'వార్రూమ్ భేటీకి మాకు ఆహ్వానం లేదు'
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించినట్లే... పార్లమెంట్లోనూ సీమాంధ్ర ఎంపీలందరూ వ్యతిరేకిస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా గాయన చంద్రబాబు అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో ఒక్కమాట మాట్లాడని చంద్రబాబు ఢిల్లీలో విభజనకు అనుకూలమైన బీజేపీతో తిరుగుతున్నారని మండిపడ్డారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేస్తారని బొత్స స్పష్టం చేశారు. కాంగ్రెస్ వార్రూమ్ సమావేశానికి తనకు, ముఖ్యమంత్రికి ఆహ్వానం లేదని ఆయన తెలిపారు. కేవలం తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు మాత్రమే వెళతారని బొత్స పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూమ్‌లో జరగబోతున్న అత్యవసర సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటనే దానిమీద రాష్ట్రరాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ బిల్లుకి పార్లమెంటులో ఎలాగైనా ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వార్ రూమ్ సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఇది ముందుగా నిర్ణయించినది కాకపోవడం గమనార్హం.
ఇందులో సీమాంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు మాత్రం ఈ సమావేశానికి ఆహ్వానాలు అందలేదు. సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఒకచోట కూర్చోబెట్టి వారితో సంప్రదింపులు జరపాలని కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి నిర్ణయించినట్టు తెలిసింది.