యూటీకి ఒప్పుకోం: కోదండరాం
కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) అనేది బ్రిటిష్ కాలం నాటి భావన అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బ్రిటన్ కేంద్రంగా పాలనను కొనసాగించేందుకు, దేశంలోని సొత్తును దోచుకొనేందుకే ఆ విధానాన్ని అమలుపరిచారని చెప్పారు. సాంస్కృతికంగా, భౌగోళికంగా కలవని ప్రాంతాన్ని యూటీగా చేస్తా రని.. హైదరాబాద్ అలాంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి దానిని అంగీకరించే ప్రసక్తే లేదని కోదండరామ్ తేల్చిచెప్పారు.
తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న ‘శాంతి సద్భావన దీక్ష’ మంగళవారంతో రెండో రోజుకు చేరుకుంది. రెండోరోజు దీక్షలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు కూర్చున్నారు. ఆ దీక్షకు హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి యూటీ భావనను ఇప్పుడు కొందరు డిమాండ్ చేస్తున్నారని.. పూర్తిగా నష్టదాయకమైనది కాబట్టే ఆ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నామని చెప్పారు. భిన్న సంస్కృతులు ఉన్నందున రాయల తెలంగాణ కూడా సరికాదన్నారు. ప్రజల రక్షణ అనేది కాగితాల్లో ఉండాలని ఏమీ లేదని, ప్రజలు సఖ్యతతో ఉంటే చాలని కోదండరాం వ్యాఖ్యానించారు.
కాగా.. ఉద్యమాలు, అమరుల త్యాగాల వల్లే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గ్లోబల్ విలేజ్ నినాదంతో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చని.. కానీ, చక్రం తిప్పాలని కోరుకోవద్దని అన్నారు. సీమాంధ్ర పార్టీల పాలనలో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు. బెంగళూరు, న్యూజెర్సీల్లో సీమాంధ్రులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయమని కోరుతారా? అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రశ్నించారు.
హైదరాబాద్ అభివృద్ధి వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు లాంటి వారే అభివృద్ధి చెందారని జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు అండగా నిలుస్తున్నారని జేఏసీ నేత దేవీప్రసాద్ ఆరోపించారు. ఏపీఎన్జీవోల ఉద్యమం విజయవంతమైందంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినవారు వెళ్లిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తూ, ప్రజలను రెచ్చగొట్టడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు.
కాగా.. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలంగాణ సెటిలర్ల ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అనంతరం ఆమె అక్కడ ఉన్న నాయకులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భిక్షపతి, నేతలు కేవీ రమణాచారి, డాక్టర్ నర్సయ్య, న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ సంధ్య, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత జంగయ్య, టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.