక శాతం మంది అంధులు ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 0.36 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 2010లో దేశ జనాభాలో 5.30 శాతంగా ఉండేదని, ఇప్పుడు అది 2.55 శాతానికి తగ్గిందని వివరించింది. మరోవైపు తెలంగాణలో గత పదేళ్లతో పోలిస్తే అంధత్వం దాదాపు 52 శాతం తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తర్వాత దీనిపై పలువురు వైద్యాధికారులు విశ్లేషణ చేశారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమం ద్వారా పరిస్థితి మరింత పెరిగిందని చెబుతున్నారు. ఏడు నెలలపాటు కంటి వెలుగు కింద 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. 9,882 గ్రామాల్లో (99.50%) కంటి పరీక్షలు పూర్తిచేశారు. 22.92 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే అందజేశారు. మరో 15 లక్షల మందికి చత్వారీ అద్దాలు ఇచ్చారు. ఆపరేషన్లు సహా ఇతరత్రా తదుపరి వైద్యం కోసం 9.30 లక్షల మందిని ఆసుపత్రులకు రిఫర్ చేశారు. వారిలో దాదాపు 6 లక్షల మందికి వివిధ రకాల ఆపరేషన్లు అవసరమని, మిగిలిన వారికి తదుపరి వైద్యం అవసరమని అంచనా వేశారు. వారిందరికీ సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లోనూ ఆపరేషన్లు నిరంతరం జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు... అందరికీ ఆరోగ్యం వంటి పథకాల్లో కంటి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఆదాయం కలిగినవారికి కూడా అత్యాధునిక కంటి వైద్యం అందజేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ కంటి వైద్యం అందుబాటులోకి రావాలి. డయాబెటీస్, తల్లీపిల్లల ఆరోగ్యం వంటి వాటితోపాటు కంటి జాగ్రత్తలపైనా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కంటి వైద్యం, చికిత్సలపై ఉన్నతస్థాయి పరిశోధనలు జరగాలి. సర్కారు నిధుల కేటాయింపు, ప్రైవేటురంగ భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజల్లో కంటి సమస్యలపై అవగాహన పెంచాలి. ఇందుకోసం ప్రజారోగ్య కార్యక్రమాలు చేపట్టాలి. ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో కంటిపై రేడియేషన్... పిల్లల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ల వాడకం పెరగడంతో వారిలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో గేమ్స్ వాడకం వల్ల బ్లూ రేడియేషన్ ఏర్పడి నిద్రలేమి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించేందుకు కూడా మొబైల్‌ను చేతికి ఇస్తున్నారు. ఇలా వారు అలవాటు పడిపోతున్నారు. – డాక్టర్ దీప శిల్పిక, కంటి వైద్య నిపుణులు శివాస్ హెల్త్ అండ్ ఐ రీసెర్చి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
కళ్లద్దాలు రాలే..
సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం అభాసుపాలవుతోంది. పరీక్షలు చేసిన వైద్యాధికారులు అద్దాలు అందజేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దాల గురించి కంటి చూపు బాధితులు స్థానిక ఆశ కార్యకర్తలను అడిగితే ఎప్పుడొస్తాయో తమకు తెలియదంటుండగా, వైద్యాధికారులు ఆర్డర్ పెట్టామని, త్వరలో వస్తాయని దాటవేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా అద్దాలు అందజేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు పరీక్షల్లో ప్రతీ వంద మందిలో 50 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. 50 రోజులైనా అందని అద్దాలు.. కంటి చూపులో దూరపు చూపు, దగ్గరి చూపు కనబడని వారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్నవారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి అద్దాలకు ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని సమాచారమిచ్చారు. కంటి పరీక్షలు ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా అద్దాలు ఇంత వరకూ రాలేదు. ఆర్డర్ పెట్టిన అద్దాలు వస్తాయా ? రావా ? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అద్దాలు ఎప్పుడు వస్తాయని కంటి వెలుగు శిబిరాల్లో అడిగినా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం తొమ్మిది రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచింది. 1.0 ఆర్‌ఎంబీఎఫ్ నుంచి 2.5ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. 23 వేల మందికి అందిన అద్దాలు.. కంటి వెలుగు కార్యక్రమానికి 1,07,160 మంది హాజరుకాగా 23,352 మందికి కంటి అద్దాలను అందించారు. 22,731 కంటి అద్దాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. 11,123 మందికి కంటి శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేశారు. అద్దాలు లేక తీవ్ర ఇబ్బందులు డాక్టర్లు నెల రోజులకు అద్దాలు వస్తాయని చెప్పినా ఇప్పటి వరకు అద్దాలు రాలేదు. ఎవరిని అడిగినా ఏమి చెప్పడం లేదు. దీంతో కళ్లు కనపడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. వెంటనే కళ్లద్దాలను అందించాలి. –గోరంట్ల లక్ష్మీ, నర్సక్కపల్లి గ్రామం, పరకాల మండలం త్వరలో వస్తాయి.. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు త్వరలో వస్తాయి. దూరపు, దగ్గర చూపు అద్దాలు స్టాక్ లేవు కాబట్టి ఆర్డర్ పెట్టాం. కొంత ఆలస్యమైనప్పటికీ అద్దాలన్నీ వస్తాయి. ఒకటి, రెండు పీహెచ్‌సీలకు ఈ రెండు రోజుల్లో వస్తాయి. వాటిని పంపిణీ చేస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్డర్ తీసుకున్న వారందరికీ అద్దాలు అందిస్తాం. –మధుసూదన్, డీఎంహెచ్ఓ -
కంటికి లెన్స్ మందు
కంటి జబ్బులతో బాధపడుతున్నవారికి ఒక శుభవార్త. సైంటిస్ట్‌లు ఇప్పుడు ఒక కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లు రూపొందించారు. ఈ కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటే, ఇక విడిగా కంటిలో చుక్కల మందు వేసుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా, శాశ్వతంగా అంధత్వానికి గురి చేసే గ్లాకోమాతో బాధపడుతున్నవారికి ఈ కొత్త కాంటాక్ట్ లెన్స్‌లు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయట! ఈ లెన్స్ల్లో వ్యూహాత్మకంగా ఔషధంతో నిండిన పాలిమర్ ఫిల్మ్ ఉంటుంది. అది కంటికి కావాల్సిన ఔషధాన్ని క్రమంగా సరఫరా చేస్తూ ఉంటుంది. దీని వల్ల గ్లాకోమా రోగులు రోజూ కంటిలో చుక్కల మందు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందినవారు ఈ కొత్త రకం కాంటాక్ట్ లెన్స్‌లపై అధ్యయనం చేస్తున్నారు. సర్వసాధారణంగా ప్రపంచంలో అత్యధిక శాతం అంధత్వానికి గ్లాకోమా ప్రధాన కారణం. గ్లాకోమాకు నివారణ లేదు కాబట్టి, కంటిపాపపై ఒత్తిడిని తగ్గించే మందులు వాడి, వీలైనంత వరకు చూపు పోకుండా చూస్తారు. ఇప్పటి వరకు కంట్లో చుక్కల మందు వేయడమే మార్గం. అయితే, ఈ మందులతో ఒక్కోసారి కళ్ళు మండుతున్నట్లు ఉంటుంది. పైగా, తమకు తామే వేసుకొనే ఈ మందును రోగులు క్రమం తప్పకుండా వాడడం కూడా తక్కువే. అయితే, ఇప్పుడీ కొత్త కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల ప్రత్యేకించి చుక్కల మందు వేసుకొనే అవసరం ఉండదు. లెన్స్‌లో ఉండే మందే క్రమంగా కంటికి అందుతూ ఉంటుంది. ఈ లెన్స్‌లో ఔషధంతో కూడిన పాలిమర్ల సన్నటి ఫిల్మ్ ఉంటుంది. అది లెన్స్ నుంచి చాలా నిదానంగా మందు కంటిపాప పైకి వచ్చేలా చేస్తుంది. సో... గ్లాకోమా రోగులు ఇక ఈ కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవడం బెటర్ కదూ!