అడ్డుకునే యత్నాలు తిప్పికొట్టాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను అడ్డుకోవడంలో పార్టీలకతీతంగా సీమాంధ్ర ఎంపీలందరూ ఒక్కటయ్యారని, ఇదే సూత్రం తెలంగాణ ప్రాంత ఎంపీలకు ఎందుకు వర్తించదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న సద్భావన దీక్ష(శాంతి దీక్ష)ల్లో కోదండరాం శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు అధిష్టానాన్ని, పార్టీలను లెక్కచేయకుండా తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తెలంగాణను అడ్డుకోవడానికి, హైదరాబాద్‌పై పెత్తనంకోసం ఆయా పార్టీలన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. అధిష్టానం ఏం చెప్పినా శిరసావహిస్తానన్న ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కిరణ్‌పై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రులపై ఉందన్నారు. ఇప్పటికైనా కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి.. సహాయ నిరాకరణ చేసి తెలంగాణకోసం గట్టిగా నిలబడాలని కోరారు. లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రజలు సహాయ నిరాకరణ చేస్తారని హెచ్చరించారు.
అంజయ్య తరువాత తెలంగాణ నుంచి ఒక్క నాయకుడ్నీ సీఎం స్థాయికి ఎదగనీయలేదు..
తెలంగాణ భవిష్యత్తును ఈ ప్రాంత ప్రజలే నిర్ణయించుకుంటారని కోదండరాం చెప్పారు. తెలంగాణపై, హైదరాబాద్‌పై మరొకరు ఆధిపత్యం చలాయిస్తామంటే సహించేది లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఏ పార్టీలోనూ ప్రాతినిధ్యం.. నాయకత్వం లేదని, రాష్ట్రంలో సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, డీజీపీ, ప్రతిపక్ష నేత, ఇతర పార్టీల అధినేతలంతా సీమాంధ్రులేనని చెప్పారు. అంజయ్య తరువాత తెలంగాణ నుంచి ఒక్క నాయకుడ్ని కూడా సీఎం స్థాయికి ఎదగనీయలేదని ఆక్షేపించారు. ఈ స్థితికి సీమాంధ్ర సంపన్నవర్గాలు, ఆధిపత్య ధోరణి కారణమన్నారు. ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉంటే తెలంగాణ ప్రజల్ని బతకనీయరన్నారు.
సీమాంధ్రలో పోలీసులేం చేస్తున్నారు?
తెలంగాణలో శాంతియుత నిరసనలను సైతం అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వం సీమాంధ్రలో ఏం చేస్తున్నాయని కోదండరాం ప్రశ్నించా రు. ఇది రాష్ట్రప్రభుత్వ పక్షపాత ధోరణికి, నిరంకుశ తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వంలోని ఉన్నత స్థానాలన్నింటిలోనూ సీమాంధ్రులు ఉండడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీమాంధ్రకు నీళ్లు రావని, హైదరాబాద్‌లో ఉండనీయరని అంటూ జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రజలంతా నేతల కుట్రలను గమనించాలని కోరారు. ప్రజలమధ్య శాంతియుత వాతావరణంకోసం సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని అతి ప్రముఖమైన చార్మినార్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజలంతా పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ఇదే స్ఫూర్తితో శాంతియుతంగా పోరాడాలని కోరారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల ద్వంద్వవైఖరి: హరీష్‌రావు
తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ద్వంద్వ వైఖరితో ఇరుప్రాంతాల ప్రజలను మోసగిస్తున్నాయని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు దుయ్యబట్టారు. చంద్రబాబు కనుక తెలంగాణకు కట్టుబడి ఉంటే.. పార్లమెంటులో నాటకాలాడుతున్న తమ పార్టీ ఎంపీలను ఎందుకు వారించట్లేదని, మాట వినకుంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు సైతం దీనిపై చంద్రబాబును ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలను ఎందుకు ఆపడం లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎంపీల్ని సస్పెండ్ చేస్తుంటే వెంకయ్యనాయుడు ఎందుకు అడ్డుపడ్డారో చెప్పాలన్నారు.
తెలంగాణ విషయంలో బీజేపీపై నమ్మకముండేదని, వెంకయ్యనాయుడు వైఖరి చూస్తుంటే ప్రస్తుతం ఇక్కడి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు చెప్పులేయించిన హరికృష్ణకు ఇప్పుడు తండ్రిపై ప్రేమ పొంగుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ యూనియన్లు బలపడితే ఉద్యమం బలపడుతుందని, ఈ ప్రాంతప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని హరీష్‌రావు చెప్పారు. ఆర్టీసీలో టీఎంయూ గెలుపుతో ఉద్యమానికి బలం పెరిగిందన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి 2009లో సీమాంధ్ర పార్టీలన్నీ ఒక్కటైనాయని, ఇప్పుడూ చరిత్ర పునరావృతమవుతున్నదని, ఈ సమయంలో ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దీక్షలో జేఏసీ ముఖ్యనేతలు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, టీఎంయూ అధ్యక్షులు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి పాల్గొన్నారు.