- 40 శాతానికే పరిమితమైన వరి నాట్లు
- 9 శాతం అధిక వర్షపాతం నమోదు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు 82 శాతానికి చేరింది. సాధారణంగా ఖరీఫ్‌లో 48.11 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల సాగు కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 39.54 లక్షల ఎకరాల్లో సాగైనట్లు తెలంగాణ వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయితే అందులో భాగంగా వరి సాగు సాధారణంగా 24.35 లక్షల ఎకరాల్లో కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 9.85 లక్షల ఎకరాల్లోనే (40%) నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాగు 14.64 లక్షల ఎకరాల్లో జరిగింది. మొక్కజొన్న సాగు సాధారణం కంటే 112 శాతం అధికంగా 13.60 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఆహారధాన్యాలు, నూనెగింజలు సహా అన్ని రకాల పంటల సాగు 76 శాతం జరిగింది. పత్తి 70 శాతం, సోయాబీన్ 147 శాతం సాగయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 92 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 89 శాతం సాగయ్యాయి. ఖమ్మం జిల్లాలో మాత్రం అత్యంత తక్కువగా 56 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగైనట్లు నివేదిక తెలిపింది. 9 శాతం అధిక వర్షపాతం... రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదైంది. జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు 432.1 ఎం.ఎం.లు నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 471.9 ఎం.ఎం.లు రికార్డు అయింది. ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.