పేచీ పెడితే ఊరుకోం : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరే ప్రతిపాదననూ అంగీకరించేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌పై పేచీ పెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయడానికి ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆ కుట్రలను తిప్పికొడతామన్నారు. ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే సకల జనభేరిలో తెలంగాణ ప్రజలంతా సంఘటితంగా కదలాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సభకు మొదటిసారి అనుమతి వచ్చిందని, దీనికి భారీ సంఖ్యలో కుటుంబ సభ్యులతో సహా రావాలని కోరారు. సభా ప్రాంగణానికి కాళోజీ ప్రాంగణం అని, వేదికకు ప్రొఫెసర్ జయశంకర్ వేదికగా పేరు పెట్టినట్టుగా వివరించారు. సభ కోసం ఏర్పాటైన ద్వారాలకు టి.ఎస్.సదాలక్ష్మి ద్వారం, కొండా లక్ష్మణ్ బాపూజీ ద్వారంగా నిర్ణయించినట్టుగా వివరించారు. విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ బోనస్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకల జనభేరికి కేసీఆర్, కిషన్‌రెడ్డి, న్యూ డెమోక్రసీ, సీపీఐ అగ్రనేతలు హాజరవుతారన్నారు.
స్వేచ్ఛగా జరుపుకోనివ్వండి: దేవీప్రసాద్
తెలంగాణకోసం పోరాడుతున్న వారికి మర్యాదలేమీ చేయాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా సభ జరుపుకోనిస్తే చాలని జేఏసీ కో చైర్మన్ దేవీ ప్రసాద్ అన్నారు. ఈ సదస్సుకు ఉద్యోగులే 40 వేల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలది స్వచ్ఛంద, నిజాయతీ ఉద్యమం అని అన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి సి.విఠల్ మాట్లాడుతూ.. జిల్లాల్లో ఇప్పటికే కొందరిని బైండోవర్ చేస్తున్నారని, వీటిని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమం తప్పకుండా విజయవంతం అవుతుందని జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ అన్నారు. మహిళలకు, వద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.రఘు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా భారీగా తరలి రావాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేత దానకర్ణాచారి కోరారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం చైర్మన్ మాదు సత్యం మాట్లాడుతూ... ప్రైవేటు ఉద్యోగులంతా సభకు రావాలన్నారు.
‘భేరీ’పై బీజేపీతో జేఏసీ చర్చలు
తెలంగాణ ఏర్పాటు బిల్లును తక్షణమే పార్లమెంట్‌లో పెట్టాలన్న డిమాండ్‌తో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సకల జన భేరీ’ సదస్సుకు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణజేఏసీ నేతలు శుక్రవారం బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సభ నిర్వహణ, ప్రస్తావించాల్సిన అంశాలు, జన సమీకరణ, ఢిల్లీ పరిణామాలపై చర్చించారు. కోదండరాం నేతృత్వంలో జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్‌లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఉద్యమ కమిటీ వైస్ చైర్మన్ అశోక్‌కుమార్‌యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌పై భిన్న వాదనలు, విభిన్న ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ సాగింది. వీటిని తోసిపుచ్చుతూ సకలజన భేరీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని విషయమై పార్టీలో చర్చించి చెబుతామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సకలజన భేరీకి తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని, మహబూబ్‌నగర్ జిల్లా తప్ప మిగతా అన్ని ప్రాంతాల నుంచి తమ కార్యకర్తలు హాజరవుతారని హామీ ఇచ్చారు. అశోక్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని చెప్పారు.