సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికహరిబాబు ఎన్నికయ్యే అవకాశం
సీమాంధ్రలో బీజేపీపై పడిన ‘నమ్మకద్రోహం’ ముద్రను వదిలించుకోవడంపై దృష్టి
సాక్షి, నెల్లూరు: తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందడంలో అధికార పక్షానికి మద్దతు పలికి.. సీమాంధ్రుల దృష్టిలో నమ్మకద్రోహం ముద్ర వేయించుకున్న బీజేపీ ఆ ముద్రను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 26న విజయవాడ కేంద్రంగా సీమాంధ్ర బీజేపీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 13 జిల్లాలకు చెందిన పార్టీ జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. సమావేశానికి పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు హాజ రుకానున్నారు. ఈ సమావేశంలోనే సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్యే హరిబాబు ఈ పదవికి ఎన్నిక కానున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియలో బీజేపీ పోషించిన పాత్ర, ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే అంశాలపై ఇదే సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో పార్టీ ఉనికి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మోడీ ప్రచారం తదితర అంశాలపై పార్టీ నిర్ణయానికి రానుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల సమస్యలు, వాటి పరిష్కారాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది.
బురదను వదిలించుకునే ప్రయత్నమా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర ఉందని ఆ ప్రాంత వాసుల్ని నమ్మించగలిగిన బీజేపీ.. సీమాంధ్ర ప్రజల దృష్టిలో దోషిగా నిలిచింది. దీన్నుంచి బయటపడేందుకు కమలనాథులు తలమునకలవుతున్నారు. పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ ప్రభంజనాన్ని వినియోగించుకుని సీమాంధ్రలో సీట్లు సాధించాలనుకున్న ఇక్కడి నేతలకు విభజన ప్రక్రియలో పార్టీ జాతీయ నేతలు వ్యవహరించిన తీరు తీవ్ర నిరాశను కలిగించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజా సమావేశంలో సీరియస్‌గా చర్చ జరగనున్నట్టు సమాచారం. కాగా స్పష్టమైన వ్యూహంతో సీమాంధ్ర ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే దిశగా పటిష్టమైన నిర్ణయాలు తీసుకునేలా ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని సీమాంధ్రకు చెందిన బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
26న విజయవాడలో బీజేపీ సీమాంధ్ర సమావేశం
Published Mon, Feb 24 2014 1:22 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM
Advertisement