నేడే లోక్‌సభలో తెలంగాణ బిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభకు.. ఎంపీలకు ప్రతులు
బీజేపీ నేతలతో ప్రధాని విందు మంతనాలు.. టీ బిల్లుపై సహకారానికి వినతి
మద్దతిస్తామన్న బీజేపీ.. సీమాంధ్ర ప్యాకేజీ, రాజధాని అంశం తేల్చాలని షరతు
మూజువాణి ఓటుకు ఒప్పుకోబోమని.. బిల్లుపై చర్చ జరగాల్సిందేనని స్పష్టీకరణ
బీజేపీ నోట్‌పై కేంద్ర కేబినెట్ చర్చ.. పలు సవరణలపై సూత్రప్రాయ నిర్ణయం
పోలవరం ముంపు గ్రామాలను మాత్రమే సీమాంధ్రలో చేర్చేలా మార్పు
కేబినెట్ భేటీలో కావూరి, పల్ల్లంరాజు నిరసన .. బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎంపీల వ్యూహం.. ‘బిల్లు’కు రక్షణగా నిలవాలని టీ సభ్యుల నిర్ణయం
సీమాంధ్ర ఎంపీలు అడ్డుకుంటే వారి సస్పెన్షన్‌కు తీర్మానం ఇవ్వనున్న కేంద్రం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే రోజు రానేవచ్చింది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రానుంది. ఇందుకోసం కేంద్రం రంగం సిద్ధం చేసింది. లోక్‌సభలో జీరో అవర్ పూర్తయిన తరువాత బిల్లును సభ ముందుంచనుంది. బిల్లు ప్రతులను బుధవారమే ఎంపీలకు అందజేసింది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు లోక్‌సభ ఎజెండాలో మాత్రం ఈ అంశాన్ని పొందుపరచలేదు.
గురువారం ఉదయం జరిగే బీఏసీ ఎజెండాలో విభజన బిల్లును చేర్చి సభ ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలి సింది. విభజన బిల్లును సభ ముందుకు తెచ్చేవరకూ ఈ విషయంపై సస్పెన్స్‌ను కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభలో బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టిస్తే అవసరమైతే వారి సస్పెన్షన్‌కు తీర్మానాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించింది. సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు బిల్లుపై అనుసరించాల్సిన వైఖరిపై వ్యూహప్రతివ్యూహాల రచనలో మునిగిపోయారు. బిల్లును అడ్డుకుని తీరతామని ఒకవైపు వారు చెప్తుంటే.. బిల్లుకు రక్షణగా నిలబడతామని ఇంకొకవైపు వారు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు.. బిల్లులో ఇరు ప్రాంతాలకూ న్యాయం జరిగేలా సవరణలు చేపట్టాలని, సభలు సజావుగా సాగితేనే తమ మద్దతు ఇవ్వగలమని కేంద్రానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ స్పష్టంచేసింది. ఈ సవరణలపై కేంద్ర మంత్రివర్గం బుధవారం సాయంత్రం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నేపధ్యంలో.. గురువారం లోక్‌సభలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే దానిపై అటు రాజకీయ నాయకులు, పరిశీలకులతో పాటు ప్రజలందరిలోనూ తీవ్ర ఉత్కంఠ రేగుతోంది.
ప్యాకేజీ, రాజధానిపై స్పష్టత ఇవ్వాలి: బీజేపీ
రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ బీజేపీ అగ్రనేతలను కోరారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో విందు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి అనుకూలమనేద తమ వైఖరి అని.. అందులో ఏమాత్రం తేడా లేదనిని.. అయితే సీమాంధ్ర సమస్యలను కూడా పరిష్కరించాల్సిందేనని కమలనాథులు స్పష్టంచేశారు. ఈ మేరకు పలు సవరణలతో నోట్‌ను ప్రధానమంత్రికి అందజేశారు. సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ, కొత్త రాజధాని నిర్మాణం, హైకోర్టు ఏర్పాటు వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలని వారు సూచించినట్లు తెలిసింది. అదే సమయంలో పార్లమెంటులో విభజన బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు తేల్చిచెప్పినట్లు తెలిసింది. సభలో ఖచ్చితంగా బిల్లుపై చర్చ జరగాల్సిందేనని, తాము సూచించిన ప్రతిపాదనలను వాటిలో పొందుపర్చాల్సిందేనని స్పష్టం చేశారు.
ముంపు గ్రామాలు మాత్రమే సీమాంధ్రకు..!
