అవును కలలకు కూడా టెక్నాలజీ అవసరం.. అదే నెరవేర్చుకోవడానికి!బీటెక్ చేస్తున్న పిల్లలు టెక్ చేయడం మాని వారివారి కలల సాకారానికి చేసే ప్రయత్నం..ఆ ప్రయత్నంలో ఎదుర్కొనే అడ్డంకులు.. పడే అవమానాలు.. పేరెంట్స్‌కి వీళ్ల పట్ల ఉన్న ప్రేమ, ఆశ.. అన్నీ అందరికీ జీవిత పాఠాలే!
తల్లిదండ్రుల ఒత్తిళ్ల నుంచి కంటున్న కలల సాకారం వరకు సాగిన ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ ప్రయాణం.. బీటెక్! జీ5 తెలుగు వెబ్ సిరీస్. దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి స్క్రిప్ట్ ఇది. తొమ్మిది ఎపిసోడ్ల ఆ స్టోరీ...
విక్రమ్ .. ఒక సినిమా
ఇంజనీరింగ్ చదివించి మంచి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌ని చేయాలన్న పేరెంట్స్ ఆశయానికి విరుద్ధమైన కల విక్రమ్‌ది. ఒక్కడే కొడుకు. ఫిల్మ్ మేకింగ్ అంటే ఆసక్తి. ప్రతి పరీక్షకి ఆన్సర్‌షీట్‌లో కథ రాసి వస్తుంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో తన బయోగ్రఫీనే రాసేస్తాడు. స్నేహితుడి సలహాతో షార్ట్ సినిమా తీయాలని నిర్ధారించుకుంటాడు. ఆ షార్ట్ సినిమా కనెక్షన్‌తో బిగ్ స్క్రీన్‌ని డైరెక్ట్ చేయాలని అబ్బాయి డ్రీమ్. సినిమా పరిశ్రమలోని సుప్రసిద్ధ వెటరన్ డైరెక్టర్ జడ్జిగా వ్యవహరించిన ఓ షార్ట్‌మూవీ కాంపిటీషన్‌కు తన మూవీని పంపిస్తాడు. టాప్ ఫైవ్‌లో ఉన్నా కూడా తన సినిమాకు ఇవ్వకుండా అసలు షార్ట్‌లిస్ట్‌లో లేని ఇంకో మూవీకి ప్రైజ్ ఎనౌన్స్ చేస్తారు.
దీని మీద గొడవ పడ్తారు విక్రమ్ అండ్ ఫ్రెండ్స్. ఆ డైరెక్టర్‌తో కూడా. ఆ పెద్దాయన అండ్ టీమ్ విక్రమ్‌ను దృష్టిలో పెట్టుకుంటారు. ఆ సీన్ అక్కడికి ఎండ్ అయి.. విక్రమ్ తీసిన ఫీచర్ ఫిల్మ్ దగ్గర మళ్లీ కనెక్ట్ అవుతుంది. తన జీవితాన్నే కథగా మలిచిన స్క్రిప్ట్‌తో లోన్ తీసుకుని మరీ సినిమా తీస్తాడు విక్రమ్. ప్రివ్యూలో డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నచ్చుతుంది. కాని కొనడానికి ముందుకురారు. ‘‘అందరూ బాగుంది అంటున్నారు. మరి ఎవరూ ఎందుకు కొనట్లేదు సర్?’’ అమాయకంగా అడుగుతాడు విక్రమ్. ‘‘కథ బాగుందయ్యా.. కాని కమర్షియల్ వాల్యూస్ లేవు’’అంటూ ప్రాక్టికల్ ట్రూత్ చెప్తాడు ఒక డిస్ట్రిబ్యూటర్.
