అనంత: తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకర(తెలంగాణ) బిల్లుపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ వీధుల్లో కదం తొక్కుతున్నారు. దీనిలో భాగంగా అనంతలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. విద్యార్థులు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఎన్హెచ్-44ను నిర్భందించారు. దీంతో రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి.
ఇదిలా ఉండగా మంత్రుల ఇళ్ల వద్ద సమైక్యం దాడులకు దిగుతున్నారు. మంత్రుల చేతకాని తనం వల్లే రాష్ట్ర విభజన సాధ్యపడుతుందని ఆరోపిస్తూ విశాఖలోని గంటా శ్రీనివాస్ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ జెండాలను దగ్ధం చేశారు. నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.