అంబేడ్కర్ ఆలోచనలు మలిదశ ఉద్యమానికి ప్రాతిపదికగా నిలిచాయి. ఉద్యమకాలంలోనే కాదు పునర్నిర్మాణంలోను అంబేడ్కర్ ఆశయాలు మార్గదర్శకం కావాలి.
ఎం.కోదండరామ్
అంబేడ్కర్ ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆధునిక తత్వవేత్తలలో అగ్రస్థానంలో ఉంటారు. భారతదేశాన్ని పటిష్టమైన ప్రజాస్వామిక దేశంగా, సౌభ్రాతృత్వం పునాదిగా బలమైన జాతిగా రూపొందించే ఆలోచనతో ఆయన తన రచనలను, రాజకీయ కార్యాచరణను కొనసాగించాడు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ఆయన రాసిన సిద్ధాంతాలే తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచాయి. అంబేడ్కర్ ప్రతి మనిషికి సమాన విలువ ఉండాలని వాదించారు. సమానత్వపు హక్కును ప్రజాస్వామిక సమాజానికి పునాదిగా భావించి, ఆ హక్కు సాధనకే వ్యక్తులకు, సమూహాలకు మధ్య అంతరాలను తొలగించి, న్యాయాన్ని అందించగల సమాజం పెంపొందాలన్న సంకల్పంలో జీవితకాలమంతా పోరాటాలు కొనసాగించారు. అందులో భాగంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశంపైన సామాజిక, రాజకీయ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అంబేడ్కర్ మూడు ప్రతిపాదనలు చేశారు. మొదటిది రాష్ట్రాల ఏర్పాటు పద్ధతికి సంబంధించినది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచనను అంబేడ్కర్ తిరస్కరించారు. అసెంబ్లీకి నిర్ణయాధికారం ఇస్తే, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఎప్పుడూ ఆ సభ అంగీకరించదని అంబేడ్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. అందువలన తక్కువమంది ఎమ్మెల్యేలుగల ప్రాంతాల ఆకాంక్షలు పరిపూర్తి చెందవు. అందుకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటే చాలునని సూచించారు. అసెంబ్లీ సమ్మతి అనవసరమని ప్రతిపాదించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 రూపకల్పన చేశారు. అంబేడ్కర్ దూరదృష్టితో ఆలోచించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు.
అదే విధంగా మహారాష్ట్ర ఏర్పాటు సందర్భంగా బొంబాయి నగరంపై చెలరేగిన వివాదంపై అంబేడ్కర్ రాసిన రచనలు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్‌పై తలెత్తిన పలుప్రశ్నలకు జవాబులను వెతుక్కోవటానికి ఉపయోగపడ్డాయి. బొంబాయి నగరంలో వ్యాపారాలన్నీ గుజరాతీయులవే. అందువలన గుజరాతీయులు బొంబాయిని కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తేనే తమకు రక్షణ ఉంటుందని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గుజరాతీయుల డిమాండును కేంద్రం అంగీకరించింది. కానీ అంబేడ్కర్ విశ్లేషణాత్మక వ్యాసం తరువాత కేంద్రం తన అభిప్రాయాలను మార్చుకొని, బొంబాయి నగరాన్ని మహారాష్ట్రకు రాజధానిగా కొనసాగించింది.
అంబేడ్కర్ నగరాన్ని పెట్టుబడులు, వ్యాపారాల అవసరాల నుండి కాకుండా ప్రజల దృష్టి నుండి పరిశీలించారు. ‘‘బొంబాయిని మహారాష్ట్రలో కలపాలా వద్దా అన్న సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి, బొంబాయిలో పరిశ్రమలపైన గల గుత్తాధిపత్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని చేస్తున్న వాదన నిజంగా రాజకీయ వాదనే. యజమానులే కార్మికులను పాలించాలి కానీ, కార్మికులు యజమానులను పాలించడానికి అనుమతించకూడదనే ఈ వాదన అర్థం’’ అని అంబేడ్కర్ అంటారు. వివక్ష నుండి రక్షణ కల్పిస్తూ ప్రాథమిక హక్కులతో పాటు పలురకాల నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచినందున గుజరాతీయులు భయపడవలసిన అవసరం లేదని అంబేడ్కర్ అంటారు. రాజ్యాంగాన్ని కాదని మహారాష్ట్ర వివక్షపూరిత చట్టాలు చేసినా అన్ని కోర్టుల్లో నిలబడవని చెప్తారు. అంబేడ్కర్ ఆలోచనల ఆధారంగానే హైదరాబాద్ విషయంలోనూ ఆంధ్ర పెట్టుబడిదారులు లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణవాదులు కేంద్రానికి కూడా ఆమోదయోగ్యమైన సమాధానాలు ఇవ్వగలిగారు.
అంబేడ్కర్ ఆలోచనలు మలిదశ ఉద్యమానికి ప్రాతిపదికగా నిలిచాయి. ఆంధ్ర పాలిత ప్రజల పట్ల విద్వేషంతో ఈ మలిదశ ఉద్యమం పుట్టలేదు. ఆంధ్ర కార్పొరేట్, కాంట్రాక్టర్ వర్గాల ఆధిపత్యాన్ని తిరస్కరించడమే తెలంగాణ ఉద్యమ లక్ష్యం. గుప్పెడుమంది చేతిలో రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉండటం ప్రజాస్వామ్య సమాజ లక్షణం కాదు. ప్రజాస్వామ్యం అంటే కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు ప్రజలను సమానంగా చూడాలి. కులమేదైనా, మతమేదైనా సమాన రక్షణ ఉండాలి. సమాన అవకాశాలు దక్కాలి. ఈ ఆలోచనలే ఉద్యమానికి పునాదిగా నిలిచాయి. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలు, అందరికీ సమానావకాశాలు దక్కాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి, వనరులను తవ్విపెట్టే పాలన పోవాలని ప్రజలందరికీ పాలనలో భాగం, వనరుల్లో వాటా దక్కే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు. అది జరగాలంటే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పాలనకు ప్రాతిపదిక కావాలి. అదే అంబేడ్కర్ ఆశయం. ప్రజల కోరిక. ఉద్యమకాలంలోనే కాదు పునర్నిర్మాణంలోను అండడ్కర్ ఆశయాలు మార్గదర్శకం కావాలి.
(వ్యాసకర్త టి.జె.ఎ.సి. చైర్మన్ ఫోన్: 9848387001)
ఉద్యమానికి ప్రాతిపదిక అంబేడ్కర్ ప్రతిపాదనలే
Published Tue, Apr 14 2015 12:08 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM
Advertisement