'కొత్త రాజధానిని ప్రకటించండి'
న్యూఢిల్లీ : సీమాంధ్రకు తక్షణమే కొత్త రాజధానిని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం బీజేపీ అగ్రనాయకత్వానికి విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందులో అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, ఏకే ఆంటోనీ, కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు. ప్రధాని ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరారు.
అయితే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని అయితే సీమాంధ్రలో సమస్యల పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి బీజేపీ ఈ సందర్భంగా 32 సవరణలు చేసింది. భారీ ప్యాకేజీ ప్రకటించటంతో పాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సూచించింది. అలాగే పెద్ద పట్టణాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వాలని పేర్కొంది. అంతే కాకుండా తెలంగాణ బిల్లుపై బీజేపీ పట్టుబడుతోంది. కాగా తెలంగాణ సమస్యను ఇప్పుడు పరిష్కరించకపోతే భవిష్యత్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం.