యూటీ అంటే అగ్గిబరాటాలే: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేస్తామంటే ఉద్యమకారులంతా అగ్గిబరాటాలవుతారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ పేరుతో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో, ప్రేమ పునాదుల మీద హైదరాబాద్ భాగ్యనగరమైందన్నారు. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ నుండి విడదీయాలనుకుంటే శరీరం నుండి తలను వేరు చేయాలనుకోవడమేనని వ్యాఖ్యానించారు. యూటీ అంటే అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు.
1956లో విలీనం కావడానికి ముందున్నట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై ఎవరో అధికారం చెలాయిస్తామంటే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే పూర్తి అధికారం ఉండాలని చెప్పారు. 56 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో నగరం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. చెరువులను పూడ్చివేసి, బాగ్‌లను ఆక్రమించి బంగళాలు కట్టుకున్నారని అన్నారు. హుస్సేన్‌సాగర్ చెరువులో మట్టిపోసి సినిమా థియేటర్ కట్టడమే అభివృద్ధా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ఎవరింటికి దారి తీస్తాయో అందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో ప్రాగాటూల్స్, హెచ్‌ఎంటీ, డీబీఆర్ మిల్స్, నిజాం సుగర్స్ వంటి ఫ్యాక్టరీల్లో తెలంగాణ వారే ఉద్యోగులుగా ఉండేవారని, వీటిలో సీమాంధ్రులకు స్థానం లేకపోవడంతోనే సీమాంధ్ర పాలకులు మూసేయించారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఐదు జిల్లాల్లోని భూములను ఆక్రమించుకుని, వనరులను దక్కించుకున్నవారే అభివృద్ధి చేశామంటున్నారని ధ్వజమెత్తారు. ఎడ్ల బండి నీడలో నడిచే కుక్క బండిని మొత్తం లాగుతున్నట్టు భ్రమ పడ్డట్టుగానే హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాతబస్తీ కూడా బంజారాహిల్స్ స్థాయిలో అభివృద్ధి అవుతుందని ఆయన చెప్పారు.
మరోసారి సీమాంధ్రుల కుట్ర
సీడబ్ల్యూసీ, కేంద్రం ప్రకటించిన తెలంగాణను మరోసారి అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి కార్యాచరణను జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నారు. హైదరాబాద్‌పై కిరికిరిని అడ్డుకోవడానికి ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదంతో ఈ నెల 30న నగరంలో నిర్వహించే సదస్సుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో పెట్టుకున్న సభతో తెలంగాణ గుండె రగిలిపోతోందని ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని, ఆయన పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ఉందని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి ఈ నెల 30న నగరంలో ‘స్వాభిమాన్’ మహాసభను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. సీమాంధ్రులు నిర్వహిస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు తెరిపించాలని, బస్సులు నడిచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీధర్, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు.