వాచ్‌డాగ్‌గానే టీ జేఏసీ
రాజకీయ పార్టీగా మారకూడదని స్టీరింగ్ కమిటీ నిర్ణయం
తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి
జేఏసీ సభ్యులు ఎవరైనా వ్యక్తులుగా ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు
ఏం సంక్షోభం నెలకొందని రాష్ట్రపతి పాలన విధించారు?: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం సాకారమైన నేపథ్యంలో రాజకీయ పార్టీగా మారకూడదని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినట్టుగానే తెలంగాణ పునర్నిర్మాణంలోనూ వాచ్‌డాగ్‌లా ఉండాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు. సమావేశం అనంతరం జేఏసీ నిర్ణయాలను కోదండరాం మీడియాకు వివరించారు. జేఏసీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదని, అయితే రాజకీయ పార్టీగా మారదని ప్రకటించారు. జేఏసీలోని నేతలు ఎవరైనా వ్యక్తులుగా ఇతర పార్టీల్లోకి పోవచ్చునని, ఉద్యమాల్లో పాల్గొన్న వారికి పార్టీల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. నాయకులుగా ఎవరు పోయినా జేఏసీ కొనసాగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు పార్టీలన్నీ సహకరించాయని, ఆ పార్టీలన్నిటికీ క్రెడిట్ దక్కుతుందని చెప్పారు.
టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీలు ఉద్యమానికి సమరశీలత, నైతికత తీసుకువస్తే, కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణత చేకూర్చిందని తెలిపారు. సమైక్య పార్టీలకు తప్ప మిగిలిన వాటికి తెలంగాణలో సానుకూలత ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల విజయమన్నారు. జేఏసీ ఏ రాజకీయపార్టీకి మద్దతివ్వాలనే విషయంపై చర్చ జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు, తరువాత రాజకీయ అంశాలు, జేఏసీ నిర్వహించాల్సిన పాత్ర వంటి పలు అంశాలపై 5న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరంలేదని, వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం సంక్షోభం వచ్చిందని రాష్ట్రపతి పాలన పెట్టారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
జేఏసీ కో కన్వీనర్ దేవీప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి తెలంగాణలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరో కోకన్వీనర్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందుగానే కొందరికి ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇచ్చి స్టేట్ కేడరుగా మార్చారని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో సీమాంధ్రకు సచివాలయం ఇవ్వొద్దని, మరేదైనా ప్రాంతంలో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, నాయకులు సి.విఠల్, అద్దంకి దయాకర్, రసమయి, రఘు, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రే ఎక్కువ
తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ది అయినా, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఎక్కువగా ఉందని జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణకు సహకరించిన అన్ని పార్టీలకు సమదూరంలో ఉండాలని నిర్ణయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని మాత్రమే పిలుపునివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జేఏసీగా బరిలో ఉండకూడదని సమావేశం తీర్మానించింది. అయితే వ్యక్తులుగా ఎవరైనా, ఏ పార్టీలోనైనా ప్రయత్నించొచ్చని వెల్లడించింది.
అంతర్గత విషయాలు లీక్ చేస్తే బహిష్కరణ
జేఏసీ స్టీరింగ్ కమిటీలో అంతర్గతంగా చర్చించిన అన్ని అంశాలు మీడియాకు తెలుస్తున్నాయని, వాటిని బయటకు వెల్లడిస్తున్న వారిని గుర్తించి స్టీరింగ్ కమిటీ నుండి బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.