బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జగన్నాథుడి రథయాత్ర శనివారం వైభవోపేతంగా సాగింది. ఉదయం ఉత్సవమూర్తులకు మంగళహారతి, రథాల ప్రతిష్ట, విగ్రహాలను రథాలపైకి తరలించే పొహండి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి మేళతాళాల మధ్య రథాలపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు రథాలపై చెరా పొహరా(బంగారు చీపురుతో ఊడవడం) నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య మూడు రథాలు బంజారాహిల్స్‌రోడ్ నెం.12లో ఊరేగింపుగా బయల్దేరాయి.
ఎనిమిది రోజుల అనంతరం ఈ నెల 26వ తేదీన తిరుగు రథయాత్ర(బహుద) ఉంటుంది. యాత్ర సందర్భంగా బంజారాహిల్స్ రహదారులు జనసంద్రంగా మారాయి. నగర నలుమూలల నుంచి భక్తులు ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రోడ్లకిరువైపులా బారులు తీరారు. నగరంలో నివసించే ఒడిస్సా వాసులంతా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. సుమారు 50 వేల మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. సుమారు నాలుగు గంటల పాటు రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను సమీపంలోని కనకదుర్గ దేవాలయంలో ప్రతిష్టించారు.