
వాతావరణం చల్లబడితే...
బ్యూటిప్స్
వాతావరణం చల్లబడుతున్న కొద్దీ చర్మం పొడిబారుతుంది. అలాగే మృదుత్వాన్ని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే మాయిశ్చరైజర్ తయారు చేసుకుంటే సరి. దానికి తాజా నెయ్యి ముఖ్యం. ఓ గిన్నెలో స్వచ్ఛమైన నెయ్యిని బాగా వేడి చేయాలి. అందులో కొద్దిగా కొబ్బరి నూనె పోసి బాగా కలుపుకోవాలి. అది చల్లారాక ఆ మిశ్రమాన్ని ఓ బాటిల్ పోసుకోవాలి. రోజూ ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు, రాత్రి నిద్రపోయే ముందు కాళ్లకు, చేతులకు రాసుకోవాలి. దాంతో చర్మం ఎప్పుడూ మృదువుగా ఉంటుంది.
మార్కెట్‌లో దొరికే కండీషనర్లు వాడితే ప్రయోజనాల కంటే దుష్ర్పభావాలే ఎక్కువ. కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న కండీషన్లు ఉపయోగిస్తే జుట్టు అందంగానే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటుంది. దానికి బెండకాయ బెస్ట్. అవును అందులోని విటమిన్-బి6, పొటాషియం, జింక్, ఫోలిక్ యాసిడ్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకు 7-8 బెండకాయలను నీళ్లలో వేసి ఉడికించాలి. తర్వాత బెండకాయలను తీసేసి ఆ నీళ్లు చల్లారాక ఓ సీసాలో తీసుకోవాలి. ఒక రాత్రంతా దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయాన్నే తలస్నానం చేశాక మాడును, జుట్టును ఆ నీళ్లతో బాగా రుద్దుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
ముఖం తళతళ మెరవడానికి ఎన్నో క్రీములు, చిట్కాలు ప్రయోగిస్తూ ఉంటారు. అయినా ప్రయోజనం లేదని ఓ రెండు వారాలు వాడి ఊరుకుంటారు. అలాంటి వారు ఇంట్లో చారో, పులుసో చేయడానికి నానబెట్టే చింతపండు శాతాన్ని కాస్త పెంచండి. ఎందుకంటే ఆ చింతపండు గుజ్జుతోనే ముఖం కాంతివంతంగా మారుతుంది. రోజూ ఉదయాన్నే ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాక చింతపండు గుజ్జుతో మర్దన చేసుకోవాలి. ఆ రసాన్ని ఓ 20 నిమిషాల పాటు ముఖంపైనే ఉంచేసుకొని తర్వాత గోరువెచ్చని నీటితో కడుర్కోవాలి. దాంతో ఫేషియల్ చేసుకున్నంత మెరుపు మీ సొంతం.