M. Kodandaram
-
కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు
హుజూరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్ మార్చ్ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
కోదండరామ్‌కు అరవింద్ కేజ్రీవాల్ ఆఫర్! ఆ పార్టీ విలీనం తప్పదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారని వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా శనివారం ఓ రహస్య సమావేశం జరిగింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్‌హౌస్‌లో టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి కోదండరామ్‌తో పాటు, పార్టీ ముఖ్యనేతలంతా హాజరవడం జరిగింది. గతంలోనే రెండు ప్రముఖ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో.. టీజేఎస్‌ను విలీనం చేయాలని చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రావడంతో ఈ విషయంపై పార్టీ నేతలతో కోదండరాం చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఎక్కువ మంది నేతలు ఆమ్ ఆద్మీలో విలీనానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.. అయితే టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నందున అప్పటి దాకా వేచి చూసే ధోరణిలో ఉండాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీకి చెందిన కీలక నేత టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకటి రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. చదవండి: (కేసీఆర్ 3 గంటలే నిద్రపోతున్నారు) -
‘కోదండరాంపై బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’
సాక్షి, హైదరాబాద్: భారత్‌బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఆయన బట్టలు చినిగిపోయేలా దాడి చేసి అరెస్ట్ చేయడం దారుణమని విరుచుకుపడ్డారు. ఈ చర్యను తెలంగాణ సమాజమంతా ఖండించాలన్నారు. బంద్ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేతలపై దాడులకు పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రాములు, సీపీఐ (ఎంఎల్) నాయకుడు గోవర్ధన్ మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. రాజకీయ పారీ్టల నాయకులపై మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా దొంగలపై, దోషులపై వ్యవహరించినట్లు పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేసి అరెస్ట్ చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని నిరసన తెలియజేస్తూ తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలు బంద్‌కు మద్దతివ్వగా తెలంగాణ సర్కార్ మాత్రం బంద్ పాటించిన ఉద్యమకారులను అణచివేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రధాని, సీఎం మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు కనబడుతోందని వారు ఆరోపించారు. -
జీవో 5ను యథావిధిగా అమలు చేయాలి
కవాడిగూడ (హైదరాబాద్): ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కాలరాస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పించాలని, అందుకోసం జీవో 5ను యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు తూట్లు పొడిచే జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, జాక్టో చైర్మన్ సదానంద్‌గౌడ్ ధర్నాకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన పోరాటాలకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. దేశంలో నేటికీ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను చట్టసభల్లో ప్రస్తావించడంతోపాటు ప్రత్యక్షంగా చేసే పోరాటాల్లో కూడా తన మద్దతు ఉంటుందని తెలిపారు. -
ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
నాంపల్లి: ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన 42 రోజుల సకల జనుల సమ్మె జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివా రం అమరవీరుల స్థూపం గన్‌పార్కు వద్ద మలిదశ తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జరిగిన ఈ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నేతలు అశోక్, స్వామిగౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌తో పాటు పలు సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె జరిగిన రోజు సందర్భంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాకపోవడం బాధాకరం అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికి అందాలంటే ఏ తెలంగాణ కోసమైతే కొట్లాడామో ఆ తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని, అం దుకు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. -
