Union Territory status to Hyderabad
-
యూటీ అంటే అగ్గిబరాటాలే: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేస్తామంటే ఉద్యమకారులంతా అగ్గిబరాటాలవుతారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ పేరుతో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో, ప్రేమ పునాదుల మీద హైదరాబాద్ భాగ్యనగరమైందన్నారు. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ నుండి విడదీయాలనుకుంటే శరీరం నుండి తలను వేరు చేయాలనుకోవడమేనని వ్యాఖ్యానించారు. యూటీ అంటే అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. 1956లో విలీనం కావడానికి ముందున్నట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై ఎవరో అధికారం చెలాయిస్తామంటే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే పూర్తి అధికారం ఉండాలని చెప్పారు. 56 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో నగరం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. చెరువులను పూడ్చివేసి, బాగ్లను ఆక్రమించి బంగళాలు కట్టుకున్నారని అన్నారు. హుస్సేన్‌సాగర్ చెరువులో మట్టిపోసి సినిమా థియేటర్ కట్టడమే అభివృద్ధా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ఎవరింటికి దారి తీస్తాయో అందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో ప్రాగాటూల్స్, హెచ్ఎంటీ, డీబీఆర్ మిల్స్, నిజాం సుగర్స్ వంటి ఫ్యాక్టరీల్లో తెలంగాణ వారే ఉద్యోగులుగా ఉండేవారని, వీటిలో సీమాంధ్రులకు స్థానం లేకపోవడంతోనే సీమాంధ్ర పాలకులు మూసేయించారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఐదు జిల్లాల్లోని భూములను ఆక్రమించుకుని, వనరులను దక్కించుకున్నవారే అభివృద్ధి చేశామంటున్నారని ధ్వజమెత్తారు. ఎడ్ల బండి నీడలో నడిచే కుక్క బండిని మొత్తం లాగుతున్నట్టు భ్రమ పడ్డట్టుగానే హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాతబస్తీ కూడా బంజారాహిల్స్ స్థాయిలో అభివృద్ధి అవుతుందని ఆయన చెప్పారు. మరోసారి సీమాంధ్రుల కుట్ర సీడబ్ల్యూసీ, కేంద్రం ప్రకటించిన తెలంగాణను మరోసారి అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి కార్యాచరణను జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. హైదరాబాద్‌పై కిరికిరిని అడ్డుకోవడానికి ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదంతో ఈ నెల 30న నగరంలో నిర్వహించే సదస్సుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో పెట్టుకున్న సభతో తెలంగాణ గుండె రగిలిపోతోందని ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని, ఆయన పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ఉందని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి ఈ నెల 30న నగరంలో ‘స్వాభిమాన్’ మహాసభను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. సీమాంధ్రులు నిర్వహిస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు తెరిపించాలని, బస్సులు నడిచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో రసమయి బాలకిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీధర్, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు. -
యూటీ అనటం సరికాదు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించిన కేంద్రం హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనను పరిగ ణలోకి తీసుకోవటం సరికాదని లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో లోక్‌సత్తా కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన తర్వాత తలెత్తే సమస్యలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కొంతమంది ప్రజాస్వామ్యం, చట్టసభల మీద నమ్మకం లేకనే రోడ్లుపైకి వస్తున్నట్లు చెప్పారు. విభజన ప్రక్రియకు సంబంధించి సమస్యలను నివేదించేందుకు కేంద్రం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నేరస్తులుగా శిక్షపడిన వారు చట్టసభలకు పోటీచేసేందుకు అనర్హులంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8 (4) విభాగాన్ని కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు తిరుగులేనిదని తెలిపారు. రాజకీయపార్టీలు సేకరించే వివరాళాలు చట్టబద్దంగా సేకరించాలని ఎన్నికల కమిషన్ పార్టీలకు లేఖ రాయటం శుభపరిణామంగా పేర్కొన్నారు. దేశంలో ఒక పార్టీకి వచ్చే విరాళాలు, ఆదాయవ్యయం వివవరాలను ఆన్లైన్లో ఉంచిన ఏకైక పార్టీ లోక్‌సత్తా అని తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో లోక్‌సత్తా నియోజకవర్గ ఇన్చార్జ్ మాధవరెడ్డి, యువసత్తా జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీధర్, నాయకులు నిజాముద్దీన్, సాయికుమార్, అఫ్రోజు, సదాశివపేట పట్టణ నాయకులు సాయిరాజ్, నరేష్, నర్సింలు, నారాయణ, వెంకట్, నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు. -
యూటీకి ఒప్పుకోం: కోదండరాం
కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) అనేది బ్రిటిష్ కాలం నాటి భావన అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బ్రిటన్ కేంద్రంగా పాలనను కొనసాగించేందుకు, దేశంలోని సొత్తును దోచుకొనేందుకే ఆ విధానాన్ని అమలుపరిచారని చెప్పారు. సాంస్కృతికంగా, భౌగోళికంగా కలవని ప్రాంతాన్ని యూటీగా చేస్తా రని.. హైదరాబాద్ అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి దానిని అంగీకరించే ప్రసక్తే లేదని కోదండరామ్ తేల్చిచెప్పారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న ‘శాంతి సద్భావన దీక్ష’ మంగళవారంతో రెండో రోజుకు చేరుకుంది. రెండోరోజు దీక్షలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కూర్చున్నారు. ఆ దీక్షకు హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి యూటీ భావనను ఇప్పుడు కొందరు డిమాండ్ చేస్తున్నారని.. పూర్తిగా నష్టదాయకమైనది కాబట్టే ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నామని చెప్పారు. భిన్న సంస్కృతులు ఉన్నందున రాయల తెలంగాణ కూడా సరికాదన్నారు. ప్రజల రక్షణ అనేది కాగితాల్లో ఉండాలని ఏమీ లేదని, ప్రజలు సఖ్యతతో ఉంటే చాలని కోదండరాం వ్యాఖ్యానించారు. కాగా.. ఉద్యమాలు, అమరుల త్యాగాల వల్లే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గ్లోబల్ విలేజ్ నినాదంతో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చని.. కానీ, చక్రం తిప్పాలని కోరుకోవద్దని అన్నారు. సీమాంధ్ర పార్టీల పాలనలో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు. బెంగళూరు, న్యూజెర్సీల్లో సీమాంధ్రులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయమని కోరుతారా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు లాంటి వారే అభివృద్ధి చెందారని జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు అండగా నిలుస్తున్నారని జేఏసీ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. ఏపీఎన్జీవోల ఉద్యమం విజయవంతమైందంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినవారు వెళ్లిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ, ప్రజలను రెచ్చగొట్టడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. కాగా.. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలంగాణ సెటిలర్ల ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అనంతరం ఆమె అక్కడ ఉన్న నాయకులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భిక్షపతి, నేతలు కేవీ రమణాచారి, డాక్టర్ నర్సయ్య, న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ సంధ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత జంగయ్య, టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.