టీ బిల్లుపై రాష్ట్రపతికి బీజేపీ సీమాంధ్ర నేతల నివేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పేరిట కేంద్రం తయారు చేసిన ముసాయిదా సీమాంధ్రను పచ్చి మోసం చేసేదిలా ఉందని ఆ ప్రాంత బీజేపీ నేతలు రాష్ట్రపతికి నివేదించారు. విభజనపై సీమాంధ్రుల అనుమానాలు నివృత్తి కాకుండానే బిల్లు ఆమోదం పొందే పరిస్థితి తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు నాయకత్వంలో 8 మంది ప్రతినిధులు ఆదివారం ఇక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఐదు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బిల్లు ఆధారంగా రాష్ట్ర విభజన జరిగితే ఇంతకు మించిన ఘోరం, అన్యాయం మరొకటి ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తయారు చేయించిందని రఘునాధబాబు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్రులు వ్యక్తం చేస్తున్న పది అనుమానాలను నివృత్తి అయ్యేలా చూసి తమకు న్యాయం చేయూలని రాష్ట్రపతిని కోరారు. పార్టీ నేతలు కె.శాంతారెడ్డి, ఎస్.సురేష్‌రెడ్డి, వి.శ్రీనివాసరాజు, ఎ.హరినాథ్‌రెడ్డి, కె.కోటేశ్వరరావు, విష్ణువర్ధన్‌రెడ్డి, వై.ఆదిత్య ప్రతినిధి బృందంలో ఉన్నారు.
వినతిపత్రంలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి..
పోలవరాన్ని నీటి పారుదల ప్రాజెక్టులా కాకుండా కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించినట్టుగానే బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా నిర్మించాలి. ఈ మేరకు బిల్లులో మార్చాలి. 2005 జూన్ 27న విడుదల చేసిన జీవో నెంబర్ 111 ప్రకారం పోలవరం ముంపునకు గురయ్యే 134 గ్రామాలను, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలోనే కలపాలి. ఈ మేరకు బిల్లును సవరించాలి.
తెలంగాణ, సీమాంధ్రలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల రక్షణకు భద్రత కల్పించేలా కొత్త క్లాజ్‌ను చేర్చాలి. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు గోదావరి నది నుంచి కృష్ణా బేసిన్‌కు 200 టీఎంసీల నికర జలాలను తరలించేలా మరో క్లాజ్‌ను చేర్చాలి.
ఉమ్మడి రాజధాని, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలి.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని నగరాన్ని కూడా ఈ బిల్లులోనే ప్రకటించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎక్కడుండాలనే అంశాన్ని ఎంచుకునేందుకు విధిగా ఆప్షన్ ఇవ్వాలి.
ఆర్థ్ధిక పత్రం లేకుండా బిల్లు ఉండదు. కానీ ఈ బిల్లులో అది లేకుండా పోయింది.
రాష్ట్ర ఆదాయంలో 30 శాతంగా ఉన్న హైదరాబాద్ ఆదాయాన్ని ఎలా పంచుతారో, అది ఎంతకాలం వర్తిస్తుందో ఈ బిల్లులో లేకపోవడం సీమాంధ్రను దగా చేయడమే.
సీమాంధ్రలో మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను 12, 13 పంచవర్ష ప్రణాళికల కాలంలో నిర్మిస్తారని 93వ క్లాజ్‌లో పేర్కొన్నారు. 12వ ప్రణాళిక కాలంలో ఇప్పటికే రెండేళ్లు గడిచింది. మిగిలిన మూడేళ్లలో కేటాయింపులు వచ్చే అవకాశం లేదు. అందువల్ల నిర్దిష్ట కాలపరిమితితో వీటిని నిర్మించేలా ప్రణాళికా సంఘం హామీ ఇవ్వాలి. వైజాగ్- చెన్నయ్ పారిశ్రామిక కారిడార్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, నూతన రైల్వే జోన్ వంటి వాటిపై నిర్దిష్ట ఉత్తర్వులు చేర్చాలి.
వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో ఉపాధి కల్పనకు వైఎస్సార్ కడప జిల్లాలో బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ స్థానంలో నూతన కర్మాగారాన్ని నిర్మించాలి. వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రలకు ఆర్థిక ప్యాకేజీలను విధిగా ప్రకటించాలి.