
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. సుమారు మూడు దశాబ్దాలుగా చీరాల పేరు మిఠాయికి కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మునీర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది స్వీట్ సమోసా. సమోసా అంటే త్రికోణాకారంలో ఉండేది అనుకుంటే పొరపాటు. పై భాగాన్ని మైదా పిండితోనే తయారుచేస్తారు. ఫిల్లింగ్ మాత్రం ప్రత్యేకంగా జీడిపప్పులు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్‌లతో తయారుచేస్తున్నారు మునీర్. సమోసాలను ఏరోజుకారోజు తాజాగా తయారుచేస్తారు మునీర్. దోరగా వేయించిన సమోసాలను బెల్లం పాకంలో వేసి చాలాసేపు ఊరిన తరవాత తింటారు. అందువల్ల ఇవి బాగా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి.చీరాల సమోసాను మునీర్ స్వయంగా రూపొందించారు.
డెబ్భయ్యో పడిలో పడిన మునీర్ తాను యువకుడుగా ఉన్నప్పుడు ఒంగోలులో అరటిపండ్ల వ్యాపారం చేసేవారు. వాటితో పాటు ఆయా ఋతువులలో వచ్చే అన్నిరకాల పండ్లను సుమారు పది సంవత్సరాల పాటు అమ్మారు. ఈ వ్యాపారాలేవీ తన ఆర్థిక ఇబ్బందులను తీర్చకపోవడంతో, చీరాల వెళ్లి, సమోసా వ్యాపారం ప్రారంభించారు.సాధారణంగా తయారుచేసే ఉల్లిపాయ, బంగాళదుంప బదులు, జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ తో స్టఫింగ్ చేసి సమోసా రూపొందించారు మునీర్. ‘‘30 సంవత్సరాల క్రితం చీరాల వచ్చేసి సమోసా వ్యాపారం ప్రారంభించాను. ఆ రోజుల్లో చీరాలలో సమోసాలు తయారుచేసేవారు లేకపోవడంతో నా వ్యాపారం బాగా సాగింది. కొద్ది రోజులకే పోటీ ఎదురైంది. ఆ పోటీ తట్టుకోవడానికి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనుకున్నాను.
చేతికి దొరకిన వాటితో రకరకాలుగా ప్రయత్నించాను. చిట్టచివరకుఈ ఆలోచన వచ్చింది. సమోసాలో ఇదొక కొత్త ప్రయోగం కావడంతోను, ఇందులో ఉపయోగించేవన్నీ విలక్షణమైనవి కావడంతోను స్వీట్ సమోసా ప్రారంభించిన వెంటనే మంచి ఆదరణ వచ్చింది’ అంటారు మునీర్.భార్య సహాయంతో ఇంటి దగ్గరే తయారుచేసి, వాటిని తోపుడు బండి మీద పెట్టుకుని, సాయంత్రం అవుతుండగా దర్బార్ రోడ్డులోని ఎస్‌బిఐ ఏటిఎం దగ్గరకు వస్తారు. అమ్మకాలు ప్రారంభించిన రెండు మూడు గంటల లోపే సమోసాలన్నీ అమ్ముడైపోతాయి. స్వీట్ సమోసాకి అంత డిమాండ్ ఉంది. ఇందులో ఉపయోగించే వస్తువుల వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల, ఇప్పటికీ స్వీట్ సమోసా విషయంలో పోటీ లేదు.
ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ సమోసాలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. అందువల్లే ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మంచి క్వాలిటీతో తయారుచేస్తుండటం వల్ల ఈ సమోసా ధర 7 రూపాయలతో ప్రారంభమై ఇప్పుడు 25 రూపాయలకు పెరిగింది. వీటి గిరాకీ కూడా అలాగే పెరిగింది. ఆర్డర్ల మీద కూడా మునీర్ సమోసాలు సప్లయి చేస్తుంటారు. ఇదంతా ఒంటి చేతిమీదే జరుగుతుంది. తయారుచేసుకున్న సమోసాలను నూనెలో వేయించి తీసాక, సిద్ధం చేసి ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి రెండు మూడు నిమిషాలు ఉంచి బయటకు తీస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment