3 నెలలు తర్వాతే?
రెండు రాష్ట్రాలు ఏర్పడటానికి 60, 70 రోజులు తప్పనిసరంటున్న అధికారులు
ముందుగా ఆస్తులు, అప్పులు, అధికారుల పంపిణీ
ఆర్‌బీఐ ఆథరైజేషన్, విడి ఖాతాలు, ఫైళ్ల విభజన..
ఇవన్నీ కొలిక్కి వస్తేనే వేరు పాలన వీలయ్యేది!
సాక్షి, హైదరాబాద్: విభజన ఖాయమైపోయినా, రాష్ట్రపతి ఆమోదవుుద్ర, గెజిట్ జారీ లాంఛనమే అయినా, ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చి రెండు రాష్ట్రాలూ అధికారికంగా ఉనికిలోకి రావడానికి కనీసం మరో రెండు మూడు నెలల సమయం పట్టనుంది. రెండు రాష్ట్రాలూ విడిగా పాలన మొదలు పెట్టేందుకు అత్యవసరమైన మౌలిక ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఈ మాత్రం గడువు తప్పనిసరని ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారుు. ఈ క్రమంలో మున్ముందుగా సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల విభజనను చేపట్టాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు వీలుగా ఆయా ప్రభుత్వాలు జారీ చేసే చెక్కులు చెల్లేందుకు ఆర్‌బీఐ ఆథరైజేషన్ జారీ చేయాలి. రెండు రాష్ట్రాలకూ ఒక్కో లీడ్ బ్యాంక్‌ను ఖరారు చేయాలి.
వీటితో పాటు శాఖలవారీగా అతి ముఖ్యమైన ఫైళ్లను తెలంగాణ, సీమాంధ్రవారీగా విభజించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే రెండు రాష్ట్రాల రోజువారీ పాలనావసరాలను ప్రాథమికంగానైనా తీర్చడం వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. ‘విభజన ప్రక్రియకు కనీసం 3 నెలలు పట్టవచ్చని కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, సుశీల్‌కుమార్ షిండే చెబుతున్నది కూడా ఈ ముఖ్యమైన ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకునే! అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లోనూ విభజన ప్రక్రియ పరిపూర్ణం కావటానికి ఏడాది, అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. అంటే రెండు రాష్ట్రాలూ విడిగా పాలన మొదలు పెట్టాక కూడా విభజన ప్రక్రియ చాలా రోజులే కొనసాగనుంది’ అని వారు వివరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేసి, ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక విభజన ప్రక్రియు అధికారికంగా వేగం పుంజుకోనుంది. గెజిట్‌లో పేర్కొనే అపారుుంటెడ్ డే నుంచి రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వస్తాయి. పలు కీలకమైన విభాగాలు తదితరాలను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే ప్రక్రియను ఆలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. అస్తులు, అప్పులు, ఆదాయం, ఉద్యోగులు, పెన్షనర్లు, అఖిల భారత స్థాయి అధికారులు, బ్యాంకు లెక్కలు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆథరైజేషన్, చెక్‌బుక్కులు, ఆర్థిక సంస్థలకు రాష్ట్ర విభజన సమాచారమివ్వడం తదితరాలతో కూడిన కార్యాచరణను అపారుుంటెడ్ డే నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంటుందని పలువురు ఉన్నతాధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ఆ వివరాలు...
విభజన విధివిధానాలను కేంద్రం ముందుగా రూపొందించాల్సి ఉంటుంది.. ఆస్తులు, అప్పులు, ఆదాయం తదితరాలను ప్రణాళికా సంఘం, ఆర్‌బీఐ చూసుకుంటా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ నుంచి దాని ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగడానికి, అంటే ప్రభుత్వ చెక్కులు పాసవడానికి వీలుగా అన్ని ఆర్థిక సంస్థలకూ ఆర్‌బీఐ ఆథరైజేషన్ జారీ చేయూలి
రెండు రాష్ట్రాలకూ లీడ్ బ్యాంకులను ఖరారు చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఆంధ్రా బ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా ఉంది. సీమాంధ్రకు కూడా దాన్నే కొనసాగిస్తారని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రానికి లీడ్ బ్యాంక్‌గా ఆర్‌బీఐ నిర్ణయిస్తుందని సమాచారం
అధికారుల పంపిణీ
రాష్ట్ర క్యాడర్‌కు ఎంపికైన ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ అధికారులు ఏ రాష్ట్రంలో పని చేయాలనుకుంటున్నదీ తెలుపుతూ వారి నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకోవడం, అభ్యంతరాలుంటే పరిష్కరించడం తదితరాలకు 30-35 రోజులు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర అధికారులకు సంబంధించి ఆయా విభాగాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల గణాంకాలు సేకరించి, వారికీ విభజన ఆప్షన్స్ ఇవ్వాలి. ఇబ్బందుల్లేకుండా వారిని ఇరు ప్రాంతాలకూ పంపిణీ చేయూలి. పెన్షనర్లను కూడా కేంద్రం రూపొందించే విధివిధానాలకు అనుగుణంగా పంపిణీ చేయాలి.
ఫైళ్ల విభజన
విభజన ప్రక్రియులో ప్రధానంగా ఫైళ్ల విభజనకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం ఫైళ్లన్నీ ఆయా విభాగాల్లో సెక్షన్లవారీగా ఒకే చోట ఉన్నాయి. వాటన్నిటినీ విభజించి ఆయా రాష్ట్రాలకు అప్పగించాల్సి ఉంది. విభాగాలవారీగా ఫైళ్లను వేరు చేసి ఆయా రాష్ట్రాలకు అందివ్వడం, రసీదులు తీసుకోవడం తదితర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున నగరంలో సీమాంధ్ర ప్రభుత్వానికి అవసరమైన భవనాలు, పరికరాలు, వాహనాలను సమకూర్చాలి.