నేడే టీజేఎస్ ఆవిర్భావ సభ
సాక్షి, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు నేతలు కసరత్తు చేశారు. సభా వేదికపై 1000 మంది ఆసీనులు కానున్నారు. ఒకే వరుసలో కనీసం 200 మంది కూర్చోవడానికి వీలుగా ఐదు వరుసల్లో స్టేజీ నిర్మాణం జరుగుతోంది. ముందు వరుసలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన సహా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూర్చుంటారు. రెండో వరుసలో అన్ని కోర్టుల న్యాయవాద సంఘాల ప్రతినిధులు, నేతలు, ఆ తర్వాత జేఏసీ స్టీరింగ్ కమిటీలో పనిచేసి టీజేఎస్‌లో చేరిన ముఖ్యనేతలు ఆసీనులవుతారు. మహిళా సంఘాల నేతలు, వివిధ రంగాల్లో పేరున్న మహిళలు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబీకులు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబీకులు, ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన వారి కుటుంబాలు, ఖమ్మం రైతులు కూడా వేదికపై కూర్చుంటారు. తెలంగాణ కళా సంస్కృతుల ప్రదర్శన కోసం వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 800 కళాకారులతో ఒగ్గు కథ, లంబాడీ నృత్యాలు, కోయ, థింసా వంటి అన్ని కళా రూపాలను ప్రదర్శించనున్నారు. వేదికపై భవిష్యత్ కార్యాచరణ ప్రొఫెసర్ హరగోపాల్, నాగేశ్వర్ ప్రత్యేక వక్తలుగా సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కళాకారుల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగానే మధ్యమధ్యలో అమరుల కుటుంబాలు, రైతు, విద్యార్థి, న్యాయవాద, ఇతర నేతలు ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కోదండరాం వేదికపైకి చేరుకుంటారు. అదే సమయంలో టీజేఎస్‌కు కోదండరాంను అధ్యక్షుడిగా అధికారంగా ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యుల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7.30 లోపు సభ ముగించేందుకు టీజేఎస్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఉన్నా వీలైనంత తొందరగానే ముగించడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ ఏర్పాటుకు కారణాలు, లక్ష్యం, భవిష్యత్ కార్యాచరణపై టీజేఎస్ అధ్యక్షుడిగా కోదండరాం సభలో వివరించనున్నారు. ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యం: కోదండరాం నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు తావు లేకుండా పోయిందని ఎం.కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు లేకుండా పోయాయని, సమస్యలున్నాయని చెప్పుకోవడానికి వేదికలు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని ‘సాక్షి’తో పేర్కొన్నారు. ‘‘నిరుద్యోగంతో యువత క్షోభ పడుతోంది. రైతుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. యువతకు ఉద్యోగాల భర్తీ కోసం కేలండర్‌ను ప్రకటించాలని, ఉపాధి కోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి, రైతుల మౌలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు’’ అని విమర్శించారు. అధికారం ఒకే కుటుంబానికి పరిమితమైందని, మంత్రులు, అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యాల కోసం సాగిందో వాటిని సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. టీజేఏసీకి కోదండరాం రాజీనామా టీజేఏసీ చైర్మన్ పదవికి కోదండరాం రాజీనామా చేశారు. తెలంగాణ జన సమితిలో చేరుతున్నందున రాజీనామా చేస్తున్నట్టుగా శనివారం ప్రకటించారు. జేఏసీ నేతలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను టీజేఏసీ కన్వీనర్ కె.రఘు అందించారు. చైర్మన్ పదవిలో లేకుంటే కన్వీనర్‌గా ఉన్న వారే పూర్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. దీని ప్రకారం టీజేఏసీ చైర్మన్‌గా రఘు వ్యవహరించనున్నారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశమై జేఏసీ చైర్మన్, ఇతర కమిటీని ఎన్నుకోనున్నారు. పూర్తిస్థాయి చైర్మన్‌గా రఘును స్టీరింగ్ కమిటీ ఎన్నుకోనుంది. 2009 డిసెంబర్లో ఆవిర్భవించిన టీజేఏసీకి కోదండరాం వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిపాదన మేరకు అప్పుడు జేఏసీ భాగస్వామ్య పార్టీల ప్రతినిధులుగా కె.చంద్రశేఖర్‌రావు(టీఆర్ఎస్ అధినేత), కె.జానారెడ్డి(కాంగ్రెస్), నాగం జనార్దన్‌రెడ్డి(టీడీపీ)తో పాటు బీజేపీ, న్యూడెమొక్రసీలతోపాటు టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ మాల మహానాడు వంటి రాజకీయేతర సామాజిక, ఉద్యోగసంఘాల ప్రతినిధులంతా కోదండరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం మిలియన్ మార్చ్, సాగరహారం వంటి భారీ కార్యక్రమాలను జేఏసీ నిర్వహించింది. జేఏసీకి చైర్మన్‌గా కోదండరాం తొమ్మిదేళ్లుగా నాయకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమంలో తనకు సహకరించిన రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలకు, మీడియాకు ఈ సందర్భంగా కోదండరాం కృతజ్ఞతలను తెలియజేశారు. -
హైదరాబాద్‌లో గవర్నర్‌గిరీని ఒప్పుకోం: కోదండరాం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ టీఎన్జీవో భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 8 తెలంగాణ ప్రజలు కోరుకున్నది కాదని, పరస్పర సమాచారం కోసం, ప్రజల్లో విశ్వాసం కల్పించడమే దాని ఉద్దేశమన్నారు. ప్రశాంత వాతావరణంలో అన్ని ప్రాంతాల ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్న హైదరాబాద్‌లో గవర్నర్, కేంద్రపెత్తనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజల స్వేచ్చకు భంగం కలిగినప్పుడు, ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వచ్చినప్పుడు, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరమని, అది కూడా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సంతృప్తిలేక పోతే గవర్నర్ అభిప్రాయాన్ని చెప్పవచ్చన్నారు. కానీ ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించి.. తద్వార హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని కోదండరాం చెప్పారు. కేవలం ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తప్పు జరిగితే న్యాయవ్యవస్థలో తేల్చుకోవాలని.. లేదా మానవహక్కుల సంఘాలను కలవాలే కానీ ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించడం సరికాదని కోదండరాం పేర్కొన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జేఏసీ.. తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి వెనుకాడదని హెచ్చరించారు. -
ఉద్యమానికి ప్రాతిపదిక అంబేడ్కర్ ప్రతిపాదనలే
అంబేడ్కర్ ఆలోచనలు మలిదశ ఉద్యమానికి ప్రాతిపదికగా నిలిచాయి. ఉద్యమకాలంలోనే కాదు పునర్నిర్మాణంలోను అంబేడ్కర్ ఆశయాలు మార్గదర్శకం కావాలి. ఎం.కోదండరామ్ అంబేడ్కర్ ప్రపంచస్థాయిలో గుర్తించదగిన ఆధునిక తత్వవేత్తలలో అగ్రస్థానంలో ఉంటారు. భారతదేశాన్ని పటిష్టమైన ప్రజాస్వామిక దేశంగా, సౌభ్రాతృత్వం పునాదిగా బలమైన జాతిగా రూపొందించే ఆలోచనతో ఆయన తన రచనలను, రాజకీయ కార్యాచరణను కొనసాగించాడు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ఆయన రాసిన సిద్ధాంతాలే తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచాయి. అంబేడ్కర్ ప్రతి మనిషికి సమాన విలువ ఉండాలని వాదించారు. సమానత్వపు హక్కును ప్రజాస్వామిక సమాజానికి పునాదిగా భావించి, ఆ హక్కు సాధనకే వ్యక్తులకు, సమూహాలకు మధ్య అంతరాలను తొలగించి, న్యాయాన్ని అందించగల సమాజం పెంపొందాలన్న సంకల్పంలో జీవితకాలమంతా పోరాటాలు కొనసాగించారు. అందులో భాగంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశంపైన సామాజిక, రాజకీయ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాఖ్యానించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అంబేడ్కర్ మూడు ప్రతిపాదనలు చేశారు. మొదటిది రాష్ట్రాల ఏర్పాటు పద్ధతికి సంబంధించినది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచనను అంబేడ్కర్ తిరస్కరించారు. అసెంబ్లీకి నిర్ణయాధికారం ఇస్తే, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఎప్పుడూ ఆ సభ అంగీకరించదని అంబేడ్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. అందువలన తక్కువమంది ఎమ్మెల్యేలుగల ప్రాంతాల ఆకాంక్షలు పరిపూర్తి చెందవు. అందుకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటే చాలునని సూచించారు. అసెంబ్లీ సమ్మతి అనవసరమని ప్రతిపాదించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 రూపకల్పన చేశారు. అంబేడ్కర్ దూరదృష్టితో ఆలోచించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. అదే విధంగా మహారాష్ట్ర ఏర్పాటు సందర్భంగా బొంబాయి నగరంపై చెలరేగిన వివాదంపై అంబేడ్కర్ రాసిన రచనలు ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్‌పై తలెత్తిన పలుప్రశ్నలకు జవాబులను వెతుక్కోవటానికి ఉపయోగపడ్డాయి. బొంబాయి నగరంలో వ్యాపారాలన్నీ గుజరాతీయులవే. అందువలన గుజరాతీయులు బొంబాయిని కేంద్రపాలిత ప్రాంతంగా మారిస్తేనే తమకు రక్షణ ఉంటుందని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గుజరాతీయుల డిమాండును కేంద్రం అంగీకరించింది. కానీ అంబేడ్కర్ విశ్లేషణాత్మక వ్యాసం తరువాత కేంద్రం తన అభిప్రాయాలను మార్చుకొని, బొంబాయి నగరాన్ని మహారాష్ట్రకు రాజధానిగా కొనసాగించింది. అంబేడ్కర్ నగరాన్ని పెట్టుబడులు, వ్యాపారాల అవసరాల నుండి కాకుండా ప్రజల దృష్టి నుండి పరిశీలించారు. ‘‘బొంబాయిని మహారాష్ట్రలో కలపాలా వద్దా అన్న సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి, బొంబాయిలో పరిశ్రమలపైన గల గుత్తాధిపత్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని చేస్తున్న వాదన నిజంగా రాజకీయ వాదనే. యజమానులే కార్మికులను పాలించాలి కానీ, కార్మికులు యజమానులను పాలించడానికి అనుమతించకూడదనే ఈ వాదన అర్థం’’ అని అంబేడ్కర్ అంటారు. వివక్ష నుండి రక్షణ కల్పిస్తూ ప్రాథమిక హక్కులతో పాటు పలురకాల నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచినందున గుజరాతీయులు భయపడవలసిన అవసరం లేదని అంబేడ్కర్ అంటారు. రాజ్యాంగాన్ని కాదని మహారాష్ట్ర వివక్షపూరిత చట్టాలు చేసినా అన్ని కోర్టుల్లో నిలబడవని చెప్తారు. అంబేడ్కర్ ఆలోచనల ఆధారంగానే హైదరాబాద్ విషయంలోనూ ఆంధ్ర పెట్టుబడిదారులు లేవనెత్తిన ప్రశ్నలకు తెలంగాణవాదులు కేంద్రానికి కూడా ఆమోదయోగ్యమైన సమాధానాలు ఇవ్వగలిగారు. అంబేడ్కర్ ఆలోచనలు మలిదశ ఉద్యమానికి ప్రాతిపదికగా నిలిచాయి. ఆంధ్ర పాలిత ప్రజల పట్ల విద్వేషంతో ఈ మలిదశ ఉద్యమం పుట్టలేదు. ఆంధ్ర కార్పొరేట్, కాంట్రాక్టర్ వర్గాల ఆధిపత్యాన్ని తిరస్కరించడమే తెలంగాణ ఉద్యమ లక్ష్యం. గుప్పెడుమంది చేతిలో రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉండటం ప్రజాస్వామ్య సమాజ లక్షణం కాదు. ప్రజాస్వామ్యం అంటే కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు ప్రజలను సమానంగా చూడాలి. కులమేదైనా, మతమేదైనా సమాన రక్షణ ఉండాలి. సమాన అవకాశాలు దక్కాలి. ఈ ఆలోచనలే ఉద్యమానికి పునాదిగా నిలిచాయి. ఈ స్ఫూర్తితోనే తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలు, అందరికీ సమానావకాశాలు దక్కాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి, వనరులను తవ్విపెట్టే పాలన పోవాలని ప్రజలందరికీ పాలనలో భాగం, వనరుల్లో వాటా దక్కే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు. అది జరగాలంటే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పాలనకు ప్రాతిపదిక కావాలి. అదే అంబేడ్కర్ ఆశయం. ప్రజల కోరిక. ఉద్యమకాలంలోనే కాదు పునర్నిర్మాణంలోను అండడ్కర్ ఆశయాలు మార్గదర్శకం కావాలి. (వ్యాసకర్త టి.జె.ఎ.సి. చైర్మన్ ఫోన్: 9848387001) -
వాచ్‌డాగ్‌గానే టీ జేఏసీ
రాజకీయ పార్టీగా మారకూడదని స్టీరింగ్ కమిటీ నిర్ణయం తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి జేఏసీ సభ్యులు ఎవరైనా వ్యక్తులుగా ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు ఏం సంక్షోభం నెలకొందని రాష్ట్రపతి పాలన విధించారు?: కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం సాకారమైన నేపథ్యంలో రాజకీయ పార్టీగా మారకూడదని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినట్టుగానే తెలంగాణ పునర్నిర్మాణంలోనూ వాచ్‌డాగ్‌లా ఉండాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. సమావేశం అనంతరం జేఏసీ నిర్ణయాలను కోదండరాం మీడియాకు వివరించారు. జేఏసీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదని, అయితే రాజకీయ పార్టీగా మారదని ప్రకటించారు. జేఏసీలోని నేతలు ఎవరైనా వ్యక్తులుగా ఇతర పార్టీల్లోకి పోవచ్చునని, ఉద్యమాల్లో పాల్గొన్న వారికి పార్టీల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. నాయకులుగా ఎవరు పోయినా జేఏసీ కొనసాగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు పార్టీలన్నీ సహకరించాయని, ఆ పార్టీలన్నిటికీ క్రెడిట్ దక్కుతుందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీలు ఉద్యమానికి సమరశీలత, నైతికత తీసుకువస్తే, కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణత చేకూర్చిందని తెలిపారు. సమైక్య పార్టీలకు తప్ప మిగిలిన వాటికి తెలంగాణలో సానుకూలత ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల విజయమన్నారు. జేఏసీ ఏ రాజకీయపార్టీకి మద్దతివ్వాలనే విషయంపై చర్చ జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు, తరువాత రాజకీయ అంశాలు, జేఏసీ నిర్వహించాల్సిన పాత్ర వంటి పలు అంశాలపై 5న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరంలేదని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం సంక్షోభం వచ్చిందని రాష్ట్రపతి పాలన పెట్టారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జేఏసీ కో కన్వీనర్ దేవీప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి తెలంగాణలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరో కోకన్వీనర్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందుగానే కొందరికి ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇచ్చి స్టేట్ కేడరుగా మార్చారని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో సీమాంధ్రకు సచివాలయం ఇవ్వొద్దని, మరేదైనా ప్రాంతంలో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, నాయకులు సి.విఠల్, అద్దంకి దయాకర్, రసమయి, రఘు, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రే ఎక్కువ తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన ఘనత టీఆర్ఎస్ది అయినా, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఎక్కువగా ఉందని జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణకు సహకరించిన అన్ని పార్టీలకు సమదూరంలో ఉండాలని నిర్ణయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని మాత్రమే పిలుపునివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జేఏసీగా బరిలో ఉండకూడదని సమావేశం తీర్మానించింది. అయితే వ్యక్తులుగా ఎవరైనా, ఏ పార్టీలోనైనా ప్రయత్నించొచ్చని వెల్లడించింది. అంతర్గత విషయాలు లీక్ చేస్తే బహిష్కరణ జేఏసీ స్టీరింగ్ కమిటీలో అంతర్గతంగా చర్చించిన అన్ని అంశాలు మీడియాకు తెలుస్తున్నాయని, వాటిని బయటకు వెల్లడిస్తున్న వారిని గుర్తించి స్టీరింగ్ కమిటీ నుండి బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. -
అడ్డుకుంటోంది రియల్ఎస్టేట్ గద్దలే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గద్దలే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల జేఏసీ సదస్సు శనివారం హైదరాబాద్‌లో జరిగింది. కోదండరాంతో పాటు రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి(కాంగ్రెస్), ఎంపీ జి.వివేక్, టీఆర్ఎస్ శాసనసభాపక్షనాయకులు ఈటెల రాజేందర్, కె.విశ్వేశ్వర్ రెడ్డి(టీఆర్ఎస్), ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి చాలా పరిమితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో సైబర్టవర్స్ నిర్మాణానికి అవసరానికి మించి ఖర్చు చేశారని, అంతకన్నా తక్కువ ఖర్చుతోనే ఇంకా ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోవచ్చునన్నారు. ఐటీ అభివృద్ధి పేరుతో సైబర్ టవర్స్ చుట్టుపక్కలా తక్కువ ధరలకు భూములు కొని, వాటితో రియల్ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనలో దాదాపు 25 వేల పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలు పోయాయని కోదండరాం చెప్పారు. తెలంగాణలో సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఎన్నో కుట్రలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు సీమాంధ్రలో సమ్మెను ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. డిసెంబరు 9 నాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణను అడ్డుకునేందుకు జగన్, కిరణ్, చంద్రబాబులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. ‘తెలంగాణపై తప్పుగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కు ఉన్న రాజకీయ అవగాహన ఎంత? కిరణ్ ఒక పిచ్చోడు. ఆయనొక పెద్ద ఫూల్. అందుకే సీమాంధ్ర మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజలను బేవకూఫ్‌లను చేస్తున్నడు. సీమాంధ్ర ప్రజలను ఉన్మాదులుగా చేస్తున్నడు’ అని పాల్వాయి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమం కేవలం అధికారంకోసం కులాల మధ్య జరుగుతున్న కొట్లాట మాత్రమేనని పాల్వాయి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేతలు వివేక్, ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకమన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నీటి యుద్దాలు వస్తాయని అనడం కూడా సరికాదని, దీనికి అంతర్జాతీయ నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రౌతు కనకయ్య, గంధం రాములు పాల్గొనగా ఐటీ ఉద్యోగుల జేఏసీ నేత వెంకట్ అధ్యక్షత వహించారు. -
పేచీ పెడితే ఊరుకోం : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరే ప్రతిపాదననూ అంగీకరించేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై పేచీ పెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయడానికి ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలను తిప్పికొడతామన్నారు. ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే సకల జనభేరిలో తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా కదలాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సభకు మొదటిసారి అనుమతి వచ్చిందని, దీనికి భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో సహా రావాలని కోరారు. సభా ప్రాంగణానికి కాళోజీ ప్రాంగణం అని, వేదికకు ప్రొఫెసర్ జయశంకర్ వేదికగా పేరు పెట్టినట్టుగా వివరించారు. సభ కోసం ఏర్పాటైన ద్వారాలకు టి.ఎస్.సదాలక్ష్మి ద్వారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారంగా నిర్ణయించినట్టుగా వివరించారు. విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ బోనస్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకల జనభేరికి కేసీఆర్, కిషన్‌రెడ్డి, న్యూ డెమోక్రసీ, సీపీఐ అగ్రనేతలు హాజరవుతారన్నారు. స్వేచ్ఛగా జరుపుకోనివ్వండి: దేవీప్రసాద్ తెలంగాణకోసం పోరాడుతున్న వారికి మర్యాదలేమీ చేయాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా సభ జరుపుకోనిస్తే చాలని జేఏసీ కో చైర్మన్ దేవీ ప్రసాద్ అన్నారు. ఈ సదస్సుకు ఉద్యోగులే 40 వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలది స్వచ్ఛంద, నిజాయతీ ఉద్యమం అని అన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి సి.విఠల్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ఇప్పటికే కొందరిని బైండోవర్ చేస్తున్నారని, వీటిని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమం తప్పకుండా విజయవంతం అవుతుందని జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ అన్నారు. మహిళలకు, వద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.రఘు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా భారీగా తరలి రావాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేత దానకర్ణాచారి కోరారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం చైర్మన్ మాదు సత్యం మాట్లాడుతూ... ప్రైవేటు ఉద్యోగులంతా సభకు రావాలన్నారు. ‘భేరీ’పై బీజేపీతో జేఏసీ చర్చలు తెలంగాణ ఏర్పాటు బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టాలన్న డిమాండ్‌తో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సకల జన భేరీ’ సదస్సుకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణజేఏసీ నేతలు శుక్రవారం బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సభ నిర్వహణ, ప్రస్తావించాల్సిన అంశాలు, జన సమీకరణ, ఢిల్లీ పరిణామాలపై చర్చించారు. కోదండరాం నేతృత్వంలో జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్‌లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఉద్యమ కమిటీ వైస్ చైర్మన్ అశోక్‌కుమార్‌యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌పై భిన్న వాదనలు, విభిన్న ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ సాగింది. వీటిని తోసిపుచ్చుతూ సకలజన భేరీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని విషయమై పార్టీలో చర్చించి చెబుతామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సకలజన భేరీకి తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని, మహబూబ్‌నగర్ జిల్లా తప్ప మిగతా అన్ని ప్రాంతాల నుంచి తమ కార్యకర్తలు హాజరవుతారని హామీ ఇచ్చారు. అశోక్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని చెప్పారు. -
నేడు సంగారెడ్డిలో టీజేఏసీ భారీ ర్యాలీ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరి విజయవంతానికి జిల్లా టీజేఏసీ, ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్ జిల్లాలో సన్నాహక కార్యక్రమాలపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా టీ జేఏసీ మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో భారీ ర్యాలీ, సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సన్నాహక సమావేశానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. టీ జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే మరో బృందం పాత బస్టాండు నుంచి జడ్పీ వరకు ర్యాలీ నిర్వహిస్తుంది. అనంతరం జడ్పీ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఉద్యోగసంఘాలు సైతం సకలజనుల భేరి విజయవంతంపై దృష్టి పెట్టాయి. ఈనెల 25వ తేదీన టీఎన్జీవో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలతో కలిపి సంగారెడ్డి, జహీరాబాద్‌లో ర్యాలీ, సభలు నిర్వహించనుంది. ఈ సభలకు టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవీప్రసాద్ హాజరుకానున్నారు. కాగా టీఆర్ఎస్ పార్టీ సైతం 29వ తేదీన నిర్వహించనున్న సకలజనుల భేరికి భారీగా జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా నుంచి 12వేల మందిని భేరికి తరలించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తెలిపారు. -
యూటీ అంటే అగ్గిబరాటాలే: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేస్తామంటే ఉద్యమకారులంతా అగ్గిబరాటాలవుతారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ పేరుతో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో, ప్రేమ పునాదుల మీద హైదరాబాద్ భాగ్యనగరమైందన్నారు. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ నుండి విడదీయాలనుకుంటే శరీరం నుండి తలను వేరు చేయాలనుకోవడమేనని వ్యాఖ్యానించారు. యూటీ అంటే అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. 1956లో విలీనం కావడానికి ముందున్నట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై ఎవరో అధికారం చెలాయిస్తామంటే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే పూర్తి అధికారం ఉండాలని చెప్పారు. 56 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో నగరం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. చెరువులను పూడ్చివేసి, బాగ్లను ఆక్రమించి బంగళాలు కట్టుకున్నారని అన్నారు. హుస్సేన్‌సాగర్ చెరువులో మట్టిపోసి సినిమా థియేటర్ కట్టడమే అభివృద్ధా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ఎవరింటికి దారి తీస్తాయో అందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో ప్రాగాటూల్స్, హెచ్ఎంటీ, డీబీఆర్ మిల్స్, నిజాం సుగర్స్ వంటి ఫ్యాక్టరీల్లో తెలంగాణ వారే ఉద్యోగులుగా ఉండేవారని, వీటిలో సీమాంధ్రులకు స్థానం లేకపోవడంతోనే సీమాంధ్ర పాలకులు మూసేయించారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఐదు జిల్లాల్లోని భూములను ఆక్రమించుకుని, వనరులను దక్కించుకున్నవారే అభివృద్ధి చేశామంటున్నారని ధ్వజమెత్తారు. ఎడ్ల బండి నీడలో నడిచే కుక్క బండిని మొత్తం లాగుతున్నట్టు భ్రమ పడ్డట్టుగానే హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాతబస్తీ కూడా బంజారాహిల్స్ స్థాయిలో అభివృద్ధి అవుతుందని ఆయన చెప్పారు. మరోసారి సీమాంధ్రుల కుట్ర సీడబ్ల్యూసీ, కేంద్రం ప్రకటించిన తెలంగాణను మరోసారి అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి కార్యాచరణను జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. హైదరాబాద్‌పై కిరికిరిని అడ్డుకోవడానికి ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదంతో ఈ నెల 30న నగరంలో నిర్వహించే సదస్సుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో పెట్టుకున్న సభతో తెలంగాణ గుండె రగిలిపోతోందని ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని, ఆయన పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ఉందని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి ఈ నెల 30న నగరంలో ‘స్వాభిమాన్’ మహాసభను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. సీమాంధ్రులు నిర్వహిస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు తెరిపించాలని, బస్సులు నడిచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో రసమయి బాలకిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీధర్, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు. -