బీజేపీ చేసిన ప్రతిపాదనలు, సూచించిన సవరణలపై.. ప్రధాని నివాసంలోనే బుధవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమై చర్చించింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణ అంశం, బీజేపీ ప్రతిపాదనలపై కొద్ది నిమిషాలపాటే చర్చ జరిగినట్లు తెలిసింది. బీజేపీ సూచించిన సవరణల్లో న్యాయపరంగా ఇబ్బందుల్లేని వాటిని చేర్చాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందులో ఏయే అంశాలు ఉన్నాయనేది తక్షణమే తెలియరాలేదు. ఇక విభజన బిల్లులో ఉన్న లోపాలపై మరోసారి చర్చించారు. మండలాలు యూనిట్‌గా పోలవరం ముంపు గ్రామాలన్నింటినీ సీమాంధ్ర ప్రాంతంలో కలపాలని గతంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని ఉన్నతాధికారులు కేబినెట్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రజలకు భద్రాచలం వెళ్లటానికి మార్గాలు (దారులు) మూసుకుపోతాయని.. దీనిపై తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదముందని, భావోద్వేగాలు ఉధృతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో.. మండలం యూనిట్‌గా కాకుండా గ్రామం యూనిట్‌గా తీసుకుంటూ 134 ముంపు గ్రామాలను మాత్రమే పోలవరంతో పాటు సీమాంధ్రలో కలపటం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని ప్రతిపాదించారు. అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
‘డిప్యూటీ’లే తెలంగాణ ఉభయ సభాధిపతులు!
రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగితే ప్రస్తుతమున్న శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌లు.. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) శాసనమండలి, శాసనసభలకు చైర్మన్, స్పీకర్‌గా కొనసాగుతారని గతంలో రూపొందించిన విభజన బిల్లులో పొందుపర్చినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం విషయాన్ని మాత్రం విస్మరించారు. కొందరు మంత్రులు ఈ అంశాన్ని లేవనెత్తటంతో.. ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ (ప్రస్తుతం మల్లు భట్టివిక్రమార్క) తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ (ప్రస్తుతం నేతి విద్యాసాగర్) తెలంగాణ శాసనమండలికి చైర్మన్‌గా కొనసాగేలా బిల్లులో సవరణ తీసుకొచ్చారు. సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త సభలు ఏర్పడేవరకు వారే కొనసాగుతారని అందులో పేర్కొన్నారు.
కేబినెట్‌లో కావూరి, పళ్లంరాజుల నిరసన...
కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు విభజన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రధానంగా కావూరి ఈ విషయంలో తన అభ్యంతరాలను నమోదు చేయాలని కోరుతూ ‘డిసెంట్ నోట్’ను ప్రధానికి అందజేసినట్లు తెలిసింది. విభజన బిల్లును శాసనసభ తిరస్కరించినప్పటికీ పట్టించుకోలేదని.. తప్పుల తడకగా ఉన్న బిల్లు ఆమోదంలో తాను దోషిని కాలేనని పేర్కొంటూ డిసెంట్‌ను అందజేసినట్లు కావూరి ఆ తర్వాత మీడియాకు తెలిపారు.
తీవ్ర ఆందోళన... అవిశ్వాసం నోటీసు!
సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల వ్యూహం
కేంద్ర మంత్రివర్గం భేటీ అనంతరం కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశమయ్యారు. గురువారం లోక్‌సభకు బిల్లు రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోసారి లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేయాలని నిర్ణయించారు. ఈసారి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ద్వారా నోటీస్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటు సోమవారం సభలో చర్చకు వచ్చే సమయానికి 55 మంది సభ్యుల మద్దతుతో సంతకాలను సేకరించాలని నిర్ణయించారు. అదే సమయంలో గురువారం సభలో బిల్లు రాకుండా అడ్డుకోవాలని, అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాలని యోచిస్తున్నారు. పురందేశ్వరి సహా కొందరు మంత్రులు రాజీనామా చే స్తామని ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సబ్బంహరి అయితే ఏకంగా విభజన బిల్లును ప్రవేశపెడితే సభలోనే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అయితే కావూరి నివాసంలో సమావేశానంతరం నేతలు మాట్లాడుతూ రాజీనామాలపై సమష్టి నిర్ణయాలుంటాయని పేర్కొన్నారు.
‘బిల్లు’కు రక్షణగా.. అడ్డుకునే వారికి అడ్డుగోడగా...
తెలంగాణ మంత్రులు, ఎంపీల ప్రతివ్యూహం
రాష్ట్ర విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు నిర్ణయించటంతో అందుకు ప్రతి వ్యూహాన్ని రూపొందించే పనిలో తెలంగాణ కేంద్రమంత్రులు, ఎంపీలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా బుధవారం ఉదయం సభలో రైల్వేమంత్రికి అండగా నిలబడినట్లుగానే గురువారం విభజన బిల్లును ప్రవేశపెట్టే కేంద్రమంత్రి చుట్టూ రక్షణ కవచంగా నిలవాలని నిర్ణయించారు. ఆయనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించేందుకు, బిల్లులను చింపేందుకు వచ్చే సీమాంధ్ర సభ్యులను నిలువరించేందుకు అవసరమైతే భౌతిక దాడి చేసేందుకూ వెనుకాడకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. అంజన్‌కుమార్‌యాదవ్, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య తదిరులు.. బిల్లును ప్రవేశపెట్టే మంత్రికి రక్షణగా నిలబడేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు.