సీమాంధ్రలో ఊపందుకున్న నిరసనల పర్వం | seemandhra supporters protest against telangana bill | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో ఊపందుకున్న నిరసనల పర్వం

Published Tue, Feb 18 2014 9:05 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

సీమాంధ్రలో ఊపందుకున్న నిరసనల పర్వం - Sakshi

సీమాంధ్రలో ఊపందుకున్న నిరసనల పర్వం

విశాఖ:  తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో  రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (తెలంగాణ) బిల్లుపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ సమైక్య వాదులు వీధుల్లో కదం తొక్కుతున్నారు.  దీనిలో భాగంగా విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.  జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేశారు.  కాంగ్రెస్-బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని చీల్చేందుకు పూనుకున్నాయని ఆందోళనను తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్-బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతూ విభజన పర్వానికి తెరలేపి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడుతున్నారు.

అనంతపురం జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజల సమైక్య విన్నపాన్ని కేంద్ర పట్టించుకోకుండా విభజన చేసి సీమ ప్రాంతాలకు అన్యాయం చేశారంటూ నిరసనలతో ఉద్యమాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఎన్హెచ్-44ను నిర్భందించారు. దీంతో రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి.
 
ఇదిలా ఉండగా మంత్రుల ఇళ్ల వద్ద  సమైక్యం దాడులకు దిగుతున్నారు. మంత్రుల చేతకాని తనం వల్లే రాష్ట్ర విభజన సాధ్యపడుతుందని ఆరోపిస్తూ విశాఖలోని గంటా శ్రీనివాస్ కార్యాలయాన్నిముట్టడించి కాంగ్రెస్ జెండాలను దగ్ధం చేశారు.  నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement