సంప్రదాయ దుస్తులు ధరించిన యువత మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తుండగా జగన్నాథ రథయాత్ర వైభవంగా ముందుకు సాగింది. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని జగన్నాథ మందిరం వద్ద రథయాత్ర కోలాహలం ఆకట్టుకుంది. గవర్నర్ దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు నిర్వహించారు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి ఉత్సవమూర్తుల విగ్రహాలను రథాలపైకి చేర్చే ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పూజలు మధ్యాహ్నం 1 గంటకు రథాలను లాగే ఘట్టంతో కన్నుల పండువగా జరిగాయి. సరిగ్గా 3.30 గంటలకు ముగ్గురూ దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని కనకదుర్గా దేవాలయానికి చేర్చారు. దారి పొడవునా భక్తులు రథయాత్రను తిలకించారు.