మెదడుకు మేలు చేసే తల్లిపాలు...
బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ బ్రెయిన్
పూర్తిగా తల్లిపాలపై చాలాకాలం పాటు పెరిగే పిల్లల్లో భాషలను నేర్చుకునే ప్రతిభ, సహజమైన తెలివితేటల వికాసం ఎక్కువగా ఉంటుందని హార్వర్డ్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇందుకోసం 1,312 మంది తల్లులను ఎంపిక చేశారు. ఏడేండ్ల పాటు ఈ అధ్యయనం కొనసాగింది. ఆ తర్వాత తల్లిపాలు తాగిన పిల్లల తెలివితేటలనూ, నేర్చుకునే సామర్థ్యాలను కొన్ని ప్రామాణిక పరీక్షల ద్వారా అంచనా వేశారు.
ఇందులో తల్లిపాలు తాగిన పిల్లలు చాలా బాగా రాణించారు. అంతేకాదు... భాషలో పట్టు, ఎక్కువ పదసంపద (వకాబులరీ) కలిగి ఉండటం వంటి మంచి లక్షణాలన్నీ తల్లిపాలపై పెరిగిన పిల్లల్లోనే అత్యధికంగా ఉండటాన్ని హార్వర్డ్ పరిశోధకులు గుర్తించారు. కేవలం నేర్చుకునే ప్రతిభ, పదసంపదలు మాత్రమే గాక... తల్లిపాలతో ఒనగూరే ప్రయోజాలన్నింటినీ ఈ పరిశోధకులు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.