అప్పుడు కనపడ్తాడు ప్రివ్యూ థియేటర్ ప్రెమిసెస్‌లో సుప్రసిద్ధ వెటరన్ డైరెక్టర్. ‘‘నాలాంటి వాళ్లు నీ సినిమా గురించి.. ప్చ్ అంటూ ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తే చాలు.. నీ కథ ఎలా ఎండ్ అవుతుందో తెలిసింది కదా! పెద్దవాళ్లతో పెట్టుకోవద్దు’’ అని హెచ్చరికతో కూడిన వెటకారమాడ్తాడు ఆ పెద్ద డైరెక్టర్. విక్రమ్‌కి అసలు సినిమా అప్పుడు కనపడ్తుంది. కాని వెనక్కి మళ్లడానికి మనసొప్పదు. పైగా అప్పటిదాకా తన కలకు అడ్డం పడ్డ తండ్రి కూడా కోరుకున్న గమ్యం చేరుకొమ్మని వెన్ను తడ్తాడు. ముందుకే వెళ్లాలనుకుంటాడు దీన్నో పాఠంగా తీసుకొని.
అఖ్తర్ అండ్ బైక్
హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు అఖ్తర్. వాళ్ల నాన్న.. కొడుకులిద్దరినీ బాగా చదివించాలని తాపత్రయపడ్తుంటాడు. ఆయననుకున్నట్టుగానే పెద్దకొడుకు చదువులో ఫస్ట్. ప్రవర్తనలో జెమ్. అఖ్తర్ మీదేమో ఆ తండ్రికి ఆకతాయి అనే ఇంప్రెషన్. క్లాస్‌రూమ్ కన్నా అఖ్తర్‌కి బైక్ గ్యారేజే మంచి కిక్‌నిస్తుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అతని తండ్రికేమో కొడుకు ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగో చదివితే బాగుండు అనే ఆశ. పెద్దవాడిలా డిసిప్లిన్‌తో ఉండడని.. ఆవారా తిరుగుళ్లు తిరుగుతుంటాడని.. అఖ్తర్‌ను, అతని ఫ్రెండ్స్‌నూ అస్తమానం తిడ్తుంటాడు. అన్నతో పోల్చి అడుగడుగునా అవమానపరుస్తుంటాడు. అఖ్తర్ బైక్ కొనివ్వమని అడిగితే.. ఓల్డ్ మోడల్ యమహా ఆర్‌ఎక్స్ 100 సెకండ్ హ్యాండ్ బండీ తెచ్చిస్తాడు. పెద్ద కొడుక్కేమో మార్కెట్‌లో ఉన్న న్యూ మోడల్ బైక్ కొనిస్తాడు.
బైక్ రేస్‌లను శ్వాసగా భావించే అఖ్తర్.. నాన్న ఇచ్చిన బైక్‌కు తన గ్యారేజ్‌లో కొత్త రూపమిస్తాడు. రఫీ అనే డియరెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి రేసుల్లో పాల్గొంటుంటాడు. ఆ గెలుపుతో తన పనితీరు మీద నమ్మకాన్ని పెంచుకుంటుంటాడు అఖ్తర్. ఇంకా మంచి రేస్ బైక్‌ను తయారు చేయాలనుకుంటుంటాడు. తమ్ముడి తపన అన్నకు అర్థమవుతుంది. సపోర్ట్ చేస్తాడు. అన్న భుజం తట్టేసరికి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కొత్త రేస్ బైక్ రీమోడలింగ్‌లో సీరియస్‌గా పడిపోతాడు అఖ్తర్. తండ్రి చీవాట్లు, ఇన్‌సల్ట్స్ షరా మామూలే. అయినా బ్రేక్ వేయడు. స్పీడ్ తగ్గించడు.
హరి అతని పరిశ్రమ
హరి .. బాగా బతికి చతికిలబడ్డ కుటుంబంలోని కుర్రాడు. చదువు కన్నా వ్యాపారం మీద మక్కువ. దాని వెనక ఒక కారణం ఉంది. బతికిన కుటుంబం అని చెప్పుకున్నాం కదా. హరి బాల్యంలో వాళ్ల నాన్న పెద్ద వ్యాపారి. ఉండడానికి మంచి బంగ్లా... కారు.. ఫారిన్ బ్రీడ్ డాగ్.. అలా అన్నమాట. నష్టాలపాలై సర్కారు వేలంలో ఆ విలాసం ఇంకొకరి పాలవుతుంది. çకుటుంబం సొంతూరులో స్థిరపడిపోతుంది. పసి హరి హృదయానికి ఇదొక గాయం. అదే పట్టుదలనూ పెంచుతుంది. పెద్దయ్యాక ఎలాగైనా సరే.. ఆ ఇంటిని మళ్లీ సొంతం చేసుకొని తండ్రికి కానుకగా ఇవ్వాలనుకుంటాడు. స్ఫూర్తి కోసం సమయం దొరికినప్పుడల్లా ఆ ఇంటిముందున్న టీ కొట్టులో కూర్చుంటుంటాడు.
అందుకే బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసి బిజినెస్‌లో పడిపోతాడు. డక్కామొక్కీలు సా«ధారణమే. అతను సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కంపెనీ మోసం చేసి బిచాణా ఎత్తేస్తుంది. హరికి నిస్సత్తువ ఆవహిస్తుంది. ఫ్రెండ్ సహాయంతో కొత్త వ్యాపారానికి సన్నాహాలు మొదలుపెడ్తాడు. ఈలోపే మరదలు రమ్యకు పెళ్లి చూపులు. ఆమెకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఆ మాట తండ్రికి చెప్పే ధైర్యమూ చేయదు. సో.. బావ హరికి చెప్తుంది. అంతేకాదు.. నువ్వంటే ఇష్టం..నిన్ను పెళ్లిచేసుకుంటాను అనీ తన మనసూ బయటపెడ్తుంది. ఓ రోజూ ఇంట్లో వాళ్లకు, ఇటు హరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది.
చిర్రుబుర్రులాడుతూనే మరదలితో కలిసి అద్దెంట్లోకి దిగుతాడు. వ్యాపారంలో సక్సెస్‌కోసం పాటుపడుతుంటాడు. ఏ కంపెనీలో షేర్లు పెడితే ఎంత లాభమో.. సలహా ఇస్తుంది రమ్య. అబ్బురపడ్తాడు ఆ అవగాహనకు హరి. తన చదువు అదే అని ఆ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది రమ్య. అప్పటినుంచి రమ్యను తన బిజినెస్ ప్లానింగ్‌లో పార్ట్‌నర్‌ను చేస్తాడు. అనుకున్నవన్నీ నిజమైతే.. సిరీస్‌లో ఎక్సైట్‌మెంట్ ఏముంటుంది? కదా.. కాబట్టి రమ్య ఇన్వెస్ట్ చేయమని చెప్పిన కంపెనీ బోల్తా కొడుతుంది.
అప్పుడు ఏమవుతుంది?
విక్రమ్, హరి, అఖ్తర్‌ల కనెక్షన్ కనిపిస్తుంది. దీనికి సూత్రధారుడు రఫీ. అఖ్తర్ జాన్‌జిగ్రీ. అతనూ బీటెక్ స్టూడెంటే. అఖ్తర్‌కు చేదోడువాదోడుగా గ్యారేజీలో ఉంటుంటాడు. కలిసి రేస్‌లకు, గొడవలకు వెళ్తుంటారు. కలిసే తల్లిదండ్రుల తిట్లు తింటుంటారు. దురదృష్టవశాత్తు ఆ స్నేహం చివరిదాకా సాగదు. క్యాన్సర్‌తో రఫీ చనిపోతాడు. రఫీ చనిపోయే వరకు అతనికి క్యాన్సర్ అని అఖ్తర్‌కు తెలీదు. గ్యారేజితోపాటు ఓ కెమెరా ఎక్విప్‌మెంట్ షాప్‌లో కూడా పనిచేస్తుంటాడు రఫీ. విక్రమ్ షార్ట్ ఫిల్మ్స్‌కి తక్కువ ధరకు కెమెరా ఇప్పించి సహాయం చేస్తాడు రఫీ. అలా వాళ్లిద్దరికి పరిచయం అవుతుంది. ఒకసారి అఖ్తర్, రఫీ బైక్‌రేస్ పెట్టుకున్నప్పుడు కళ్లు తిరిగి రోడ్డు మీద పడిపోతాడు రఫీ.
