కొత్త పరిశోధన
బొడ్డుతాడు క్లాంపింగ్‌ను మూడు నిమిషాలు ఆలస్యం చేస్తే..!
బిడ్డపుట్టగానే డాక్టర్ చేసే పని బొడ్డుతాడును ఇరువైపులా క్లిప్పులతో బిగించినట్లుగా చేయడం. ఇలా క్లిప్ చేయడాన్ని క్లాంపింగ్ అంటారు. ఆ తర్వాత ఆ రెండు క్లిప్పుల మధ్య కట్ చేస్తారు. అంటే బొడ్డుతాడును కోస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 10 సెకండ్లలోనే క్లాంపింగ్ చేయడం ఆనవాయితీ. అయితే ఈ క్లాంప్లింగ్ ప్రక్రియను ఎంత ఆలస్యం చేస్తే బిడ్డ కండరాల కదలికలూ, నరాల్లో చురుకుదనం చాలా మెరుగ్గా ఉంటాయని స్వీడిష్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
అయితే క్లాంపింగ్‌ను ఆలస్యం చేయడం మాత్రం బిడ్డ ఐక్యూపై ప్రభావం చూపదంటున్నారు. ఈ క్లాంపింగ్ ప్రక్రియను బిడ్డ పుట్టాక కనీసం 3 నిమిషాల తర్వాత చేయడం వల్ల దీర్ఘకాలంలో బిడ్డకు చాలా ప్రయోజనాలన్నీ చేకూరతాయని వారు వివరిస్తున్నారు. స్వీడిష్ పరిశోధకుల మాటల్లోనే చెప్పాలంటే ‘‘బిడ్డ పుట్టిన 3 నిమిషాల తర్వాత క్లాంపింగ్ చేస్తే ఈలోపు బొడ్డు తాడు నుంచి ఐరన్ పుష్కలంగా ఉన్న అరకప్పు రక్తం అధికంగా బిడ్డకు చేరుతుంది. ఇది బిడ్డ మెదడును మరింత చురుగ్గా చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది’’.
మామూలుగానైతే డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం బిడ్డపుట్టాక బొడ్డుతాడును క్లాంపింగ్ చేయడానికి ఒక నిమిషం ఆగాలి. ఈ నూతన పరిశోధన ఫలితాలను ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు.