అడ్డుకుంటోంది రియల్‌ఎస్టేట్ గద్దలే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గద్దలే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల జేఏసీ సదస్సు శనివారం హైదరాబాద్‌లో జరిగింది. కోదండరాంతో పాటు రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి(కాంగ్రెస్), ఎంపీ జి.వివేక్, టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనాయకులు ఈటెల రాజేందర్, కె.విశ్వేశ్వర్ రెడ్డి(టీఆర్‌ఎస్), ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి చాలా పరిమితులు ఉన్నాయన్నారు.
హైదరాబాద్‌లో సైబర్‌టవర్స్ నిర్మాణానికి అవసరానికి మించి ఖర్చు చేశారని, అంతకన్నా తక్కువ ఖర్చుతోనే ఇంకా ఎక్కువ సౌకర్యాలను సమకూర్చుకోవచ్చునన్నారు. ఐటీ అభివృద్ధి పేరుతో సైబర్ టవర్స్ చుట్టుపక్కలా తక్కువ ధరలకు భూములు కొని, వాటితో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనలో దాదాపు 25 వేల పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలు పోయాయని కోదండరాం చెప్పారు. తెలంగాణలో సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఎన్నో కుట్రలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు సీమాంధ్రలో సమ్మెను ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. డిసెంబరు 9 నాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణను అడ్డుకునేందుకు జగన్, కిరణ్, చంద్రబాబులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. ‘తెలంగాణపై తప్పుగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కు ఉన్న రాజకీయ అవగాహన ఎంత? కిరణ్ ఒక పిచ్చోడు. ఆయనొక పెద్ద ఫూల్. అందుకే సీమాంధ్ర మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజలను బేవకూఫ్‌లను చేస్తున్నడు. సీమాంధ్ర ప్రజలను ఉన్మాదులుగా చేస్తున్నడు’ అని పాల్వాయి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమం కేవలం అధికారంకోసం కులాల మధ్య జరుగుతున్న కొట్లాట మాత్రమేనని పాల్వాయి అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ నేతలు వివేక్, ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకం, ధర్మ వ్యతిరేకమన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నీటి యుద్దాలు వస్తాయని అనడం కూడా సరికాదని, దీనికి అంతర్జాతీయ నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రౌతు కనకయ్య, గంధం రాములు పాల్గొనగా ఐటీ ఉద్యోగుల జేఏసీ నేత వెంకట్ అధ్యక్షత వహించారు.