అతనిని ఆసుపత్రిలో చేర్చడంలో అఖ్తర్‌కి సహాయపడ్తాడు హరి. అలా హరికి, రఫీ, అఖ్తర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయాలను తన ఆప్తమిత్రుడు అఖ్తర్‌కి సహాయపడేలా చేయాలనుకుంటాడు రఫీ. అదే అతని చివరి కోరిక. చేస్తాడు కూడా. చేసి ఈ ముగ్గరు విజయాలకు కారణమవుతాడు. విక్రమ్ దగ్గర మంచి బైక్ ఉంటుంది. కెమెరా ఎక్విప్‌మెంట్ రెంట్‌కి తీసుకున్నందుకు బదులుగా అతని బైక్‌ను అఖ్తర్‌కు ఇవ్వమంటాడు కొన్ని రోజుల కోసం. సరే అని అడ్రస్ కనుక్కొని అఖ్తర్‌కు ఇచ్చేస్తాడు. ఆ బైక్‌ను రీ మోడలింగ్ చేయడానికి కావల్సిన డబ్బు కోసం తను కనిపెట్టిన కొత్త రేస్ ఇంజిన్ ఫార్ములాను హరికి పేటెంట్‌గా ఇచ్చి డబ్బు తీసుకుంటాడు అఖ్తర్.
తర్వాత ఆ ఫార్ములా హిట్ అవుతుంది. ఆ ఫార్ములానే షేర్ మార్కెట్‌లో దివాలా పరిస్థితుల్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీకి ఇచ్చి.. ఆ కంపెనీని ఆదుకుంటాడు హరి. దాంతో ఆ కంపెనీ నిలదొక్కుకుంటుంది. హరి షేర్లతోపాటు ఇంకెందరి షేర్లో అమాంతం పెరిగిపోతాయి. ఇంకోవైపు రేస్‌లో తను గెల్చుకున్న మనీని విక్రమ్‌కు తెచ్చిస్తాడు అఖ్తర్.. ‘‘ఇది న్యాయంగా నీకే చెందాల’’ంటూ.. వద్దువద్దని విక్రమ్ వారిస్తున్నా వినకుండా. మరోవైపు హరి కొనుక్కోవాలనుకున్న ఇల్లు ఇంకొకరి హయాంలోనూ వేలానికి వెళ్లిపోతుంది. అది పాడుకోవాలనుకుంటే కోట్లుండాలన్న సత్యమూ బోధపడుతుంది. కాంప్రమైజ్ కంపల్సరీ అన్న అనుభవం ఇచ్చిన జ్ఞానంతో.. ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుక్కొని తండ్రి కళ్లల్లో వెలుగు చూస్తాడు హరి.
అంతేకాదు తన బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కు ఓ ఫార్ములాతో దారి చూపించిన అఖ్తర్‌నూ తన కంపెనీలో చేర్చుకుంటాడు. అఖ్తర్ ఇచ్చిన డబ్బు అటు విక్రమ్‌లో కొత్త సినిమా కలకు కలర్స్ అద్దడం మొదలుపెడ్తుంది. రెగ్యులర్ కథే. ముఖ్యమైంది ఐడెంటిటీ. తల్లిదండ్రులు, వారి పిల్లలు అందరూ ఈ సిరీస్‌లోని పాత్రల్లో తమను తాము అన్వయించుకుంటారు. పేరెంట్స్ మాతో ఇలా ఉంటే బాగుండు అనే అనుబంధాన్నీ చూసుకుంటారు. కలలు కనండి.. సాకారం చేసుకోండి అని కలాం చెప్పే మాటనే ప్రాక్టికల్ అడ్డంకులతో సహా చూపించారు. అయినా అధైర్య పడొద్దనే భరోసానూ ఇస్తుంది ఈ సిరీస్. దీనికి డైరెక్టర్ ఉపేంద్ర వర్మ.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment