ప్లేట్ పూజ | The worship of the plate | Sakshi
Sakshi News home page

ప్లేట్ పూజ

Published Mon, Nov 30 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

ప్లేట్ పూజ

ప్లేట్ పూజ

కొబ్బరికాయ... టెంకాయ... నారికేళం...
పేర్లేమైనా కాని పూజ చేయాలంటే ఇది పగలాల్సిందే.
కాయ కొట్టు. దండం పెట్టు.
మరి పొట్టకు?  ప్లేట్ పూజ చేయాలంటే ఇది అక్కర్లేదా?
పచ్చి కొబ్బరి... ఎండు కొబ్బరి... దాంతో ఒక కూర.. దీంతో ఒక భక్ష్యం...
కార్తీకమాసం పూజపునస్కారాల మాసం. ప్రతి గుడిలో ఇంటిలో
కొబ్బరి చిప్పలు పోగుపడే కాలం. ఆత్మ సంతృప్తికే కాదు
 జిహ్వ సంతృప్తికి కూడా ప్రయత్నించండి.
గుడిలోకే కాదు... అలా కిచెన్‌లోకి కూడా నడవండి.
గుప్...  స్టవ్ మండింది. టప్... కొబ్బరి పగిలింది... స్టార్ట్.
 
కొబ్బరి సెనగపప్పు కూర

కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పచ్చి సెనగ పప్పు - కప్పు, కరివేపాకు - 3 రెమ్మలు, ఎండు మిర్చి - 6, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా. తయారీ:  సెనగ పప్పుకు తగినంత నీరు జత చేసి ఉడికించాలి. (మరీ మెత్తగా అవ్వకూడదు. కుకర్‌లో కాకుండా విడిగా ఉడికించుకుంటే ముద్దలా అయిపోకుండా విడివిడిలాడుతూ వస్తుంది)  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి  ఉడికించుకున్న సెనగపప్పు వేసి బాగా కలపాలి  కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేసి బాగా, మూత ఉంచాలి  ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి  వేడి వేడి అన్నంలో, కమ్మటి నెయ్యి వేసుకుని తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.
 
కొబ్బరి వడలు

కావలసినవి: బియ్యం - కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి -4, ఉప్పు - తగినంత, క్యారట్ తురుము - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం తురుము - టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - పావు కప్పు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ:  బియ్యాన్ని సుమారు రెండు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి  మిక్సీలో... నానిన బియ్యం, కొబ్బరి ముక్కలు, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి, ఉప్పు, అల్లం తురుము వేసి మెత్తగా తిప్పాలి  మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తరుగు వేసి చేతితో బాగా కలపాలి  బాణలిలో నూనె కాగగానే  పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి రెండు వైపులా బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాట్ సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.
 
కొబ్బరి బూరెలు
కావలసినవి: పాలు - కప్పు, పంచదార - కప్పు, కొబ్బరి తురుము - కప్పు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఏలకుల పొడి - టీ స్పూను, మినప్పప్పు - అర కప్పు, బియ్యం - కప్పు. తయారీ:  ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి  2 టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి పాలు విరిగే వరకు కలపాలి  పంచదార వేసి కరిగించాలి  కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేయాలి  మినప్పప్పు, బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా రుబ్బాలి  తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి తురుము మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె కాగాక, కొబ్బరి ఉండను బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి, బూరెల మాదిరిగా నూనెలో వేసి, వేయించి తీసేయాలి.
 
కొబ్బరి జున్ను

కావలసినవి: కండెన్స్‌డ్ మిల్క్ - కప్పు, పచ్చి కొబ్బరి తురుము - కప్పు, పెరుగు - కప్పు, ఏలకుల పొడి - టీ స్పూను. తయారీ:  ఒక పాత్రలో కొబ్బరి తురుము, కండెన్స్‌డ్ మిల్క్, పెరుగు వేసి బాగా కలిపాలి  ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి  ఒక పాత్రలో ఈ మిశ్రమం వేసి,ఇడ్లీ కుకర్‌లో కాని, రైస్ కుకర్‌లో కాని ఉంచి, విజిల్ లేకుండా సుమారు అరగంటసేపు ఉంచి దించాలి  చల్లగా అందించాలి.

కొబ్బరి పులుసు
కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు, చింతపండు - నిమ్మకాయంత (నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాలి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 6, మెంతులు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, నూనె - టేబుల్ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట, రసం పొడి - టీ స్పూను. తయారీ:   బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించాలి  కొబ్బరి తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  చింతపండు పులుసు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి  చిన్న గిన్నెలో బియ్యప్పిండి, చిన్న గ్లాసుడు నీళ్లు వేసి చిక్కగా కలిపి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి ఉడికించాలి  పులుసు చిక్కబడ్డాక, కరివేపాకు, పసుపు, రసం పొడి వేసి బాగా కలిపి, దించే ముందు కొత్తిమీర వేయాలి.
 
కొబ్బరి పొడి
కావలసినవి: ఎండు కొబ్బరి చిప్ప - 1, పుట్నాల పప్పు - 2 కప్పులు, ఎండు మిర్చి - 7, సెనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, ఇంగువ - చిటికెడు, నెయ్యి - టేబుల్ స్పూను. తయారీ:  ముందుగా ఎండు కొబ్బరిని సుమారు గంటసేపు ఎండలో ఎండబెట్టాలి.
 
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పొడిలా వచ్చేలా పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి  పుట్నాల పప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  బాణలిలో నెయ్యి వేసి కాగాక, పచ్చిసెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాక, ఎండు మిర్చిని మాత్రం వేరు చేసి, జీలకర్ర జత చేసి వేయించి తీసేయాలి  మిగిలిన నేతిలో కరివేపాకు వేయించి తీసేయాలి  పాత్రలో కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, పోపు సామాను, కరివేపాకు వేసి బాగా కలపాలి  వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే రుచిగా ఉంటుంది. (సూచన: కొబ్బరిని ఎక్కువ సేపు మిక్సీలో తిప్పకూడదు. అలా చేస్తే ఎండు కొబ్బరి నుంచి నూనె వచ్చే అవకాశం ఉంటుంది)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement