హైదరాబాద్‌లో గవర్నర్‌గిరీని ఒప్పుకోం: కోదండరాం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ టీఎన్జీవో భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 8 తెలంగాణ ప్రజలు కోరుకున్నది కాదని, పరస్పర సమాచారం కోసం, ప్రజల్లో విశ్వాసం కల్పించడమే దాని ఉద్దేశమన్నారు. ప్రశాంత వాతావరణంలో అన్ని ప్రాంతాల ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్న హైదరాబాద్‌లో గవర్నర్, కేంద్రపెత్తనం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఉన్న ప్రజల స్వేచ్చకు భంగం కలిగినప్పుడు, ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వచ్చినప్పుడు, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అవసరమని, అది కూడా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సంతృప్తిలేక పోతే గవర్నర్ అభిప్రాయాన్ని చెప్పవచ్చన్నారు. కానీ ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించి.. తద్వార హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని కోదండరాం చెప్పారు. కేవలం ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో తప్పు జరిగితే న్యాయవ్యవస్థలో తేల్చుకోవాలని.. లేదా మానవహక్కుల సంఘాలను కలవాలే కానీ ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరించడం సరికాదని కోదండరాం పేర్కొన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన జేఏసీ.. తెలంగాణ స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి వెనుకాడదని హెచ్చరించారు.