రెక్కాడితే గాని డొక్కాడని గూడు అది. ఆ గూడులో బిడ్డల భారాన్ని మోస్తూ వారి కోసం కొలిమి సెగల్లో స్వేదాన్ని చిందిస్తూ శ్రమిస్తున్న ఓ మాతృమూర్తి ఆముదమ్మ. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని కొర్లగుంట సర్కిల్లో పొద్దు పుట్టింది మొదలు పొద్దు కూకే వరకు నిప్పుల రవ్వల నడుమ అలుపెరగని కెరటంలా ఆమె పడిలేస్తుంటుంది. చిల్లుబడిన పాత్రలకు అతుకులు వేస్తూ కనిపిస్తుంటుంది. వయస్సు సహకరించకపోయినా, బిడ్డల కుటుంబం కోసం కూడా పరితపిస్తున్న ఆ పండుటాకును సాక్షి మాట్లాడించింది.
‘‘కన్నుమూసినా కలలో కూడా బిడ్డల గురించే తపన. అమ్మా అనే పిలుపు కలలో కూడా నన్ను తట్టి లేపుతుంది. మా పూర్వీకులది తమిళనాడు. నా చిన్నతనంలోనే తిరుపతికి వలస వచ్చేశాం. మా కుల వృత్తి కాకపోయినా బతుకు తెరువు కోసం కొలిమి పనే జీవనంగా చేసుకున్నా. చిన్నతనంలోనే పెళ్లి చేశారు. నా భర్త పరశురాం. ఆయన ఇదే వృత్తిని చేసేవారు. కొలిమి పనిలో ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేదాన్ని. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిని ఎంతో కష్టంతో పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాము.
భర్త చేసిన తప్పులతో అంతో ఇంతో కూడబెట్టుకున్న కష్టార్జితం అప్పులపాలైంది. బ్రతుకు జీవుడా అంటూ ప్రస్తుతం కాలం వెళ్ల దీస్తున్నాం. పిల్లలదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం నేను పెద్దకూతురు దగ్గర ఉన్నాను. తన కూతురు మానసిక వ్యాధితో మంచం పట్టింది. అల్లుడు కష్టజీవే. అయితే కష్టానికి తగిన సంపాదన లేక ఇల్లు గడవడం కష్టతరంగా మారింది. ఆ బిడ్డ కుటుంబం కోసం నా వంతుగా కష్టాన్ని చేసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నా. కొడుకు అర్థిక పరిస్థితి కూడా బాగోలేదు.
అతడూ ఇదే కొలిమి వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. నా కష్టార్జితంలో అతనికి కొంత ఇస్తూ సహకరిస్తున్నాను. నా బాగుకన్నా బిడ్డల బాగే నాకు సంతృప్తి. అందుకే నా కంటూ పైసా మిగిల్చుకోలేదు. దాచుకోవాలన్న ఆలోచనా భగవంతుడు నాకు ఇవ్వలేదు. ఉన్నంతలో తిని తినక కాలం గడుపుతున్న సమయంలోనా భర్త దూరమవడం మరింత బాధను, బాధ్యతను భారాన్ని మిగిల్చింది. అందుకే 70 ఏళ్లు పైబడినా బిడ్డలకు బాసటగా నిలుస్తున్నా.
ఆదుకునే వారు లేక
‘‘కష్టమే జీవనంగా సాగే మా లాంటి నిరుపేద జీవులను ఆదుకునే వారు లేక అగసాట్లు పాలవుతున్నాం. సర్కారోళ్లు నిరుపేదలకు ఇచ్చే ఫించను, ఇల్లు కూడా మాకు దరిచేరలేదు. రోజంతా సెగలో చమటోడ్చితే రోజుకు రూ.200లు వస్తుంది. దీంతో బిడ్డల అతుకుల బతుకుల బాగుకోసం ఖర్చుచేస్తూ జీవనం సాగిస్తున్నా. వయోభారం మీద పడుతోంది. శ్రమించే శక్తి నశిస్తోంది. బిడ్డల బతుకులు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. తమ లాంటి పేదోళ్లకు సర్కారోళ్లు సాయం చేసి ఆదుకోవాలి’’ అని కోరుతోంది ఆముదమ్మ.
పసితనంలో కంటిరెప్పలా.. బాల్యంలో భవితకు తోడుగా.. యవ్వనంలో మార్గదర్శిగా.. భూదేవి కన్నా ఓర్పుతో.. కన్నబిడ్డలకు నీడగా నిలిచి సేవలందించే సహృదయ మూర్తులు తల్లిదండ్రులు. పిల్లల సంక్షేమమే శ్వాసగా, ధ్యాసగా బతుకు సాగిస్తారు. వృద్ధాప్యంలో కూడా పేగు బంధమైన బిడ్డల కోసం నిరంతరం తపిస్తారు. చరమాంకంలో సైతం తమ వంశాకుర కుసుమాలకు తోటమాలిగా కంటికి రెప్పలా కాపుకాస్తారు. నేటి వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆముదమ్మ లాంటి అమృతమూర్తులందరికీ ప్రణామాలు.
– పోగూరి చంద్రబాబు, సాక్షి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment