లోక్ సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే రోజు రానేవచ్చింది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు గురువారం లోక్‌సభ ముందుకు రానుంది. ఇందుకోసం కేంద్రం రంగం సిద్ధం చేసింది. లోక్‌సభలో జీరో అవర్ పూర్తయిన తరువాత బిల్లును సభ ముందుంచనుంది. లోక్సభ వ్యవహారాల జాబితాలో రెండో భాగంలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చినట్లు లోక్సభ సచివాలయం పేర్కొంది.
ఆర్టికల్ 117 (బి) ప్రకారం బిల్లును కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక సభలో బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టిస్తే అవసరమైతే వారి సస్పెన్షన్‌కు తీర్మానాన్ని ప్రతిపాదించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే విభజన బిల్లును సభ ముందుకు తెచ్చేవరకూ ఈ విషయంపై సస్పెన్స్‌ను కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.