టీడీపీలో కాంగ్రెస్ విలీనం అవుతుందేమో: కోడెల
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ శనివారం గుంటూరులో ఎద్దెవా చేశారు. మరో 25 ఏళ్ల వరకు ఆ పార్టీ సీమాంధ్రలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే స్వయంగా ప్రకటిస్తున్నారన్నారు. అలాంటి పార్టీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే టీడీపీ మరో కాంగ్రెస్ పార్టీ అవుతుందని కోడెల ఈ సందర్భంగా టీడీపీ నాయకత్వాన్ని హెచ్చరించారు. చూడబోతే టీడీపీలో కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతున్నట్లుందని ఆరోపించారు.
కాంగ్రెస్ దుష్ట పాలనపై టీడీపీ కార్యకర్తలు, నేతలు పోరాడిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తుది వరకు కృషి చేసినట్లు ఆయన వివరించారు. విజభన జరిగినే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన అవశ్యకతను కోడెల ఈ సందర్భంగా విశదీకరించారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో అటు నాయకులు, ఇటు ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న ఎన్నికలలో పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతు కాక తప్పదని సదరు నేతలు భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది పార్టీ కండువా వేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. దాంతో కోడెల శివప్రసాద్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా టీడీపీలోకి వస్తే పార్టీ కూడా మునిగిపోక తప్పదని కోడెల ఈ సందర్భంగా టీడీపీ అగ్రనాయకత్వాన్ని హెచ్చరించారు.