అడ్డుకునే యత్నాలు తిప్పికొట్టాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అడ్డుకోవడంలో పార్టీలకతీతంగా సీమాంధ్ర ఎంపీలందరూ ఒక్కటయ్యారని, ఇదే సూత్రం తెలంగాణ ప్రాంత ఎంపీలకు ఎందుకు వర్తించదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న సద్భావన దీక్ష(శాంతి దీక్ష)ల్లో కోదండరాం శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు అధిష్టానాన్ని, పార్టీలను లెక్కచేయకుండా తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌పై పెత్తనంకోసం ఆయా పార్టీలన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. అధిష్టానం ఏం చెప్పినా శిరసావహిస్తానన్న ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కిరణ్‌పై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులపై ఉందన్నారు. ఇప్పటికైనా కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి.. సహాయ నిరాకరణ చేసి తెలంగాణకోసం గట్టిగా నిలబడాలని కోరారు. లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రజలు సహాయ నిరాకరణ చేస్తారని హెచ్చరించారు. అంజయ్య తరువాత తెలంగాణ నుంచి ఒక్క నాయకుడ్నీ సీఎం స్థాయికి ఎదగనీయలేదు.. తెలంగాణ భవిష్యత్తును ఈ ప్రాంత ప్రజలే నిర్ణయించుకుంటారని కోదండరాం చెప్పారు. తెలంగాణపై, హైదరాబాద్‌పై మరొకరు ఆధిపత్యం చలాయిస్తామంటే సహించేది లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఏ పార్టీలోనూ ప్రాతినిధ్యం.. నాయకత్వం లేదని, రాష్ట్రంలో సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, డీజీపీ, ప్రతిపక్ష నేత, ఇతర పార్టీల అధినేతలంతా సీమాంధ్రులేనని చెప్పారు. అంజయ్య తరువాత తెలంగాణ నుంచి ఒక్క నాయకుడ్ని కూడా సీఎం స్థాయికి ఎదగనీయలేదని ఆక్షేపించారు. ఈ స్థితికి సీమాంధ్ర సంపన్నవర్గాలు, ఆధిపత్య ధోరణి కారణమన్నారు. ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉంటే తెలంగాణ ప్రజల్ని బతకనీయరన్నారు. సీమాంధ్రలో పోలీసులేం చేస్తున్నారు? తెలంగాణలో శాంతియుత నిరసనలను సైతం అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వం సీమాంధ్రలో ఏం చేస్తున్నాయని కోదండరాం ప్రశ్నించా రు. ఇది రాష్ట్రప్రభుత్వ పక్షపాత ధోరణికి, నిరంకుశ తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వంలోని ఉన్నత స్థానాలన్నింటిలోనూ సీమాంధ్రులు ఉండడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీమాంధ్రకు నీళ్లు రావని, హైదరాబాద్‌లో ఉండనీయరని అంటూ జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రజలంతా నేతల కుట్రలను గమనించాలని కోరారు. ప్రజలమధ్య శాంతియుత వాతావరణంకోసం సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని అతి ప్రముఖమైన చార్మినార్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజలంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ఇదే స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల ద్వంద్వవైఖరి: హరీష్‌రావు తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ద్వంద్వ వైఖరితో ఇరుప్రాంతాల ప్రజలను మోసగిస్తున్నాయని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు దుయ్యబట్టారు. చంద్రబాబు కనుక తెలంగాణకు కట్టుబడి ఉంటే.. పార్లమెంటులో నాటకాలాడుతున్న తమ పార్టీ ఎంపీలను ఎందుకు వారించట్లేదని, మాట వినకుంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు సైతం దీనిపై చంద్రబాబును ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలను ఎందుకు ఆపడం లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎంపీల్ని సస్పెండ్ చేస్తుంటే వెంకయ్యనాయుడు ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీపై నమ్మకముండేదని, వెంకయ్యనాయుడు వైఖరి చూస్తుంటే ప్రస్తుతం ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు చెప్పులేయించిన హరికృష్ణకు ఇప్పుడు తండ్రిపై ప్రేమ పొంగుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ యూనియన్లు బలపడితే ఉద్యమం బలపడుతుందని, ఈ ప్రాంతప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని హరీష్‌రావు చెప్పారు. ఆర్టీసీలో టీఎంయూ గెలుపుతో ఉద్యమానికి బలం పెరిగిందన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి 2009లో సీమాంధ్ర పార్టీలన్నీ ఒక్కటైనాయని, ఇప్పుడూ చరిత్ర పునరావృతమవుతున్నదని, ఈ సమయంలో ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దీక్షలో జేఏసీ ముఖ్యనేతలు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, టీఎంయూ అధ్యక్షులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి పాల్గొన్నారు.